కష్టాల కడలిలోనే అనంత అన్నదాతలు

ABN , First Publish Date - 2021-07-08T07:00:57+05:30 IST

‘ఒక్క చాన్స్‌ ఇస్తే... రైతు రాజ్యం తీసుకొస్తాం. ‘రైతే-రాజు’ నానుడిని నిజం చేస్తామ’ని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేకుండాపోతోంది. జిల్లాలో కరువు రైతు ఎదుర్కొంటున్న పరిస్థితులే ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి.

కష్టాల కడలిలోనే అనంత అన్నదాతలు
బీటీపీ..

ముఖ్యమంత్రీ..

కరువు రైతు గుర్తున్నాడా..?

కష్టాల కడలిలోనే అనంత అన్నదాతలు

ఆర్భాటపు హామీలతోనే సరి...

అన్నదాతకు ప్రయోజనం చేకూర్చే అంశాలపై చిన్నచూపు

2018 ఇన్‌పుట్‌ సబ్సిడీకి అతీగతీలేదు...

సాగునీటి ప్రాజెక్టులపై నిండుకున్న నిస్తేజం

హంద్రీనీవాకు సమాంతర కాలువ హామీ ఉత్తిదేనా..?

అలంకారప్రాయంగా ఆర్‌బీకేలు

ఎరువులు, మందులు అందుబాటులో లేని వైనం

పరిశ్రమల ఊసేలేక అయోమయంలో నిరుద్యోగ యువత

పింఛన్ల సొమ్ము పెంపుపై ప్రభుత్వం మౌనముద్ర


ఒక్క చాన్స్‌ ఇవ్వమన్నారు.. అద్భుతాలు చేస్తామన్నారు.. హామీలమీద హామీలు గుప్పించారు. అనంత అన్నదాతను ఆదుకుంటామన్నారు. అధికారం చేపట్టాక చేసిందేమిటి? కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. జిల్లా అభివృద్ధికి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదు. హంద్రీనీవా వెడల్పు చేయలేదు. సమాంతర కాలువ తవ్వనూ లేదు. సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెట్టించడం కాదు కదా.. కనీసం అడుగు ముందుకు వేయించలేదు. ఆదుకుంటాయనుకున్న ఆర్‌బీకేలు అలంకారప్రాయంగా మారాయి. ఎరువులుంటే పురుగు మందులుండవు.. పురుగు మందులుంటే.. ఎరువులు ఉండవు. ఒక్కోచోటా రెండు ఉండవు.. ఇక.. కరువు రైతుకు ఎలా దక్కుతోంది.. అసరా..? ఏ రకంగా లభిస్తోంది అండ..? రైతు రాజ్యం తీసుకొచ్చేది ఇలాగేనా? అన్నదాతలకిచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారంటే.. అస్సలు కరువు రైతు గుర్తున్నాడా? వారు వేలాడుతున్న ఉరితాళ్లు కనిపిస్తున్నాయా? అంపశయ్యపై అనంత అన్నదాత ఉంటే.. రైతు దినోత్సవం అంటూ పాలకులు ఉత్సవాలు చేస్తున్నారు..! ఎవరి కోసమో..? ఏం సాధించామనో..? అన్నదాతకు ఏం ఇచ్చామనో..?


