ఊరినే అమ్మేస్తారా?

ABN , First Publish Date - 2021-01-13T07:04:50+05:30 IST

ఊరి మధ్యలో స్థలాన్ని వ్యవసాయ భూమిగా..

ఊరినే అమ్మేస్తారా?
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన గృహ యజమానులు..

సర్వేకు వెళ్లిన అధికారులపై తిరగబడిన గాండ్లపెంట వాసులు

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయింపు


గాండ్లపెంట(అనంతపురం): ఊరి మధ్యలో స్థలాన్ని వ్యవసాయ భూమిగా మార్చి, ఏకంగా అమ్మేస్తారా.. అంటూ గాండ్లపెంట వాసులు.. అధికారులపై తిరగబడ్డారు. ఆ భూమిని కొనుగోలు చేసిన వారు.. ఇళ్ల యజమానులకు నోటీసులిచ్చి, మంగళవారం పోలీసుల సహకారంతో సర్వే చేసేందుకు అధికారులు యత్నించారు. స్థానికులు తమ హక్కు పత్రాలు చూపించి, సర్వే నిర్వహిస్తే ఊరుకోమంటూ ఎదురు తిరిగారు. దీంతో అధికారులు వెనుతిరిగిపోగా.. గ్రామస్థులు మూకుమ్మడిగా తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఇళ్ల యజమానులు మాట్లాడుతూ గ్రామంలోని 1122 సర్వేనెంబరులోని జీనులకుంటరోడ్డు, రసూల్‌వీధి, పాత ఆసుపత్రి పరిసర వీధుల్లో వందేళ్ల నుంచి 120 కుటుంబాలు నివాసముంటున్నామన్నారు. తామున్న స్థలాలను పరిమితి మేరకు రిజిస్ట్రేషన్‌ చేసుకుని, రెవెన్యూ అధికారుల నుంచి పొజిషన్‌ పట్టాలు పొందామన్నారు. ప్రభుత్వ పక్కా గృహాలతోపాటు సొంతంగా ఇళ్లు కట్టుకున్నామన్నారు.


ఇటీవల ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌గా ఉన్న శ్రీనివాసులురెడ్డి, ఆర్‌ఐ నాగభూషణ గ్రామంలో తామున్న స్థలాన్ని వ్యవసాయ భూమిగా మార్చారన్నారు. డబ్బుకు కక్కుర్తిపడి శ్రీధర్‌కృష్ణకు హక్కు ఉందని రికార్డులు సృష్టించారన్నారు. అతడి నుంచి మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన టీడీపీ, వైసీపీ నాయకులు ఇద్దరు స్థలాలను కొనుగోలు చేసి, రిజిస్టర్‌ చేయించుకున్నారన్నారు. వారి ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు తమ ఇళ్లను సర్వే చేసి, కూల్చివేసే ప్రయ త్నం చేస్తున్నారనీ, ఇందుకు సహకరించిన అధికారులను సత్వరం సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తమకున్న హక్కు వివరాలను తహసీల్దార్‌కు అందించారు. సర్వే నిలిపివేయాలని వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ తహసీల్దార్‌ శంకర్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ ఎస్పీ హైదర్‌వలి, వైసీపీ నాయకులు ఎస్‌ఎండీ ఫైజుల్లా, ఇలియాజ్‌, ఇంతియాజ్‌, మదార్‌వలి, రహంతుల్లా, ఆంజీ, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు శైలజ, న్యాయవాది వాల్మీకి గంగాధర్‌, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

పరిశీలించి, న్యాయం చేస్తాం..

నివాసాలున్న స్థలాన్ని పరిశీలించి, విచారించి న్యాయం చేస్తాం. గృహ యజమానులు హక్కు కలిగి ఉంటే ఆదోళన చెందనవసరం లేదు. రికార్డుల మేరకు నోటీసులు ఇచ్చి, గృహ యజమానులను గుర్తిస్తాం. సమస్య పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు నివేదిక పంపుతాం.

- వెంకటరమణ, తహసీల్దార్‌, గాండ్లపెంట 

Updated Date - 2021-01-13T07:04:50+05:30 IST