డీపీఓపై సందిగ్ధం!

ABN , First Publish Date - 2021-01-20T07:10:10+05:30 IST

జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఎవరన్న దానిపై సందిగ్ధం నెలకొంది.

డీపీఓపై సందిగ్ధం!

ఉత్తర్వులు వచ్చి 20 రోజులైనా.. తేలని పంచాయితీ

డివిజనల్‌ అధికారిని కాదని ఎంపీడీఓకు ఉత్తర్వులు

కోర్టుకెళ్లటంతో అమలుకాని వైనం..

శాఖలో తీవ్ర ఉత్కంఠ

డీపీఓపై సందిగ్ధం!

అనంతపురం రైల్వే, జనవరి 19: జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఎవరన్న దానిపై సందిగ్ధం నెలకొంది. గతంలో ఉన్న డీపీఓ రామనాథ్‌రెడ్డి బదిలీపై రాష్ట్రశాఖకు వెళ్లటంతో ధర్మవరం డీఎల్‌పీఓ పార్వతికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఈ నెల 1వ తేదీన ఎంపీడీఓ శివారెడ్డిని డీపీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 రోజులు గడుస్తున్నా అవి అమలుకు నోచుకోలేదు. నూతన డీపీఓ వచ్చినట్లు జిల్లావ్యాప్తంగా పంచాయతీ సిబ్బందిలో చర్చ సాగుతున్నా.. ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఇన్‌చార్జ్‌ డీపీఓగా ఉన్న పార్వతి డివిజన్‌ స్థాయి అధికారి. శాఖపరంగా డీపీఓగా అన్ని అర్హతలూ తనకే ఉన్నాయనీ, అలాంటిది మండలస్థాయి అధికారిని ఎలా నియమిస్తారంటూ ఆమె కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం నుంచి శివారెడ్డికి జారీ అయిన ఉత్తర్వులపై స్టే వచ్చినట్లు సమాచారం. స్టే ఎత్తేశాక డీపీఓగా శివారెడ్డి బాధ్యతలు చేపడతారా? ఆలోపే తిరిగి పార్వతికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందా? అన్న చర్చ సాగుతోంది.


డివిజనల్‌ స్థాయి  అధికారులకే ప్రాధాన్యం

జిల్లా పంచాయతీ అధికారి నియామకానికి సంబంధించి డివిజన్‌ స్థాయి అధికారులకే ప్రాధాన్యం ఉంటుంది. డివిజనల్‌ స్థాయి అధికారులెవరూ ఆసక్తి చూపకుంటే మండలస్థాయి వారికి అవకాశమిస్తారు. ప్రస్తుతం డివిజన్‌ స్థాయి అధికారి ఇన్‌చార్జ్‌ డీపీఓగా కొనసాగుతున్నారు. అయినా మండలస్థాయి అధికారికి డీపీఓగా ఉత్తర్వులివ్వటం చర్చనీయాంశంగా మారింది. పైగా శాఖపరంగా పట్టు ఉన్నవారే ప్రస్తుత పరిస్థితుల్లో డీపీఓగా నెట్టుకరావడం కష్టతరంగా మా రిందని సీనియర్‌ అధికారులు చొప్పుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మండలస్థాయి అధికారికి పట్టంకడితే ఎలా ఉంటుందని అంటున్నారు. పైగా సచివాలయ వ్యవస్థ అమలుతో డీపీఓ కార్యాలయంపై పనిభారం పెరిగింది. ప్రభుత్వానికి ఎ లాంటి సర్వే రిపోర్ట్‌ కావాలన్నా.. ముందుండేది సచివాలయ సిబ్బంది, వలంటీర్లే. వీరిద్దరు డీపీఓ ఆధ్వర్యంలోనే పని చేస్తారు. దీంతో తగినస్థాయి అధికారులుంటే తప్పా.. నెట్టుకరావటం కష్టతరమన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో మండలస్థాయి అధికారిని డీపీఓగా నియమిస్తే ఎలాగన్న చర్చ సాగుతోంది.

Updated Date - 2021-01-20T07:10:10+05:30 IST