అనంతపురం, జూలై7(ఆంధ్రజ్యోతి): ‘ఒక్క చాన్స్‌ ఇస్తే... రైతు రాజ్యం తీసుకొస్తాం. ‘రైతే-రాజు’ నానుడిని నిజం చేస్తామ’ని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేకుండాపోతోంది. జిల్లాలో కరువు రైతు ఎదుర్కొంటున్న పరిస్థితులే ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజును రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జిల్లాలో కరువు రైతు మాత్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోతున్నాడు. ప్రభుత్వాలు మారినా... పాలకులు మారినా... కష్టాల కడలిలోనే జీవనయానం సాగిస్తున్నాడు. రైతు సంక్షేమం పట్ల పాలకులకు చిత్తశుద్ధిలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ వర్గాల సంక్షేమం కోసం హామీలిస్తున్నప్పటికీ... ఆచరణలో చిత్తశుద్ధి చూపకపోవడంతో రైతన్నలు వ్యవసాయం చేయడం భారంగా పరిగణించాల్సి వస్తోందనడంలో సందేహం లేదు. టీడీపీ హయాంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపేణా 2014 నుంచి 2017 వరకూ రూ. 1628.05 కోట్లు పంట నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందించారు. వాతావరణ బీమా కింద రూ.713.48 కోట్లు ఇచ్చారు. దీంతోపాటు 90 శాతం సబ్సిడీతో దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ డ్రిప్‌ పరికరాలు పంపిణీ చేశారు. అలా కరువు రైతును ఆదుకునే విషయంలో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిందన్న అభిప్రాయం రైతుల నుంచే వ్యక్తమవుతోంది. అధికార మార్పిడి అనంతరం కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వం డ్రిప్‌ ఊసెత్తకపోవడంతో రైతులు నిట్టూరుస్తున్నారు. కేవలం పెట్టుబడి సాగు సొమ్ముతోనే సరిపెడుతుండటంతో రైతుల నుంచి ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటోంది. రెండేళ్ల పాలనలో యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేయలేదు. టీడీపీ హయాంలో సూక్ష్మ పోషకాలు జింక్‌, జిప్సమ్‌, బోరాన్‌ ఎరువులను రైతులకు ఉచితంగా అందజేసింది. ప్రస్తుత వాటి ప్రస్తావనే లేదు. ఉద్యాన రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఉద్యాన పథకాలకు రెండేళ్లలో పైసా నిధులు కూడా మంజూరు చేయలేదు. ఆ రైతుల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది. ఇలా ఏ విధంగా చూసినా... రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరువు రైతుకు మొండిచేయే చూపుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... రైతు ప్రయోజనాంశాలపై ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందన్న అభిప్రాయం రైతు సంఘాలు, మేధావివర్గాలు, రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిలేమికి ఇదో కోణమైతే... ఆరుగాలం కష్టపడి పండించిన కరువు రైతు పంటను దళారులు దోచుకుంటున్నారు. దీంతో అన్నదాతల పరిస్థితి అటు నుయ్యి... ఇటు గొయ్యి అన్న చందంగా మారిందనడంలో సందేహం లేదు.


సీహెచ్‌సీల ఏర్పాటులోనూ నిర్లక్ష్యమే...

రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి, ఒక్కో గ్రూపునకు వ్యవసాయ పరికరాలందించేందుకుగానూ గతేడాదిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు జిల్లాలో రైతు గ్రూపులను ఏర్పాటు చేశారుగానీ... ఏ ఒక్క గ్రూపునకు వ్యవసాయ పరికరాలు అందించలేదు. ఒక్కో రైతు గ్రూపునకు ట్రాక్టర్‌తోపాటు ఇతరత్రా వ్యవసాయ పరికరాలు అందిస్తామని చెప్పి... చివరకు ట్రాక్టర్‌ ఇవ్వడం లేదని చేతులెత్తేశారు. దీంతో ఏ రైతు గ్రూపూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో... ఈ ఏడాది వైఎ్‌సఆర్‌ యంత్ర సేవ పేరుతో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా... యూనిట్‌ ధరలో 10 శాతం మొత్తాన్ని రైతు గ్రూపు కట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం తరపున 40 శాతం సబ్సిడీ, 50 శాతం మొత్తాన్ని బ్యాంకు రుణంగా ఇచ్చేలా మార్గదర్శకాలు రూ పొందించారు. అందులోనూ ప్రభుత్వం మెలిక పెట్టింది. ఈ ఏడాది కట్టాల్సిన 10 శాతంతోపాటు 40 శాతం సబ్సిడీ మొత్తాన్ని ముందస్తుగా రైతు గ్రూపులు చెల్లించాలని షరతు విధించింది. సబ్సిడీ మొత్తం ముందుగా చెల్లిస్తే మళ్లీ రైతు గ్రూపు ఖాతాలోకి జమ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ట్రాక్టర్‌ ఇవ్వబోమని చెప్పడంతో మెజార్టీ రైతుల నుంచి స్పందన కరువైంది. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం రైతులకందించే వ్యవసాయ పరికరాల విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తోందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. జిల్లాలో 859 రైతు భరోసా కేంద్రాలున్నాయి. ప్రతి కేంద్రం పరిధిలో ఒక్కో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ చేయాలని నిర్ణయించినప్పటికీ... తొలి విడతలో 260 సీహెచ్‌సీల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కాగా... 155 రైతు గ్రూపులు కస్టమ్‌ హైరింగ్‌ సెం టర్ల కోసం దరఖాస్తు చేసుకున్నా... 76 గ్రూపులకు మాత్రమే  యూనిట్లు మం జూరు చేసినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. క్షేత్రస్థాయిలో 40 యూనిట్లకు మాత్రమే లబ్ధి చేకూర్చినట్లు చెబుతున్నా... ఒక్క రైతు గ్రూపునకు కూడా ఇప్పటి వరకూ పరికరాలు సరఫరా చేయలేదు. సీఎం రాయదుర్గం పర్యటనలో భాగంగా గురువారం ఒక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించిన తరువాతనే మిగిలిన రైతు గ్రూపులకు పరికరాలు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది.


