పంటను నమిలేస్తున్న కుంకుమ తెగులు

ABN , First Publish Date - 2021-01-10T07:04:18+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో గతేడాది మార్చిలో కోతకొచ్చిన పంటలను రైతు పడేయాల్సి వచ్చింది. కరోనా కాస్త ఉపశమనం లభించాక ఖరీ్‌ఫలో పెట్టిన పంటలు అతివృష్టి దెబ్బకు కుళ్లిపోయాయి. పంట దిగుబడులు కాదు కదా.. పశుగ్రాసం కూడా లేకుండాపోయింది. గత నెలలో నివర్‌ తుఫాను దెబ్బకు వరి పంటా నేలకొరిగి, నష్టపోవాల్సి వచ్చింది.

పంటను నమిలేస్తున్న కుంకుమ తెగులు
ఎండినపంటను చూపుతున్న రైతు

ఎర్ర రంగులోకి మారుతున్న మొక్కలు

ఎండిపోతున్న పంట

పెట్టుబడులు కూడా రావంటున్న రైతులు

అనంతపురం వ్యవసాయం/ విడపనకల్లు/బెళుగుప్ప, జనవరి 9: కరోనా లాక్‌డౌన్‌తో గతేడాది మార్చిలో కోతకొచ్చిన పంటలను రైతు పడేయాల్సి వచ్చింది. కరోనా కాస్త ఉపశమనం లభించాక ఖరీ్‌ఫలో పెట్టిన పంటలు అతివృష్టి దెబ్బకు కుళ్లిపోయాయి. పంట దిగుబడులు కాదు కదా.. పశుగ్రాసం కూడా లేకుండాపోయింది. గత నెలలో నివర్‌ తుఫాను దెబ్బకు వరి పంటా నేలకొరిగి, నష్టపోవాల్సి వచ్చింది. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే రెండో పంట పప్పుశనగపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాతావరణ మార్పులతో పంటను తెగుళ్లు చుట్టుముట్టాయి.  ఇది చాలదన్నట్లు రెండ్రోజుల క్రితం కురిసిన వానకు పంట తుడిచి పెట్టుకుపోయింది. దీంతో పప్పుశనగ పంటను కూడా రైతులు కోల్పోవాల్సి వచ్చింది. ఎండిపోతున్న పంట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పప్పుశనగ పంటకు కుం కుమ తెగులు సోకింది. తద్వారా పంటంతా ఎర్రబారింది. ఆకులు ఎర్రగా మారిన తర్వాత పంట ఎండిపోతోంది. దీని ప్రభావం దిగుబడిపై తీవ్రంగా పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా రబీ సీజన్‌లో నల్లరేగడి భూముల్లో 40వేల హెక్టార్లల్లో పప్పుశనగ సాగు చేశారు. ప్రస్తుతం 70 శాతం పంటలో బుడ్డలు ఏర్పడ్డాయి. మరికొన్ని రోజుల్లో గింజలు ఏర్పడే దశకు చేరుకుంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో బుడ్డల్లో గింజలు నాణ్యంగా ఏర్పడేందుకు ఇబ్బందిగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పలు రకాల తెగుళ్లు సోకుతుండటం దిగుబడిపై ప్రభావం చూపనుంది. కుంకుమ తెగులు సోకటంతో పంటంతా ఎర్రగా మారి, ఆకులు ఎక్కడికక్కడ రాలిపోతున్నాయి. ఈ తెగులు సోకిన మొక్కల్లో కాయలు నాణ్యతగా ఎదడం లేదు. దీంతో పంటంతా నాశనమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ సారి దిగుబడి కష్టమేనంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. విడపనకల్లు మండలంలో దాదాపు 20వేల ఎకరాల్లో పప్పుశనగ సాగు చేశారు. అక్టోబరులో భారీ వర్షాలు కురవటంతో రైతులు ఉత్సాహంగా పంట పెట్టారు. మూడు నెలలుగా పప్పుశనగ పంటను కాపాడుకుంటూ వచ్చిన రైతులకు డిసెంబరులో కుంకుమ పువ్వు తెగులు ఆశించి, తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తెగులు సోకిన పంట మొత్తం కాలిన పంటలాగా నల్లబారిపోతోంది. కాయలు బాగా ఊరే సమయంలో తెగులు సోకటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎకరాకు కనీసం 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అనుకున్న సమయంలో తెగుళ్లు రైతును తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే ఎకరాకు విత్తనం, ఎరువులు, పురుగు మందులు, కలుపు తీయించటం తదితరాలకు రూ.15వేల నుంచి రూ. 20వేల వరకూ పెట్టుబడి పెట్టారు. చివరికి తెగులు సోకి పంట ఎండిపోవటంతో తొలగిస్తే కూలీలకు కూడా అప్పు లు చేసి, డబ్బులివ్వాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తెగులుకు మందులు కూడా లేకపోవటంతో ఏం చేయాలో తోచక రైతులు తలలు పట్టుకుంటున్నారు.


