యథేచ్ఛగా దోపిడీ

ABN , First Publish Date - 2021-09-03T06:28:29+05:30 IST

జిల్లాలో బార్ల దోపిడీ పరాకాష్టకు చేరుకుంటోంది. అధిక ధరలు, కల్తీ మద్యంతో నిర్వాహకులు మద్యంప్రియులకు చుక్కలు చూపిస్తున్నారు.

యథేచ్ఛగా దోపిడీ
కమలానగర్‌లో పోలీస్‌ కాంప్లెక్స్‌లోని వైనషాపు 8.15 గంటలకు...

బార్లలో అధిక ధరలు, కల్తీ మద్యం విక్రయాలు

నిర్ణీత సమయం కంటే గంట ముందే మద్యం దుకాణాలు బంద్‌

బార్ల నిర్వాహకులకు కలిసొస్తున్న వైనం

మామూళ్లతో అధికారుల అండదండలు

మద్యంబాబుల జేబులకు చిల్లు

అనంతపురం క్రైం, సెప్టెంబరు 2: జిల్లాలో బార్ల దోపిడీ పరాకాష్టకు చేరుకుంటోంది. అధిక ధరలు, కల్తీ మద్యంతో నిర్వాహకులు మద్యంప్రియులకు చుక్కలు చూపిస్తున్నారు. పర్యవేక్షణతో కట్టడి చేయాల్సిన అధికారులు అమ్యామ్యాల మత్తులో జోగుతున్నారు. ఇదే అదునుగా బార్ల నిర్వాహకులు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ‘ఇచ్చిందే మద్యం... చెప్పిందే ధర’ అన్న రీతిలో బార్లకు తలుపులు తీశారు. మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి గంట ముందే అనధికారికంగా తలుపులు మూసేస్తుండడంతో మద్యంబాబులు బార్లకు క్యూ కడుతున్నారు. 


మద్యం సరఫరాలోనూ తిరకాసు

బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరాలో అధికారులు చక్రం తిప్పుతున్నారు. ఇందులో కొందరులు ఎక్సైజ్‌ సీఐలు, డిపో అధికారులు సూత్రధారులుగా మారారు.  నిబంధనల మేరకు ప్రభుత్వ మద్యం దుకాణా లు, బార్లకు వేర్వేరుగా ఇండెంట్‌ల ప్రకారం మద్యం సరఫరా చేయాల్సి ఉంది. అయితే  దుకాణాల ఇండెంట్‌ పేరుతోనే కొన్ని బార్‌లకు నేరుగా మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఏదో ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో బాటిళ్లను స్కాన చేసి మరీ అక్కడి నుంచి బార్‌లకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇం దులో డిపోలోని కొందరు అధికారులు, ఎక్సైజ్‌ సీఐలు, పలు దుకాణాల సూపర్‌వైజర్లు, సేల్స్‌మన్లు కుమ్మక్కై అక్రమార్గంలో మద్యం సరఫరా  తతంగాన్ని నడుపుతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రధానంగా డిపోలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులతో పాటు ఒక సీఐ, ఇద్దరు సూపర్‌వైజర్లు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఇదే క్రమంలో వీరికి అధికార పార్టీ నాయకుల అండదండలు కూడా ఉండటం మరింత కలిసి వస్తోందని ఆ శాఖలో చర్చ సాగుతోంది. 


మూమూళ్ల మత్తులో... 