అలంకారప్రాయంగా ఆర్‌బీకేలు

జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. 958 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులు అందించాలి. ఒక రైతు భరోసా కేంద్రంలో ఎరువులు అందుబాటులో ఉంటే పురుగుల మందులు ఉండటం లేదు. మరో కేంద్రంలో పురుగుల మందులు ఉంటే ఎరువులు ఉండటం లేదు. కొన్ని కేంద్రాల్లో యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు మాత్రమే రైతులకు సరఫరా చేస్తుండగా... పురుగు మందులు లేకపోవడంతో బయటి మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి రైతు భరోసా కేంద్రంలో ఇంతవరకూ ఎరువులు, పురుగుల మందులు, కంది విత్తనాలు సరఫరా కాలేదు. దీంతో రైతులు ధర్మవరం వెళ్లి, కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెన్నేకొత్తపల్లిలోని రైతు భరోసా కేంద్రంలో డీఏపీ మాత్రమే లభిస్తోంది. పురుగు మందులు, విత్తనశుద్ధి మందులు లేకపోవడంతో ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది.



సాగునీటి ప్రాజెక్టులపై నిస్తేజం

జిల్లాకు హంద్రీనీవా, హెచ్చెల్సీ ప్రాణాధారం. ఆ ప్రాజెక్టులపై నిస్తేజం నెలకొంది. జిల్లా రైతాంగానికి సాగునీటి ప్రాజెక్టులే జీవనాధారం. అలాంటి ప్రాజెక్టులపై శ్రద్ధ కనబరచడం లేదు. తుంగభద్ర ఎగువ కాలువ పరిస్థితి రెండేళ్లలో దారుణంగా తయారైంది. ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా మంజూరు చేయకపోవడంతో 84 కిలోమీటర్ల పొడవు వున్న కాలువ అధ్వానస్థాయికి చేరింది. రెండేళ్ల నుంచి పడిన గండ్ల ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి, తాత్కాలిక చర్యలు చేపట్టారు. శాశ్వత మరమ్మతులు చేయకపోవడంతో మళ్లీ గండ్లు పడే పరిస్థితి ఉంటుందని అధికార యంత్రాంగంలోనే అభద్రతాభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. భైరవాన్‌తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను మళ్లిస్తామని  హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీల పరిధిలో వున్న ఆరు మండలాలకు జీవనాధారంగా ఉండటమే కాకుండా జిల్లాలో పీఏబీఆర్‌తో అనుసంధానిస్తూ మరో రిజర్వాయర్‌ నిర్మించే విధంగా డిజైన్‌ చేసిన ఉంతకల్లు రిజర్వాయర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం ఆ ప్రాంత రైతులు చేసుకున్న దురదృష్టమనే చెప్పాలి. జీడిపల్లి నుంచి పేరూరు డ్యాంకు కృష్ణాజలాలను తరలించే కాలువల తవ్వకాల పనులు నత్తనడకన సాగుతున్నాయి.


హంద్రీనీవాకు సమాంతర కాలువ హామీ ఉత్తిదేనా..?

‘ఒక్క చాన్స్‌ ఇస్తే జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తా. 2200 క్యూసెక్కుల సామర్థ్యమున్న హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి, 6 వేల క్యూసెక్కులు పారిస్తా. హంద్రీనీవాకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, 4 వేల క్యూసెక్కుల నీటిని ప్రవహింపజేసి, జిల్లాను అభివృద్ధి చేస్తాన’ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇదే గడ్డపై హామీ ఇచ్చారు. ఆ హామీకి దాదాపు ఏడాది గడుస్తోంది. ఇప్పటికీ ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. హంద్రీనీవాకు సమాంతర కాలువ హామీ ఉత్తిదేనా అన్న ప్రశ్న పలు వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.


పింఛన్‌ సొమ్ము పెంపు అంతేనా..?

