రోడ్లపై అడుగుకో గుంత

ABN , First Publish Date - 2021-07-15T06:51:05+05:30 IST

జిల్లాలో రోడ్లు అత్యంత అధ్వానంగా మారాయి. రెండేళ్లుగా అభివృద్ధి కాదు కనీసం మరమ్మతులు కూడా లేకుండా ఉన్నాయి.

రోడ్లపై అడుగుకో గుంత
కదిరి నుంచిబెంగళూరుకు వెళ్లే రహదారి దుస్థితి ఇది

రహదారులు అధ్వానం

రోడ్లపై అడుగుకో గుంత 

ప్రజలకు ప్రత్యక్ష నరకం  

రెండేళ్లుగా లేని మరమ్మతులు 

చిన్న వర్షాలకే దెబ్బతిన్న వైనం

పట్టించుకోని పాలకులు, అధికారులు

అనంతపురం, జూలై14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్లు అత్యంత అధ్వానంగా మారాయి. రెండేళ్లుగా అభివృద్ధి కాదు కనీసం  మరమ్మతులు కూడా లేకుండా ఉన్నాయి. మరమ్మతుల కోసం టెండర్లు పిలిచినా ఏ కాంట్రాక్టరూ ప్యాచ్‌ వర్కులు చేసేందుకు ముందుకు రావడం లేదు.  బిల్లులు సకాలంలో అందవేమోనన్న అభద్రతాభావం వారి వెనుకడుగుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది రూ.7.5 కోట్లతో రోడ్ల మరమ్మతుల కోసం నాలుగుసార్లు టెండర్లు పిలిచినా ఏ ఒక్క కాంట్రాక్టరూ ముందుకు రాకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈక్రమంలో చిన్న గుంతలు కాస్తా.. గోతులుగా మారాయి. దీంతో రోడ్లపై ప్రయాణమంటే ప్రజలకు ప్రత్యక్ష నరకంగా మారింది. ఆర్‌అండ్‌బీ అయినా పంచాయతీ రహదారులైనా అడుగుకో గుంతతో అధ్వానంగా మారాయి. ముఖ్యంగా గ్రామీణ రోడ్లు బురదమయమవుతున్నాయి. తాజాగా కురుస్తున్న చిన్నపాటి వర్షాలతో రోడ్లన్నీ నీటి కుంటలను తలపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే భారీ వర్షాలు కురిస్తే రోడ్లపై ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఏర్పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 



అడుగుకో నీటికుంటను తలపిస్తున్న చెరువుకట్ట రోడ్డు

తాడిపత్రి నుంచి బెంగళూరుకు వెళ్లే వాహనాలు అనంతపురం నగరంలోకి రాకుండా బైపాస్‌ అయ్యేలా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చెరువుకట్టపై రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఆ రోడ్డు గుంతలు పడి అడుగుకో నీటికుంటను తలపిస్తోంది. చిన్న చిన్న గుంతలు పడినప్పుడే మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో పాటు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ గుంతలన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరకు ప్రయాణం చేయాలంటే కేవలం 10-15 నిమిషాలు సమయం పట్టేది. ప్రస్తుతం అరగంటకుపైగా సమయం పడుతోంది. దీనికి తోడు ఏది చిన్నగుంతో, ఏది పెద్ద గుంతో తెలియక వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. 



ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లే రోడ్లదీ అదే దుస్థితి...

