నాలుగో రోజు 1275 మందికి టీకా
ABN , First Publish Date - 2021-01-20T06:59:46+05:30 IST
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ నాలుగోరోజు మంగళవారం 1275 మంది టీకా వేయించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 26 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేశారు.

1204 మంది దూరం
జిల్లా ఆస్పత్రిలో పరిశీలించిన కలెక్టర్
అనంతపురం వైద్యం, జనవరి19: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ నాలుగోరోజు మంగళవారం 1275 మంది టీకా వేయించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 26 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేశారు. మొత్తం 2479 మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించి, వారికి మెసేజ్‌లు పంపారు. 1275 మంది మాత్రమే హాజరై, టీకా వేయించుకున్నారు. మిగిలిన 1204 మంది రాలేదు. దీంతో 51.43 శాతం నమోదైంది. ఇందులో అనంతపురం సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో అతి తక్కువ శాతం మంది టీకా వేయించుకున్నారు. ఒక కేంద్రంలో వంద మందికిగాను 21, మరో కేంద్రంలో 31 మంది టీకా వేయించుకున్నారు. సవీరా ఆస్పత్రిలో వంద మందికి 42, బుక్కరాయసముద్రంలో 60, నార్పలలో 64 మంది టీకా వేయించుకున్నారు. చుక్కలూరులో 98 మందికి 37 మంది, గుత్తిలో వందకు 54, ఉరవకొండ 36, కూడేరు 69, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి ఒక కేంద్రంలో 52, మరో కేంద్రంలో 63 మంది, రామగిరిలో వందకు 49, కంబదూరులో 56, కళ్యాణదుర్గం 77, కణేకల్లు 40, శాంతినగర్ హెల్త్ సెంటర్ 38, గాండ్లపెంటలో 77 మందికి 53, పుట్టపర్తి వందకు 82, పెనుకొండ 66, హిందూపురం 20, చిలమత్తూరు 15, గుమ్మఘట్ట 81 మందికి 8, ఎన్‌ఎ్‌సగేట్ వందకు 62, కనగానపల్లి 69 మందికి 52, పేరూరు 83 మందికి 71 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కామేశ్వరప్రసాద్, డీఐఓ గంగాధర్‌రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియ ప్రశాంతంగా సాగిందన్నారు. జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్, టీకా గదులను తనిఖీ చేశారు. నాలుగు రోజులుగా వ్యాక్సినేషన్ వివరాలపై ఆరా తీసారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జేసీ డాక్టర్ సిరి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కామేశ్వరప్రసాద్, సూపరెండెంట్ డాక్టర్ నవీద్ అహ్మద్, ఆర్‌ఎంఓ విజయమ్మ పాల్గొన్నారు.
వ్యాక్సిన్ రియాక్షన్.. టెన్సన్
కనగానపల్లిలో ఐదుగురికి అస్వస్థత
కరోనా వ్యాక్సిన్ రియాక్షన్ ఇస్తోందనే టెన్సన్ ప్రజల్లో నెలకొంది. మొదటిరోజున జిల్లా సర్వజనాస్పత్రిలో అఖిల అనే హెల్త్ వర్కర్ అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు కావటంతో ఏఎంసీకి తరలించారు. రెండో రోజు అనంతపురంలోని ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న మాలతి అనే నర్సు అస్వస్థతకు లోనయ్యారు. ప్రథమ చికిత్స అనంతరమూ అలాగే ఉండటంతో జిల్లా సర్వజనాస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మూడోరోజు జిల్లా సర్వజనాస్పత్రిలో ఐడీ వార్డులో వ్యాక్సిన్ వేయించుకున్న ఐదారుగురు వైద్య సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారు గంటలో కోలుకున్నారు. మంగళవారం కనగానపల్లిలో వ్యాక్సిన్ వేయించుకున్న ఐదుగురు ఏఎన్‌ఎంలు అస్వస్థతకు లోనయ్యారు. కొందరికి కళ్లు తిరగటం, తలనొప్పి విపరీతంగా రావటం, మరికొందరికి అలర్జీ, వాంతులు అయినట్లు చెబుతున్నారు. దీంతో వీరిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి ముగ్గురిని డిశ్చార్జ్ చేయగా.. ఇద్దరు అక్కడే ఉన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న పలువురు ఇబ్బంది పడుతున్నారు. కళ్లు తిరగటం, జ్వరం రావటం సాధారణమనీ, అందుకే టీకా వేయించుకున్న తర్వాత అరగంటపాటు అక్కడే ఉంచుకుని, పర్యవేక్షిస్తున్నామని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌ఓ, డీఐఓ అంటున్నారు.