తప్పించేస్తున్నారా...?

ABN , First Publish Date - 2021-08-20T06:27:31+05:30 IST

ల్లాలో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ ము ఖ్యనేతల ఆదేశాలు అధికారులకు శిరోధార్యంగా మారా యి.

తప్పించేస్తున్నారా...?
ఈ నెల 14వ తేదీన బియ్యం పట్టుబడినట్లు చిలమత్తూరు పోలీసులు నమోదు చేసిన మహాజరునామా

అడ్డంగా దొరికినా... చర్యల్లో మీనమేషాలు 

అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న పోలీసు, రెవెన్యూ అధికారులు 

అసలు సూత్రధారులను తప్పించే పన్నాగం 

బియ్యం లారీ రాత్రి పట్టుబడితే.. మరుసటిరోజు ఉదయం చిక్కినట్లు మహాజరునామా 

‘ఆంధ్రజ్యోతి’ ఆధారాలతో  బట్టబయలు చేసినా... పట్టించుకోని జిల్లా యంత్రాంగం

అనంతపురం, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ ము ఖ్యనేతల ఆదేశాలు అధికారులకు శిరోధార్యంగా మారా యి. ఈ నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు వా రి ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. ఏది చెబితే ఆ పని చేసేస్తున్నారు. పేదల బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ చిలమత్తూరు పోలీసులకు పట్టుబడిన ఘటనలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. అనంతపు రం నగర శివారులోని జంగాలపల్లి పౌరసరఫరాల గో డౌన్‌ నుంచి ఈనెల 13న ఏపీ02టీబీ0036 నెంబరు లారీలో సాయంత్రం 6 గంటల సమయంలో 250 క్విం టాళ్ల పేదల బియ్యాన్ని (పీడీఎస్‌) లోడ్‌ చేశారు. అదేరోజు రాత్రి 8 గంటల సమయంలో చిలమత్తూరు పోలీసులు తనిఖీల్లో ఆ లారీ పట్టుబడింది. రాత్రి స్టేషన్‌కు తరలించారు. మరుసటి రోజు అంటే... 14వ తేదీన పీడీఎస్‌ బియ్యం పట్టివేత శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఆ పేదల బియ్యం అక్రమ రవాణాదారులు అప్రమత్తమయ్యారు. ఆ కేసు నుంచి బయటపడేందుకు అడ్డదారులు వెతికారు. పౌరసరఫరాల అధికారులు మొదలుకొని పోలీసు, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచేందుకు శ్రీకారం చుట్టారు. పౌరసరఫరాల గోడౌన్‌ నుంచి పేదల బియ్యాన్ని తరలించిన కాంట్రాక్టర్‌కు అండగా నిలిచిన అధికార పార్టీలోని ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఆ అక్రమ రవాణా నుంచి అసలు సూత్రధారులను బయటపడేసేందుకు అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తాడిపత్రిలోని స్టాక్‌ పా యింట్‌లో ఆ పేదల బియ్యాన్ని అన్‌లోడ్‌ చేసినట్లు అధికారులతో మౌఖికంగా చెప్పించారు. చిలమత్తూరు పోలీసులకు పట్టుబడిన పేదల బియ్యం లారీకి సంబంధించి అనంతపురంలోని కోర్టురోడ్డులో వేబిల్లులు పుట్టించి, కట్టుకథ అల్లారు. ఈ క్రమంలో చిలమత్తూరు పోలీసులకు పట్టుబడిన పేదల బియ్యం ఎక్కడ లోడ్‌ చేశారు..? ఏ సమయంలో లోడ్‌ చేశారు? ఆ లారీ తాడిపత్రికి వెళ్లి స్టాక్‌ పాయింట్‌లో అన్‌లోడ్‌ చేసిందా...? లేదా..? ఏ రూటులో వెళ్లిందనే అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఆరాతీసింది. తీగ లాగితే డొంక కదిలింది. పేదల బియ్యాన్ని అక్రమంగా ఎలా తరలిస్తున్నారో... ఆధారాలు సేకరించింది. ఆ లారీ అదేరోజు సాయంత్రం 6.32 గంటల సమయంలో మరూరు టోల్‌గేట్‌ మీదుగా బెంగళూరు వైపునకు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డు అయిం ది. చిలమత్తూరు పోలీసులు అదేరోజు రాత్రి 8.00 గంటల సమయంలో పేదల బియ్యం లోడుతో వెళ్తున్న ఆ లారీని పట్టుకున్న వెంటనే స్టేషన్‌కు తరలించారు. అందుకు సంబంధించిన ఆధారాలతో ‘లారీనా... రాకెట్టా’ శీర్షికన ఈ నెల 15వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయినప్పటికీ అధికారులు చర్య లు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించారు. అసలు సూత్రధారులను తప్పించే పనిలోనే వారు నిమగ్నమయ్యారంటే అధికార పార్టీలోని కొందరు ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ ముఖ్య నేతల ఒత్తిళ్లకు ఏ మేరకు తలొగ్గుతున్నారో ఇట్టే అర్థమవుతోంది.