జిల్లాలోని బార్‌లలో ఎక్కడైనా నిబంధనలు పాటించకపోతే డిపోలోని ఎక్సైజ్‌ సీఐల బృందాలు, అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) విజిలెన్స బృందాలు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఎప్పటి కప్పుడు ఆకస్మిక తనిఖీలు చేయాలి. నిబంధనలు పాటించని బార్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆయితే ఈ బృందాలలో పనిచేస్తున్న కొందరు సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు, ఆపై ఉన్నతాధికారులు బార్ల నిర్వాహకులతో నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కిందట నెలవారీ మామూళ్లు పెంచాలని షరుతు విధించడంతో కొందరు బార్ల నిర్వాహకులు వ్యతిరేకించారు. దీంతో సదురు అధికారులు బార్లు ఉన్న ప్రాంతాలలోని దుకాణాల ద్వారా రాత్రి 9 గంటల వరకు విక్రయాలు చేయడంతో బార్ల నిర్వాహకులకు మద్యం విక్రయాలు తగ్గడంతో అంతర్మథనంలో పడిపోయారు. తిరిగి అధికారులు చెప్పినకాటికి మామూళ్ల ఒప్పందం కుదర్చుకుని యథావిధిగా మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకు మూత వేయించేస్తున్నారు. బార్లలో ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారని ఆ వర్గాల నుంచి తెలిసింది. కొందరైతే ఏకంగా బార్లను రాత్రి 11 గంటల తరువాత కూడా విక్రయాలు చేస్తున్నారని సమాచారం. 


ప్రభుత్వ మద్యం దుకాణం  8 గంటలకు మూతపడాల్సిందే...

జిల్లాలో అనంతపురం, పెనుకొండ డివిజన పరిధిలో 26 బార్‌లు కలవు. జిల్లాకేంద్రలో బార్‌లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఆయితే ఎక్కడైతే బార్‌లు ఉన్నాయో.. ఆయా ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 8 గంటలకు ప్రభుత్వ మద్యం దుకాణం మూత పడాల్సిందే. ఆ స్థాయిలో పర్యవేక్షణ అధికారుల నుంచి సదురు దుకాణాల సూపర్‌వైజర్లు, సేల్స్‌మన్లపై ఒత్తిడి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణం తెరిచేందుకు అనుమతి ఉందంటూ కొందరు సిబ్బంది ప్రశ్నించడంతో వారిపై సదురు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు బార్ల నిర్వాహకులకు ఆ సమయంలో వ్యాపారం మరింత కలిసొస్తోంది. ఈవ్యవహరం ప్రధానంగా అనంతపురం, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, కదిరి, తాడిపత్రి ప్రాంతాల్లో ఎక్కువగా సాగుతోందని సమాచారం.


రూ.లక్షల్లో ముడుపులు...

జిల్లాలోని 26 బార్ల నుంచి పర్యవేక్షణ అధికారులకు నెలకు ముడుపుల రూపంలో సుమారు రూ. లక్షల్లో చేతులు మారుతున్నట్లు తెలిసింది. ఒక్కొక్క బార్‌ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, లేదా ఆయా ప్రాంతాల వారిగా బార్లలో జరిగే విక్రయాల పరంగా నెలవారీ ముడుపులు సుమారూ రూ.2 లక్షలకు పైగానే వసూలు చేస్తున్నట్లు కొందరు బార్‌ల నిర్వాహకుల నుంచి తెలిసింది. ఈ విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా ఆ తర్వాత అందరూ వాటాలు పంచుకుంటున్నట్లు తెలిసింది. పైగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడుపుతుండడంతో ప్రశ్నించే నాథుడే కరువయ్యారు. బార్‌ల నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందగా మద్యంప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ వ్యవహారంలో నగరంలోని ఇద్దరు అధికారులు, ఇద్దరు బార్‌ల నిర్వాహకులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. 


డిమాండ్‌ ఉన్న మద్యం బ్రాండ్లు మాయం

జిల్లావ్యాప్తంగా 116 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఎక్కడా కూడా డిమాండ్‌ కలిగిన మద్యం బ్రాండ్లు, ఖరీదైన మద్యం బ్రాండ్లు మాత్రం కనిపించవు. ఆయితే బార్లలో ఏ రకం బ్రాండ్‌ మద్యం అయినా దొరకడం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బ్రాండ్లు.. బార్లకే అన్న విధంగా జిల్లాలో మద్యం పరిస్థితి దాపురించింది. కొందరు అవినీతి అధికారులు, బార్‌ల నిర్వాహకులకు మద్యం రూపంలో కాసుల వర్షం కురిపిస్తుంటే.. తెరవెనుక అవినీతి ముసుగు తెలిసిన మద్యంబాబులకు మాత్రం కిక్కు దిగాల్సిందే. 

Updated Date - 2021-09-03T06:28:29+05:30 IST