గతంలో రోడ్లంటే ఇలా ఉండాలని పుట్టపర్తికి వెళ్లే రహదారులను నమూనాగా చూపేవారు. విదేశాల్లో రోడ్లను తలపించేలా ఉన్నాయంటూ సత్యసాయిబాబాను దర్శించుకునేందుకు వచ్చే విదేశీ భక్తులు చెప్పేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పుట్టపర్తికి వెళ్లే రోడ్లు  అధ్వానంగా ఉన్నాయి. దీంతో సత్యసాయిబాబా సమాధిని దర్శించుకునేందుకు, అక్కడి పర్యాటక ప్రాంతాలను చూసేందుకు పుట్టపర్తికి వెళ్లే జిల్లావాసులు, విదేశీ భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.  ముఖ్యంగా ఎనుములపల్లి నుంచి చిత్రావతి బ్రిడ్జి వరకూ ఏర్పాటు చేసిన బైపాస్‌ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. పుట్టపర్తి నుంచి పెద్దకమ్మవారిపల్లికి వెళ్లే రోడ్డు మరీ అధ్వానంగా మారి ప్రయాణం దుర్భరంగా మారుతోంది. పెడపల్లి నుంచి గంగంపల్లికి వెళ్లే రహదారిపై మోకాలిలోతు గుంతలు దర్శనమిస్తున్నాయి. కంబాలపర్తి నుంచి బొంతలపల్లికి వెళ్లే రహదారి కంకర తేలి పెద్ద పెద్ద గుంతలతో మడుగును తలపిస్తోంది. ప్రతి ఏడాది సత్యసాయిబాబా జయంతిని పురస్కరించుకొని రోడ్లకు మరమ్మతులు చేసే వారు. గత రెండేళ్లుగా వాటిని పట్టించుకోకపోవడంతో ప్రయాణమంటేనే ప్రజలు బెంబేలె త్తిపోయేలా తాజా పరిస్థితులు నెలకొన్నాయంటే రోడ్ల దుస్థితి ఏపాటిదో  అర్థం చేసుకోవచ్చు. 



ఆర్‌అండ్‌బీ రోడ్లపై ప్రయాణం నరకమే!

రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షణలోని రోడ్లపై ప్రయాణ మంటే నరకంగానే ఉంటోంది. గుత్తి-పత్తికొండ, గుత్తి-అనంతపురం ప్రధాన రోడ్లు గోతులు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తూతూ మంత్రంగా గోతులకు మరమ్మతులు చేసినా ప్రస్తుతం కురుస్తున్న చిన్న వర్షాలకే ఆ పనుల్లో డొల్లతనం బయటపడింది. వారం తిరక్కముందే మరోసారి గోతులు ఏర్పడ్డాయి. ఆ గోతుల్లో వర్షపు నీరు చేరడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఉరవకొండ ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. జాతీయ రహదారి పక్కన పట్టణంలోకి ప్రవేశించే ప్రధాన రహదారిపైనా అడుగడుగునా గుంతలు పడటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. తాడిపత్రి నుంచి అనంతపురం మీదుగా హైదరా బాదుకు పెద్ద సంఖ్యలో లారీల రాకపోకలతో రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతోంది. ఈ రోడ్డుపై ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ప్రయాణం చేయాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. తాడిపత్రి నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణమంటేనే హడలిపోతున్నారు. కదిరి-రాయచోటి రోడ్డు స్థితి మరీ ఘోరంగా తయారైంది. కదిరి-బెంగళూరు రోడ్డుపై గుంతలు పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రోడ్లన్నీ గుంతలమయమైనప్పటికీ సంబంధిత అధికారులు మరమ్మతులపై దృష్టి సారించడం లేదు. దీంతో రోడ్లు మరింత ధ్వంసమవుతున్నాయి.  