అసలు సూత్రధారులను తప్పించే ఎత్తుగడ

పేదల బియ్యాన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తూ... అడ్డంగా పోలీసులకు పట్టుబడినప్పటికీ... అసలు సూత్రధారులను తప్పించేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. ఈనెల 13వ తేదీన రాత్రి లారీ పట్టుబడితే... మరుసటి రోజు అంటే 14వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో లారీని పట్టుకున్నట్లు మహాజరునామా రాశారంటే అధికార పార్టీ నేతలకు పోలీసు, రెవెన్యూ అధికారులు ఏ మేరకు తలొగ్గుతున్నారో అర్థం చేసుకోవచ్చు. జంగాలపల్లి పౌరసరఫరాల గోడౌన్‌ నుంచి ఆ పేదల బియ్యాన్ని తరలించిన కాంట్రాక్టర్‌.. అధికార పార్టీ సామాజికవర్గానికి చెం దినవారు కావడంతోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు తలొగ్గుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. చిలమత్తూరు ఏఎ్‌సఐ నాగభూషణానికి వచ్చిన సమాచారం మేరకు... ఈనెల 14వ తేదీన ఉదయం 9.30 గం టలకు అనంతపురం నుంచి బెంగళూరుకు అక్రమంగా పేదల బియ్యం తరలిస్తుండగా.. సీఐ ఆదేశాల మేరకు పట్టుకున్నట్లు మహాజరునామాలో పొందుపరిచారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు.. వీఆర్వోలు అశ్వత్థనారాయణ, శ్రీనివాసులు సమక్షంలో ఆ పీడీఎస్‌ బియ్యం లా రీని పోలీసులు పట్టుకున్నట్లు మహాజరునామాలో స్పష్టం చేశారు. బియ్యం లోడ్‌ లారీని రోడ్డుపక్కన వది లి, లారీ డ్రైవర్‌ పారిపోయాడని అందులో పేర్కొన్నారు. క్లీనర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఆ లారీ ఎవరిదన్న వివరాలు స్పష్టం చేయలేదు. లారీతోపాటు అందులో ఉన్న 250 క్వింటాళ్ల బియ్యాన్ని స్వా ధీనం చేసుకున్నట్లు మాత్రమే మహాజరునామాలో పే ర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే అసలు సూత్రధారులను తప్పించేందుకు చిలమత్తూరు పోలీసులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారన్నది తేటతెల్లమవుతోంది. 


ఉన్నతాధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటో..?

పేదల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు దొరికిపోయినా జిల్లా ఉన్నతాధికారులు, పౌరసరఫరాల ఉన్నతాధికారులు మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఉన్నతాధికారు లు సైతం ఈ ఘటనను సీరియ్‌సగా తీసుకోవడం లేద న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ స్థాయి అధికారులు సైతం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారేమోనన్న అనుమానాలకు తావిస్తోంది. పేదల కడుపుకొట్టి అక్రమార్జనకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్య లు తీసుకునే పరిస్థితులు దాదాపుగా జిల్లాలో లేవనే చెప్పాలి. ఎక్కడ పీడీఎస్‌ బియ్యం పట్టుబడినా వ్యాపారులను బలి పశువులను చేస్తున్నారే తప్పా.. అసలు సూత్రధారులపై చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పేదల బియ్యం టన్నులకొద్దీ అక్రమ రవాణాకు పౌరసరఫరాల గోడౌన్‌ కేంద్ర బిందువుగా మారుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూలాల్లోకి వెళ్లకపోవడంతోనే పీడీస్‌ బియ్యం అక్రమ రవాణా జిల్లాలో నిత్యకృత్యంగా సాగుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి జిల్లాస్థాయి ఉన్నతాధికారులు.. అసలు సూత్రధారులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో అన్నదానిపై వేచిచూడాల్సిందే.





Updated Date - 2021-08-20T06:27:31+05:30 IST