పంట తొలగింపు

పుట్లూరు: మండల కేంద్రానికి చెందిన రైతులు బయపురెడ్డి, సుధాకర్‌రెడ్డి మూడెకరాల్లో పప్పుశనగ సాగు చేశారు. మూడురోజుల కిందట కురిసిన అకాల వర్షానికి పంట పూత రాలిపోయి, పూర్తిగా దెబ్బతింది. చేసేదిలేక పంటను తొలగిస్తున్నారు. వర్షానికి పూతరాలిపోయి పూర్తిగా నేలకొరిగింది. మరికొన్నిచోట్ల వచ్చిన శనగబుడ్డలు నల్లగా మారాయి.


దిగుబడి తగ్గే అవకాశం

కుంకుమ తెగులు సోకటం ద్వారా ఆకులు ఎర్రగా మారి రాలిపోతాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కుంకుమ తెగులు ఎక్కువగా సోకుతోంది. తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. బుడ్డ, కాయలు ఏర్పడే దశలో కుంకుమ తెగులు సోకి ఉంటే 1 గ్రాము కార్బండిజం లేదంటే 2 ఎంఎల్‌ ఎక్సాకొనజోల్‌ను లీటరు నీటికి కలిపి, పిచికారీ చేసుకోవాలి.

-  రామసుబ్బయ్య, శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం,  రేకులకుంట




చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతోంది..

పదెకరాల్లో పప్పుశనగ సాగు చేశా. మూడు నెలలు పాటు కాపాడుకుంటూ వచ్చిన పంటకు ఒక్కసారిగా అంతుచిక్కని తెగులు సోకి, ఎండిపోతోంది. పెట్టుబడులు తడిసి మోపెడయ్యాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వస్తుందో..  ాదో అని భయంగా ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.

- వన్నూరుస్వామి, రైతు,  విడపనకల్లు


నష్టాల పాలవుతున్నాం

ఆరెకరాల్లో పప్పుశనగ సాగు చేశా. అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టా. పంట చాలాబాగుంది అనుకుంటున్న సమయంలో వింత తెగులు సోకి, మొత్తం నల్లగా మారిపోయి, ఎండిపోతోంది. కనీసం దిగుబడి కూడా రాకుండా నష్టాల పాలవుతున్నాం.

- లక్ష్మీదేవి,  రైతు,విడపనకల్లు


పంటంతా  ఎర్రబారింది

మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి శనగకు కుంకు మ తెగులు సో కింది. రోజురోజుకీ పైరుకంతా పాకుతోంది. తెగులు సోకిన మొక్కంతా ఎర్రబారి, పైరు ఎండిపోతోంది. ఇప్పటికే పొగ మంచుతో ఇబ్బంది పడ్డాం. తీరా కాయలు ఊరే సమయంలో కుంకుమ తెగులు సోకటంతో నష్టపోవాల్సి వస్తోంది. అప్పులు చేసి, పంట సాగు చేశా. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా కనిపించట్లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.

- ప్రసాద్‌, రైతు, తగ్గుపర్తి, బెళుగుప్ప మండలం



Updated Date - 2021-01-10T07:04:18+05:30 IST