కమనీయం.. నారసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2021-03-24T06:34:19+05:30 IST

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీదేవీభూదేవి సమేత ఖాద్రీశుడి కల్యాణోత్సవం కమనీయంగా సగింది.

కమనీయం.. నారసింహుడి కల్యాణం
శ్రీదేవి, భూదేవితో ఖాద్రీశుడి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు..

కదిరి, మార్చి 23: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి  శ్రీదేవీభూదేవి సమేత ఖాద్రీశుడి కల్యాణోత్సవం కమనీయంగా సగింది. తొలుత యాగశాలలో కొలువుతీరిన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను, శ్రీవారిని వేర్వేరుగా పల్లకీల్లో కల్యాణమంటపానికి చేర్చారు. మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి ప్రతిరూపంగా విచ్చేసిన కంకణ భట్టాచార్యులు.. అమ్మవార్లకు మాంగళ్యధారణ గావించారు. కల్యాణోత్సవం ముగిసిన తరువాత శ్రీవారు, అమ్మవార్లపై నుంచి జాలువారిన ముత్యాల తలంబ్రాలను దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు. సాధారణ వివాహాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా కల్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులు.. శ్రీదేవీభూదేవి సమేత శ్రీవారికి చదివింపులు చదివించుకున్నారు.

ప్రభుత్వం నుంచి  స్వామి వారికి పట్టు వస్ర్తాలు  

ప్రభుత్వం తరపున రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ, టీటీడీ నుంచి పట్టు వస్ర్తాలను సమర్పించారు. శ్రీవారి కల్యాణోత్సవంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మా ధవ్‌, కదిరి, పుట్టపర్తి ఎమ్మెల్యేలు సిద్దారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ పార్థసారథి, ఆలయ చైర్మన్‌ కాంబోజీ రెడ్డెప్పశెట్టి, ఈఓ వెంటకటేశ్వరరెడ్డి, ప్రధానాచార్యుడు నరసింహాచార్యులు, పుర ప్రముఖులు, అధిక సంఖ్యంలో భక్తులు పాల్గొన్నారు.


శాస్ర్తోక్తంగా ధ్వజారోహణం

పక్షం రోజులపాటు కొనసాగననున్న నారసింహుడి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా మంగళవారం ఉదయం ధ్వజారోహణాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించడం కూడా ఈఽ ధ్వజారోహణంలో భాగమే. ఇందులో భాగంగా గరుడుడి చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఆవిష్కరిస్తారు. ధ్వజస్తంభం పై ఆరోహణం గావించిన గరుడ పటాన్ని బ్రహ్మోత్సవాలు  పూర్తయిన తరువాత అవరోహణం చేస్తారు.


నేడు హంస వాహనంపై శ్రీవారి విహారం 

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు బుధవారం హంసవాహనంపై దర్శనమివ్వనున్నారు. తిరువీధుల్లో స్వామివారు ఊరేగనున్నారు.





Updated Date - 2021-03-24T06:34:19+05:30 IST