పించన్‌ సొమ్మును ఏటా రూ.250 చొప్పున పెంచుతామని రాష్ట్ర ప్రభు త్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ... ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో పింఛన్‌దారులు అసంతృప్తికి లోనవుతున్నారు. పింఛన్‌ సొమ్ము పెంపు ఉత్తిదేనా..? అనే సందేహాలు ఆ వర్గాలను వెంటాడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3 వేలు పంపిణీ చేస్తామని పింఛన్‌దారుల్లో ఆశలు రేకెత్తించారు. ఆ ఆశలను ప్రభుత్వం అడియాసలు చేస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటికీ పింఛన్‌దారుడికి రూ.2250 మాత్రమే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు... పింఛన్‌ పెంపు అమలు జరిగి ఉంటే... ఒక్కో పింఛన్‌దారుడికి రూ. 2750 అందేది. ఆ సొమ్మును పింఛన్‌దారుడు కోల్పోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో పింఛన్‌దారుల నుంచి ప్రభుత్వంపై అసహనం పెల్లుబుకుతోంది. పింఛన్‌ సొమ్ము పెంపు ఉత్తిదేనా...? అనే మాటలు లబ్ధిదారుల నుంచి వినిపిస్తుండటం పాలకుల హామీల అమలు తీరుకు అద్దం పడుతోంది.


పెండింగ్‌ బిల్లులపై స్పష్టత లభించేనా..?

జిల్లాలో టీడీపీ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించి రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై సీఎం నుంచి స్పష్టత లభించేనా అని లబ్ధిదారులు, కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. గృహ నిర్మాణశాఖకు సంబంధించి రూ.50 కోట్లు, నీరు-చెట్టు బిల్లులు రూ.110 కోట్లు, పెళ్లికానుక బిల్లులు రూ.18 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బాధ్యత అధికారంలో ఉన్న ప్ర భుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి ముఖ్యమంత్రి ఏ మేరకు పెండింగ్‌ బిల్లులపై స్పష్టత ఇస్తారో మరికొన్ని గంటలు ఆగాల్సిందే.


పరిశ్రమల ఊసేలేక అయోమయంలో నిరుద్యోగ యువత

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పైబడినప్పటికీ.. కొత్త పరిశ్రమల ఊసే లేకపోవడంతో నిరుద్యోగ యువత ఉపాధి లేక తల్లడిల్లుతోంది. ప్రభుత్వం నుంచి ఆ మేరకు కొత్త పరిశ్రమల కోసం ప్రోత్సాహం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలో టీడీపీ హయాంలో జాకీ పరిశ్రమ నెలకొల్పేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అధికార మార్పిడితో వైసీపీ నేతలు ఆ పరిశ్రమ ప్రతినిధులపై కాసుల కోసం ఒత్తిళ్లు, బెదిరింపులు తేవడంతో అది కాస్తా వెనక్కు వెళ్లిపోయింది. తద్వారా 10 వేల మందిదాకా ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైందన్న ఆరోపణలు ఇప్పటికీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రభుత్వ డెయిరీని మూసేసి... ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఇలా పరిశ్రమలను మూసేయడం, జిల్లా నుంచి పరుగు పెట్టించడం మినహా... రెండేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదంటే కరువు జిల్లా నిరుద్యోగ యువత ఉపాధికి ప్రభుత్వం ఏ మేరకు చిత్తశుద్ధి చూపుతోందో తేటతెల్లమవుతోంది.





2018 ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధుల మంజూరుకు హామీ లభించేనా...?

జిల్లాలో 2018లో పంట నష్టపోయిన రైతులకు నేటికీ నిధులు మంజూరు చేయలేదు. జిల్లాలో 6 లక్షల మంది రైతులకు సంబంధించి 4.90 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయింది. దీంతో పరిహారం కింద రూ.936 కోట్లు అప్పటి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో అధికార మార్పిడి నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ... బాధిత రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేసే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ముఖ్యమంత్రి జిల్లాకొస్తున్న నేపథ్యంలో 2018 ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించిన నిధుల మంజూరుకు హామీ లభిస్తుందన్న ఆశతో కరువు రైతులు ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యమంత్రి ఈ అంశంపై ఏ మేరకు స్పందిస్తారో వేచిచూడాల్సిందే. తాజాగా మంజూరైన ఉచిత పంటల బీమా పరిహారంలోనూ రైతులకు అన్యాయం వాటిల్లుతోంది. మొత్తం 2,46,469 మంది రైతులకు సంబంధించి 3,20,636 హెక్టార్లలో పంటనష్టం జరగగా... రూ.266.42 కోట్లు మంజూరు చేశారు. ఇంకా 75 వేల మంది రైతులకు రూ.60 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. వారందరికీ బీమా సొమ్ము చెల్లిస్తారో.. లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2021-07-08T07:00:57+05:30 IST