ఇంకా గందరగోళమే..!

ABN , First Publish Date - 2021-02-26T06:37:06+05:30 IST

నామినేషన్ల ఉపసంహరణ గడువు దగ్గరపడుతోంది. మున్సిపల్‌ ఎన్నికలపై మాత్రం ఇంకా గందరగోళం నెలకొంది.

ఇంకా గందరగోళమే..!

ప్రచారం జోరులో అభ్యర్థులు

అసలైన అభ్యర్థులెవరో..? 

ఓటర్లకు అంతుబట్టని వైనం

ఏ డివిజన్‌లో ఎంతమంది పోటీ..?

ఆ చిట్టా విప్పేదెవరు..?

అధికారులకే స్పష్టత లేని వైనం

ఆ జాబితానే లేదట..

అంతా స్ర్టాంగ్‌రూమ్‌ మహత్యం

ఆర్డీ కార్యాలయమున్నా లేనట్లే..?

కొత్త నామినేషన్ల అవకాశమున్న 

స్థానాలేవో తెలియదట..

అనంతపురం కార్పొరేషన్‌, ఫిబ్రవరి 25: నామినేషన్ల ఉపసంహరణ గడువు దగ్గరపడుతోంది. మున్సిపల్‌ ఎన్నికలపై మాత్రం ఇంకా గందరగోళం నెలకొంది.  అధికార వైసీపీ సహా రాజకీయ పార్టీలేవీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించనే లేదు. స్వతంత్ర అభ్యర్థుల నుంచి వివిధ పార్టీల తరపున నామినేషన్లు వేసిన వారందరూ ప్రచారహోరులో ఉన్నారు. దీంతో ఎవరు చివరి వరకు నిలుస్తారు? ఏ డివిజన్‌లో ఎంతమంది బరిలో ఉంటారో కూడా ఓటర్లకు అర్థం కావట్లేదు. ప్రస్తుతం నగర ప్రజలను కొన్ని ప్రశ్నలు పట్టి పీడిస్తున్నాయి. ఏ డివిజన్‌లో ఎవరు పోటీలో ఉన్నారు? ఎంతమంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు? అధికార పార్టీ తరపున ఏయే డివిజన్లలో ఎంతమంది పోటీలో ఉన్నారు..? లాంటి విషయాలు పూర్తిగా తెలియవు. గతేడాది మార్చి 15వ తేదీతో మున్సిపల్‌ ఎన్నికలను రద్దు చేయటంతో అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టలేదు. ఆ జాబితాతోపాటు నామినేషన్ల పత్రాలను కూడా అధికారులు స్ర్టాంగ్‌ రూ మ్‌లో భద్రపరిచారు. ప్రత్యేకంగా కంప్యూటర్‌లో కూడా నమోదు చేయలేదట. మరి అప్పట్లో ఇక్కడున్న అధికారులు ఎందుకు ఆ పని చేయలేకపోయారో.. అర్థం కావట్లేదు. ప్రస్తు తం రాజకీయ పార్టీలు ఆ జాబితా అడుగుతుంటే అధికారులు స్ర్టాంగ్‌రూమ్‌ ఓపెన్‌ చేస్తే చెప్పగలుగుతామని చెబుతుండటం గమనార్హం.


ప్రచారాల జోరులో అభ్యర్థులు

పోలింగ్‌కు ఎక్కువ సమయం లేకపోవటంతో పార్టీలు, స్వతం త్ర అభ్యర్థులు ఎవరికి వారు ప్రచార జోరు సాగిస్తున్నారు. పేర్లు ఖరారైన కొందరు తమ అనుచరులు, కార్యకర్తలతో కలిసి తిరుగుతుంటే.. మరికొంతమంది ఒకరిద్దరితో కలిసి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కొన్ని డివిజన్లలో అధికార వైసీపీ నుంచి ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. తమకు బీ-ఫాం ఇస్తే.. పార్టీ తరపునే పోటీ చేస్తామనీ, లేకపోతే స్వ తంత్రంగానైనా బరిలో ఉంటామని చెప్పుకొస్తున్నారు. టీడీపీ తరపున కూడా కొన్ని డివిజన్లలో ఇద్దరి వరకు పోటీలో ఉన్నా రు. ఇక స్వతంత్ర అభ్యర్థులు సైతం తామూ అధికార పార్టీ బీ-ఫాం కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేటికీ అభ్యర్థులను ఖరారు చేయకపోవటం వారికి కలిసొస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా ఎవరికి వారు అలా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటుండటంతో ఓటర్లకు ఎవరు పోటీలో ఉంటారో అంతుబట్టడం లే దు. నామినేషన్ల పరిశీలన అనంతరం 462 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైసీపీ నుంచి 192, టీడీపీ 130, జనసేన 20, బీజేపీ 23, కాంగ్రెస్‌ 17, సీపీఐ 5, సీపీఎం5, ఇతరులు70 మంది ఉన్నారు. 


ఆర్డీ కార్యాలయమున్నా లేనట్లే...

జిల్లా కేంద్రంలోని పురపాలక ఆర్డీ కార్యాలయం కీలకం. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు సంబంధించిన సమాచారం, పరిపాలన, ఇతర వ్యవహారాలు అందులోనే ఉండాలి. అక్కడ చాలా విషయాలు తెలియవనే చెబుతుంటారు. ఐదునెలల క్రితం రెండో విడత సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో గోల్‌మాల్‌ జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. ఆ విషయంపై అధికారులను అడిగితే స్పష్టమైన సమాధానాలు చెప్పలేని పరిస్థితి.  తాజాగా విడుదల చేసిన మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రక్రియలో భాగంగా పార్టీ అభ్యర్థులు మృతి చెందిన స్థానాల్లో కొత్తగా నామినేషన్లు వేయడానికి అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. ఈనెల 28వ తేదీ ఆ ఆవకాశం ఇచ్చింది. ఆదేశాలొచ్చిన రెండు రోజులైనా.. ఆ విషయంపై జిల్లాలోని వార్డుల జాబితా కోరితే.. తమకెలాంటి సమాచారం లేదని ఆర్డీ కార్యాలయ అధికారులు చెబుతుండ టం గమనార్హం. కదిరి, తాడిపత్రి మున్సిపల్‌ కమిషనర్‌ చెబితే తప్పా.. తెలియని పరిస్థితి. అక్కడికి ఆర్డీగా నాగరాజు ఆరునెలల క్రితమే వచ్చారు. 10 రోజుల క్రితం దీర్ఘకాలికంగా ఉన్న సూపరింటెండెంట్‌ కూడా మారారు. ఆ కార్యాలయంలో సీడీఎంఏ నుంచి వచ్చే ఉత్తర్వులు కూడా అందలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.

Updated Date - 2021-02-26T06:37:06+05:30 IST