ఐసీడీఎస్‌లో గాడి తప్పిన పాలన

ABN , First Publish Date - 2021-01-12T06:53:15+05:30 IST

ఐసీడీఎస్‌ పాలన గాడి తప్పింది. నగరాలు, పట్టణాలలో సీడీపీఓలు సూపర్‌వైజర్లు నివాసాలు ఉం టుండటంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది.

ఐసీడీఎస్‌లో గాడి తప్పిన పాలన

అస్తవ్యస్తం

పనిచేసే చోట ఉండని సీడీపీఓలు, సూపర్‌వైజర్లు

ఎక్కువ మంది అప్‌ అండ్‌ డౌన్‌

అంగన్‌వాడీ వర్కర్లదీ అదే బాట

కొరవడిన పర్యవేక్షణ

పక్కదారి పడుతున్న పౌష్టికాహారం

నాసిరకమైన సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు

ఆమ్యామ్యాలతో పట్టించుకోని అధికారులు

ఒక్కో కేంద్రం టార్గెట్‌గా వసూళ్లు 

అవినీతి వెలుగు చూస్తున్నా మారని సిబ్బంది 

అక్రమాలకు నిలయాలుగా  అంగన్‌వాడీలు

అనంత పురం వైద్యం, జనవరి 11: ఐసీడీఎస్‌ పాలన గాడి తప్పింది. నగరాలు, పట్టణాలలో సీడీపీఓలు సూపర్‌వైజర్లు నివాసాలు ఉం టుండటంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. మొత్తం 17 మంది సీడీపీఓలు ఉంటే అందులో హిందూపురం, మడకశిర, అనంతపురం సీడీపీఓలు మాత్రమే స్థానికంగా ఉన్నారు. మిగిలిన 14 మంది వేరే చోట నివాసముంటున్నారు. వీరిలో దాదాపు 12 మంది జిల్లా కేంద్రంలోనే నివాసముంటూ విధులకు వెళ్తున్నారు. జిల్లాలో 202 మంది సూపర్‌వైజర్లు ఉండాల్సి ఉండగా 70 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కో సూపర్‌వైజర్‌కు రెండు మూడు సెక్టార్ల ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఇచ్చారు. వీరు కూడా స్థానికంగా ఉండడం లేదు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కువ మంది నివాసముంటూ విధులకు చుట్టుపు చూపుగా వెళ్తున్నారు. ప్రతిరోజు సీడీపీఓ సూపర్‌వైజర్లు కేంద్రాలు తనిఖీ చేయాలి. కానీ అది చేయడం లేదు. ఇటీవల అనంతపురం రూరల్‌ మండల పరిధిలో ఏ నాగిరెడ్డిపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మి తనిఖీ చేశారు. దాదాపు ఏడాదిలో ఒక్కసారి కూడా ఆ కేంద్రాన్ని ఎవరూ తనిఖీ చేయలేదని ఆమె పరిశీలనలో తేలడంతో అవాక్కయ్యారు. దగ్గరదే ఇలా ఉంటే వందల కిలోమీటర్ల దూరం వెళ్లి ఇక సీడీపీఓలు ఏ విధంగా కేంద్రాలు పర్యవేక్షిస్తున్నారో అర్థమవుతుంది.  కొందరు అంగన్‌వాడీ వర్కర్లు సైతం మండల, నియోజకవర్గ కేంద్రాలలో నివాసముంటూ అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తు న్నారు. నివాస ప్రాంతానికి విధులు నిర్వహించే చోటుకు మధ్య వందల కిలోమీటర్ల దూరం ఉండటంతో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు సక్రమంగా సకాలంలో విధులకు వెళ్లడంలేదు. కొందరైతే కేవలం ఫైళ్లను తమ ఇళ్ల వద్దకే తెప్పించుకొని పాలన సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా పర్యవేక్షణ అటకెక్కడంతో క్షేత్ర స్థాయిలో కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా సాగుతోంది. అంగన్‌వాడీ పథకాలు పక్కదారి పడుతున్నాయి. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారిపోయాయన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇందుకు అనేక ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చినా అవినీతి అక్రమాలే నిదర్శనం.


