అయ్యే పనేనా..?

ABN , First Publish Date - 2021-02-05T06:43:44+05:30 IST

జిల్లా వైద్యాధికారి, అగ్నిమాపక, జల వనరుల శాఖాధికారుల కార్యాలయాలు, బాలభవన్‌, మున్సిపల్‌ అతిథిగృహం.. వీటన్నింటినీ తొలగిస్తారంట.

అయ్యే పనేనా..?
జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలుఙ

ఎంసీహెచ్‌ఏర్పాటు కలేనా?

కొన్నేళ్లుగా ప్రతిపాదనలతోనే కాలయాపన

తాజాగా ఏర్పాటుకు రూ.300 కోట్ల 

మంజూరుకు ఆమోదం

ఆస్పత్రి ఎదుట భవనాలు తొలగించి, ఏర్పాటు చేయాలని అడుగులు

ఇది సాధ్యమా అనే అనుమానాలు

అనంతపురం వైద్యం, ఫిబ్రవరి4:జిల్లా వైద్యాధికారి, అగ్నిమాపక, జల వనరుల శాఖాధికారుల కార్యాలయాలు, బాలభవన్‌, మున్సిపల్‌ అతిథిగృహం.. వీటన్నింటినీ తొలగిస్తారంట. ఈ స్థలంలో జిల్లా సర్వజనాస్పత్రికి సంబంధించి ప్రత్యేక కాన్పుల విభాగం (ఎంసీహెచ్‌) ఏర్పాటు చేస్తారట. అన్ని జిల్లా కార్యాలయాలను కూలగొట్టి, ఎంసీహెచ్‌ కడతారంటే.. ఎవ్వరికైనా ఇది అయ్యే పనేనా..? అన్న అనుమానం కలగక మానదు. అయినా.. చేసేస్తామంటున్నారు పాలకులు, అధికారులు. ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏళ్లుగా అనంతవాసుల కల. జిల్లా సర్వజనాస్పత్రిలో ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయి. రోజుకు సరాసరి 35 నుంచి 40 కాన్పులు చేస్తున్నారు. వీటిలో సగం సాధారణం కాగా, మరో సగం మందికి ఆపరేషన్‌ చేసి, బిడ్డలను తీయాల్సి వస్తోంది. సాధారణ కాన్పు అయిన బాలింతలు 48 గంటలపాటు ఆస్పత్రిలో ఉండి, డిశ్చార్జ్‌ అవుతున్నారు. ఆపరేషన్‌ అయినవారు వారంపాటు ఉండాల్సి వస్తోంది. ఆస్పత్రిలో అందుకు తగిన సౌకర్యాలు లేవు. కాన్పుల వార్డులో 90 బెడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురిని ఉంచి, చికిత్స అందించాల్సి వస్తోంది. దీంతో ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌, టీడీపీ హయాంలోనే ప్రయత్నాలు మొదలెట్టారు. టీడీపీ హయాంలో మంత్రి పరిటాల సునీతతోపాటు జిల్లా నేతలు.. అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, ఆమోదం వేయించారు. ఎన్నికలు రావటంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతేడాది ఈ బ్లాక్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు అడగ్గా.. రూ.300 కోట్లు అవసరమని జిల్లా అధికారులు నివేదికలు పంపారు. ఆ నిధుల మంజూరుకు ఆమోదం వేసినట్లు అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఎంసీహెచ్‌ బ్లాక్‌ స్థల పరిశీలన చర్యలు కూడా ఎమ్మెల్యే చేపట్టారు. చివరకు ఆస్పత్రి స్థలంలోనే ఏర్పాటుకు మొగ్గుచూపారు. వైద్య కళాశాలతోపాటు జిల్లా ఆస్పత్రికి మొత్తం 12.5 ఎకరాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి ఎదుట గల జిల్లా వైద్యాధికారి, అగ్నిమాపక, జలవనరుల శాఖ కార్యాలయాలు, నెహ్రూ బాలభవన్‌, మున్సిపల్‌ అతిథిగృహం ఆస్పత్రి స్థలంలో ఉన్నాయని అధికారులు నిర్ణయించారు. ఈ మొత్తం స్థలంలో ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటు చేయాలని అడుగులు వేస్తున్నారు. ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆ స్థలంలో జిల్లా కార్యాలయాలున్నాయి. వాటిని తొలగించి, ఆ స్థానంలో ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటు అంత సులభమా..? అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైద్యాధికారులు మాత్రం ఆ స్థలంలోనే నిర్మాణాలు చేపడతారనీ, ఇప్పటికే కలెక్టర్‌.. రాష్ట్ర శాఖకు నివేదికలు పంపినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంసీహెచ్‌ బ్లాక్‌ కల నెరవేరుతుందో.. లేదో.. చూడాలి మరి.త్వరలో టెండర్లకు అవకాశం

ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఆస్పత్రి ఎదుట ఉన్న వివిధ కార్యాలయాలను తొలగించి, అక్కడే బ్లాక్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్‌.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆస్పత్రి సామర్థ్యాన్ని 1200 పడకలకు పెంచుతున్నారు. ఇందులో కాన్పుల వార్డుకు 200 పడకలు కేటాయించారు. ఇది నిర్మాణం పూర్తయితే ప్రసవాల వార్డులో కష్టాలు తీరతాయి. స్థల సమస్య ఉన్నతాధికారులు చూసుకుంటారు. త్వరలో టెండర్లు పిలిచే అవకాశం ఉందని సమాచారం.

- డాక్టర్‌ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్‌, సర్వజనాస్పత్రి 

Updated Date - 2021-02-05T06:43:44+05:30 IST