ఘోరంగా గ్రామీణ రోడ్లు 

జిల్లాలో ఏ గ్రామీణ రోడ్డు చూసినా కంకర తేలి, బురదతో నిండి ఉంటోంది. ఈ రోడ్లపై ప్రయాణమంటేనే గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి దారుణంగా ఉంటోంది. వాహనాలు  జారి కిందపడతాయేమోనన్న అభద్రతాభావంలో ద్విచక్రవాహన దారులున్నారు. ఆదమరిస్తే ఏ గోతిలోనో, ఏ బురదమట్టిలోనో పడిపోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తద్వారా కాళ్లు లేదా చేతులు విరగొట్టుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. బత్తలపల్లి మండలంలోని మాల్యవంతం గ్రామంలో ప్రధాన రహదారిపై భారీగా గుంతలు పడ్డాయి. ఈ రహదారిలో వెళ్లాలంటే వాహనదారులు వణికిపోతున్నారు. రాయదుర్గం మండలంలోని వీరాపురం, కొండాపురం గ్రామాల మధ్యలో ఉన్న ఒక కిలోమీటరు రోడ్డు నిర్లక్ష్యానికి గురై అధోగతి పాలైంది. డీ హీరేహాళ్‌ మండలంలోని పులకుర్తి, మల్లికేతి గ్రామాల మధ్యలో ఉన్న రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయం. కణేకల్లు నుంచి బళ్లారికి వెళ్లే మార్గంలోని గెణిగెర గ్రామ రోడ్డు పూర్తిగా పాడైపోయింది. జక్కలవడికి గ్రామానికి వెళ్లే నాలుగు కిలోమీటర్ల రహదారి, కణేకల్లు నుంచి కొత్తపల్లికి వెళ్లే రోడ్డు, కొత్తపల్లి నుంచి ఆదిగానెపల్లికి వెళ్లే రోడ్లపై గుంత లు పడ్డాయి.  చిన్న వర్షాలకే రోడ్లపైన గుంతల్లో నీరు నిలవడంతో కుంటలను తలపిస్తున్నాయి. బొమ్మనహాళ్‌ మండలంలోని ఉద్దేహాళ్‌ నుంచి బండూరు వరకు వెళ్లు నాలుగు కిలోమీటర్ల రోడ్డు పరిస్థితి ఘోరంగా ఉంది. రంగాపురం గ్రామం నుంచి గౌనూరుకు వెళ్లే రోడ్డు, దర్గాహోన్నూరు నుంచి వన్నళ్లికి వెళ్లే రోడ్డుపైన అడుగడుగునా గుంతలు పడటంతో మడుగును తలపిస్తున్నాయి. పెనుకొండ మండలం గుట్టూరు నుంచి మునిమడుగు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. అమ్మవారుపల్లి నుంచి వెంకటగిరిపాళ్యం పంచాయతీరాజ్‌ శాఖ రోడ్లు కంకర తేలడంతో పూర్తిగా పాడైంది. లేపాక్షి నుంచి గలిబిపల్లికి వెళ్లే రోడ్డుపై కంకర వేసి వదివేయడంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. గుంతకల్లు మండలం ఎన్‌ కొట్టాల రహదారి చిన్నపాటి వర్షాలకే కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ కార ణంగా ఆటోలు ఆ గ్రామంలోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఊరికి దూరంగా వాహనాలు దిగి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  గుత్తి మండలం ధర్మాపురం-యంగన్నపల్లి, యంగన్నపల్లి నుంచి బేతాపల్లికి వెళ్లే రోడ్డు గుంతలమయం కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విడపనకల్లు మండలం చీకలగురికి-ఉరవకొండ రోడ్డు గత వర్షాలకు పూర్తిగా శిథిలమైంది. ఇదే రోడ్డుపై ఆరేళ్ల కిందట నిర్మిం చిన వంతెన వర్షాలకు కుంగిపోయింది. గాజుల మళ్లాపు రం వెళ్లే దారిలోను కల్వర్టు పూర్తిగా కోతకు గురి కావ డంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కూడేరు మండలం గొట్కూరు, అరవకూరు, రామచంద్రా పురం, ఎంఎం హళ్లి గ్రామాలకు సరైన రోడ్లే లేవు. దీంతో వర్షం వస్తే గ్రామం నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్లాలం టే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  కనగానపల్లి నుంచి కుందుర్పికి వెళ్లే రోడ్డు అడుగడుగునా కోతకు గురై నీటికుంటలను తలపిస్తోంది.



Updated Date - 2021-07-15T06:51:05+05:30 IST