అవినీతి సామ్రాట్‌

ABN , First Publish Date - 2021-07-31T06:47:40+05:30 IST

పురపాలక సంఘ కార్యాలయంలో టీపీఎస్‌ అవినీతికి అంతేలేకుండా పోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అవినీతి సామ్రాట్‌
రాయదుర్గంలో అక్రమంగా వెలసిన లేఔట్లు

అక్రమార్కులకు అండగా టీపీఎస్‌

 రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి రూ.కోటి  వసూలు

 ఉరవకొండ కేంద్రంగా  ముడుపుల బాగోతం 

 ఆరోపణల నేపథ్యంలో బదిలీకి యత్నాలు

రాయదుర్గం టౌన్‌, జూలై30: పురపాలక సంఘ కార్యాలయంలో టీపీఎస్‌ అవినీతికి అంతేలేకుండా పోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతికి ప్రణాళిక విభాగం అడ్డాగా మారిందనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఆ అధికారి ప్రవర్తనతో మొత్తం శాఖకే చెడ్డపేరు వస్తుందనే ఆవేదన మిగతా ఉద్యోగుల్లో కనిపిస్తోంది. పురపాలక సంఘం పరిధిలో 19 అధికారిక, 40  అనధికారిక లేఔట్లు ఉన్నట్లు టీపీఎస్‌ ఇటీవల లెక్కలు తేల్చారు. సర్వే నెంబర్లు 251, 290-1, 324, 332-1, 407, 268, 188, 314, 123, 167బి, 421, 196ఏ, 410ఏ, 419, 300ఏ, 434, 391బి లలో అక్రమ లేఔట్ల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు. ఆయా లేఔట్ల  యాజమానులకు నోటీసులు కూడా ఇటీవల జారీ చేసి, అందులో పాతిన రాళ్లను తొలగించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమ దందా సాగిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో టీపీఎస్‌ కుమ్మక్కయినట్లు ఆరోపణలు బలంగా వస్తున్నాయి. వాటిని కప్పి పుచ్చేందుకు డీల్‌ కుదుర్చుకుంటున్నట్లు తెలిసింది. ఒక్కో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలిగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి రూ.కోటి వరకు ముడుపులు తీసుకున్నట్లు పురపాలక సంఘ కార్యాలయంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఆయన సొంత వాహనంలో గుంతకల్లు నుంచి రోజూ రాకపోకలు సాగిస్తూ ఉరవకొండ కేంద్రంగా ముడుపుల బాగోతం నడిపిస్తున్నాడన్న విమర్శలున్నాయి. రియల్‌ వ్యాపారులందరూ ఉరవకొండ, గుంతకల్లు వెళ్లి, ముడుపులు సమర్పించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన అవినీతి వెలుగులోకి రాకముందే రాయదుర్గం నుంచి మకాం మార్చాలన్న ఉద్దేశంతో గుత్తి పురపాలక సంఘ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన రియల్‌ వ్యాపారుల నుంచి సైతం ముడుపులు వసూలు చేయడంతో గుర్రుమంటున్నారు.


ఆరోపణల్లో వాస్తవం లేదు: అబ్దుల్‌ సత్తార్‌, మున్సిపల్‌ టీపీఎస్‌

నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారణమైనవి. పురపాలక సంఘం పరిధిలో 40 అనధికారిక లేఔట్లు గుర్తించాం. వాటిలో రిజిస్ట్రేషన్లు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌, రిజిస్ట్రార్‌, స్థానిక సబ్‌ రిజిష్టర్లకు లేఖలు రాశాం. రిజిస్ట్రేషన్‌ అధికారులు స్పందించి, కొన్ని సర్వే నెంబర్లను బ్లాక్‌ లిస్టులో ఉంచారు. లేఔట్లలో వేసిన రాళ్లను తొలగించాం. అక్రమ లేఔట్ల వ్యాపారాన్ని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.



Updated Date - 2021-07-31T06:47:40+05:30 IST