ప్రచార హోరు..!

ABN , First Publish Date - 2021-03-05T06:40:57+05:30 IST

పట్టణాల్లో ప్రచార హోరు మొదలైంది. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఘట్టం ముగిసింది.

ప్రచార హోరు..!

మొదలైన మున్సిపల్‌ సమరం

ఓటరును ఆకట్టుకోవటంలో అభ్యర్థులు నిమగ్నం

ఎన్నికల పనుల్లో అధికారులు

పోలింగ్‌కు ఐదు రోజులే సమయం..

వైసీపీకి రెబల్స్‌ ఎఫెక్ట్‌

స్వతంత్ర అభ్యర్థుల నుంచి ముప్పు

అనంతపురం కార్పొరేషన్‌, మార్చి4: పట్టణాల్లో ప్రచార హోరు మొదలైంది. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఘట్టం ముగిసింది. పోరుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. పోలింగ్‌కు 5 రోజులు మాత్రమే గడువుంది. దీంతో జిల్లావ్యాప్తంగా కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల సమరం మొదలైంది. రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు తమ తమ శైలిలో ప్రచారాలు సాగిస్తున్నారు. అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవటంతో అధికారులపై ఉన్న కొంత ఒత్తిడి తగ్గిందనే చెప్పొచ్చు. ఓటరు స్లిప్పులను ఇప్పటికే బీఎల్‌ఓ ద్వారా పంపిణీ చేయించారు. ప్రధానమైన బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లను కూడా సిద్ధం చేశారు. ఈనెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లావ్యాప్తంగా 1128 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.


ఇండిపెండెంట్లకు ప్రత్యేక గుర్తులు

ఎలాంటి ఎన్నికలైనా కీలకమైనవి గుర్తులే. అభ్యర్థి గుర్తు ఏంటనేదే ప్రధానమవుతుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో రాజకీయ పార్టీ అభ్యర్థులకు ఆయా పార్టీ గుర్తుల మీదే పోటీ చేస్తారు. స్వతంత్ర అభ్యర్థులకు అధికారులు ప్రత్యేక గుర్తులు కేటాయించారు. ఈసారి స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులకు కొబ్బరికాయ, బ్యాట్‌, బీరువా, ఎయిర్‌ కండిషనర్‌, కాలీఫ్లవర్‌, గౌను, మంచం, బ్యాటరీ లైట్‌, కుండ, గ్యాస్‌ సిలిండర్‌, ప్రెషర్‌ కుక్కర్‌, కుట్టుమిషన్‌, హెల్మెట్‌, సీసా, ఉంగరం, పండ్ల బుట్ట, కోటు, క్యారంబోర్డు, గాలిపటం, కత్తెర గుర్తులున్నాయి. దీంతో వాటిని కేటాయించిన ఆయా అభ్యర్థులు వాటితో నమూనా బ్యాలెట్లను చేయించుకున్నారు.


అధికార పార్టీ అభ్యర్థులకు ఇండిపెండెంట్ల నుంచే ముప్పు

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు రసవత్తరానికి చేరుకున్నాయి. పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవటంలో అభ్యర్థులు బిజీగా మారారు. ఇప్పటికే రెండు, మూడు మార్లు ఆయా డివిజన్లు, వార్డులు పర్యటించిన అభ్యర్థులు మరోసారి గుర్తులతో వచ్చిన బ్యాలె ట్‌ నమూనాలతో ఓటర్ల ముందుకెళ్లి, అభ్యర్థిస్తున్నారు. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌, హిందూపురం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుత్తి మున్సిపాలిటీలు, పుట్టపర్తి, మడకశిర నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుంతకల్లులో మూడు, తాడిపత్రిలో రెండు, ధర్మవరంలో 10, గుత్తిలో ఆరు వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మొత్తం 358 డివిజన్లు/వార్డుల్లో ఏకగ్రీవాలైన 21 వార్డులు పోను జిల్లావ్యాప్తంగా 337 డివిజన్లు/వార్డులకుగాను 277 మంది  ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. జిల్లావ్యాప్తంగా 1128 మంది అభ్యర్థులుండగా అందులో వైసీపీ నుంచి 337 మంది, టీడీపీ 315, బీజేపీ 79, జనసేన 44, సీపీఐ 19, సీపీఎం 7, కాంగ్రెస్‌ 33 మంది ఉన్నారు. వైసీపీ, టీడీపీ తరువాత పోటీలో అత్యధిక మంది ఉన్నది ఇండిపెండెంట్లే కావటం గమనార్హం. దీంతో అధికార పార్టీకి ఇండిపెండెంట్ల నుంచే ముప్పు ఎదురుకానుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ తరపున బీ-ఫాం ఆశించి భంగపడిన ఎక్కువమంది రెబల్స్‌ స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీలో ఉండటమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సయోధ్యలు, బుజ్జగింపులు పనిచేయకపోవటం, ఆ అభ్యర్థులు అలాగే పోటీలో ఉండటం కొందరు వైసీపీ అభ్యర్థులను కలవరపెడుతోంది.

ప్రధానంగా వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ ఉన్న నేపథ్యంలో బలమైన స్వతంత్ర అభ్యర్థులు ఓట్లను చీల్చడంలో కీలకమవుతారనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో అధికార పార్టీ అభ్యర్థులపై ఆ ప్రభావం చూపుతుందనే వాదన కూడా లేకపోలేదు. అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలో 50 డివిజన్లకుగాను 204 మంది అభ్యర్థులు తుది జాబితాలో ఉండగా.. అందులో 62 మంది ఇండిపెండెంట్లే కావడం గమనార్హం. ఇక్కడ 10వ డివిజన్‌లో అత్యధికంగా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచారు. 30వ డివిజన్‌లో ఐదుగురు, 17, 20, 23, 47, డివిజన్లలో ముగ్గురేసి, కొన్ని డివిజన్లలో ఇద్దరు చొప్పున, ఒక్కొక్కరు తాము సైతం అంటూ బరిలో ఉన్నారు. హిందూపురంలో సైతం 38 వార్డులకుగాను 160 మంది అభ్యర్థులుండగా అందులో 54 మంది స్వతంత్రులే. కదిరిలో 36 వార్డులకు 144 మంది బరిలో నిలువగా.. ఇందులో 44 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. తాడిపత్రిలోనూ 30 మంది, గుంతకల్లులో 29 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Updated Date - 2021-03-05T06:40:57+05:30 IST