అక్రమాలకు అడ్డాగా అంగన్‌వాడీలు

జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 5126 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 1.4 లక్షలు, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు లక్ష మంది, గర్భిణులు, బాలింతలు 70 వేల మంది, కిషోర బాలికలు 5 వేల మందికి పైగా లబ్ధి పొందుతున్నారు. అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహా రం, గుడ్లు, పాలు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ప్రతి రోజు జిల్లాలో 3 లక్షల మందికి పైగా ఈ పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. ఇందు కోసం రూ. కోట్లు వ్యయం చేస్తున్నారు. అయితే పౌష్టికాహారాన్ని పక్క దారి పట్టించి పేద పిల్లలకు అందకుండా చేస్తూ దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడిగుడ్లు, పాలు నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారు. అనేక చోట్ల కుళ్లిన గుడ్లు, కాలం చెల్లిన, చెడిపోయిన పాలు సరఫరా చేస్తున్నారు. ని బంధనలకు విరుద్ధంగా నాసిరకంగా, చిన్న సైజులో ఉన్న కోడిగుడ్లను కేంద్రాలకు ఇస్తూ దోచుకుంటున్నారు. సీడీపీఓలు, సూపర్‌వైజర్లు ఆమ్యామ్యాలకు అలవాటుపడి కేంద్రాల నిర్వహణ, పథకాల అమలు పర్యవేక్షణను గాలికి వదిలేశారు. కొందరు సీడీపీఓలు, సూపర్‌వైజర్లు ఒక్కో కేంద్రానికి ఇంత అని టార్గెట్‌ విధించి  బలవంతంగా వర్కర్ల నుంచి వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో రాయదుర్గంలో పాలలో కప్ప వచ్చిందన్న వదంతులు వచ్చాయి. వేరుశనగ చిక్కీలలో పురుగులు బయటపడ్డాయి. కళ్యాణదుర్గంలో కాలం చెల్లిన పాలు సరఫరా చేశారు. మడకశిరలో కూడా ఇదే విధంగా సరఫరా చేశారు. కదిరి ప్రాంతంలో పౌష్టికాహారం కిట్లు పక్కదారి పట్టించారు. దీంతో ముగ్గురు అంగన్‌వాడీ వర్కర్లను విధుల నుంచి కలెక్టర్‌ ఇటీవల తొలగించారు. తాజాగా గుత్తి, మడకశిర, కదిరి ఈస్ట్‌, కదిరి వెస్ట్‌, పెనుకొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఐదుగురు సీడీపీ ఓలకు షోకాజ్‌లు జారీ చేశారు. ప్రత్యేక విచారణ సాగిస్తున్నారు. ఐదు ప్రాజెక్టులలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అవినీతి అక్రమాలే కొనసాగుతున్నాయి.


కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

ఐసీడీఎస్‌ పథకాలు అమలుకు నియమించిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పౌష్టికాహారం సర ఫరాకు వైఎ్‌సఆర్‌ సంపూర్ణ పోషణ అభియాన్‌ కిట్లు పంపిణీ చేస్తున్నారు. నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్‌  వీటిని సరఫరా చేస్తున్నారు. ఆ కిట్లలో సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి. పిండి పదార్థాలు వాసన వస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అలాగే కోడి గుడ్లు, పాలు సరఫరాలోను కాంట్రాక్టర్లు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. కోడి గుడ్డు సైజు మేరకు అందించకుండా చిన్నవి ఆపైన  కుళ్లిన గుడ్లు కేంద్రాలకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. పాలు నాణ్యత ఉండడం లేదు. పేరుకు ప్రభుత్వం డెయిరీ ద్వారా సరఫరా చేస్తున్నట్లు రికార్డులలో చూపుతున్నా మధ్యలో ఓ కాంట్రాక్టర్‌ ద్వారా సరఫరా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కానీ అధికా రులు సరఫరా విషయంలో మౌనంగా ఉండిపోతున్నారు. దీనికి కారణం కాంట్రాక్టర్ల నుంచి కమిషన్‌లు తీసుకుంటూ వారికి అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఆది నుంచి బలంగా వినిపిస్తున్నాయి. అనేక ప్రాంతాలలో గుడ్లు, పాలు సరఫరా విషయంలో వివాదాలు తలెత్తాయి. ఆ సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తలను బలి చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల రాయదుర్గంలో పంపిణీ చేసిన పాలలో కప్ప వచ్చిందని గర్భిణీ ఆందోళన చెందారు. కానీ అధికారులు అది కప్ప కాదు ప్లాస్టిక్‌ పేపర్‌ అని తేల్చి తప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీగా విజయలక్ష్మి నియమితులయ్యారు. కలెక్టర్‌ ఆమెను ఏరి కోరి నియమించారు. ఆమె గాడి తప్పిన ఐసీడీఎ్‌సను గాడిలో పెడుతుందో లేదో చూడాలి. 

Updated Date - 2021-01-12T06:53:15+05:30 IST