కరోనా కొత్త కేసులు 29

ABN , First Publish Date - 2021-03-24T06:38:45+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

కరోనా కొత్త కేసులు 29
జిల్లా సర్వజనాస్పత్రి కొవిడ్‌ సెంటర్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

జిల్లా ఆస్పత్రిలో అలజడి

గర్భిణికి పాజిటివ్‌

పెరుగుతున్న బాధితులు 

ముందస్తు చర్యలపై యంత్రాంగం దృష్టి

అనంతపురం వైద్యం, మార్చి 23: జిల్లాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 29 మందికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 68041 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 67265 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 601 మంది మరణించారు. 175 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కేసులు నమోదవుతుండటం జిల్లా సర్వజనాస్పత్రిలో ఆందోళన కలిగిస్తోంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి పరీక్షలు చేయగా.. కరోనా లక్షణాలున్నట్లు తేలింది. ఆమెను గర్భిణిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్‌ విభాగంలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. చెస్ట్‌ వా ర్డులో దాదాపు 30 మంది వరకు కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కొందరు వైద్య సిబ్బందికి కూడా పాజిటివ్‌ రావడంతో హోంక్వారంటైన్‌లో ఉంటున్నారనీ, ఆ విషయాన్ని వైద్య వర్గాలు గుట్టుగా ఉంచటం ఆస్పత్రిలో మరింత ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ముందస్తు చర్యలకు యంత్రాంగం సిద్ధమైంది. సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు.. హెచ్‌ఓడీలతో మంగళవారం సమావేశమై, చర్చించారు. కేసులు పెరగడం, ఆస్పత్రికి తాకిడి మొదలుకావడంతో అవసరమైన సౌకర్యాలు చికిత్సలు అందించేందుకు సిద్ధమయ్యారు. పీజీ క్వార్టర్స్‌లో మరో 70 పడకలు సిద్ధం చేస్తున్నారు. సీరియస్‌ బాధితులను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి, చికిత్సలు అందించేందుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకుంటున్నారు. శ్వాస సమస్య ఏర్పడితే వారికి వెంటనే ఆక్సిజన్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం ఆర్‌ఎంఓ డాక్టర్‌ విశ్వనాథయ్య పీజీ క్వార్టర్స్‌ను పరిశీలించారు. కొవిడ్‌ విభాగంలో ఆక్సిజన్‌ పరికరాలు పనిచేస్తున్నాయా, లేదా అని పరిశీలించారు.

కరోనా పరీక్షలకు పరుగులు

జిల్లాలో కరోనా మళ్ళీ భయపెడుతోంది. కేసులు పెరుగుతుండటం, వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఏ చిన్న అనుమాన లక్షణాలు అనిపించినా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి పరుగులు తీస్తున్నారు. నాలుగైదు రోజులుగా కరోనా కిట్లు లేక పరీక్షలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కిట్లు రావటంతో జిల్లా ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో పరీక్షలు చేయించుకోవడానికి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. మంగళవారం కొవిడ్‌ ఓపీ విభాగం సందడిగా కనిపించింది. వచ్చిన వారికి కొవిడ్‌ పరీక్షలు చేస్తూ వైద్య సిబ్బంది బిజీగా కనిపించారు. జిల్లాలో అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో కొవిడ్‌ పరీక్షలు కొనసాగిస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. పాఠశాలల్లో కేసులు నమోదవుతుండటంతో పాఠశాలలకు వైద్య సిబ్బంది వెళ్లి, కరోనా వ్యాక్సిన్‌ అక్కడే వేస్తున్నారు. జిల్లాలో 173 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో రోజూ వేలల్లోనే టీకాలు వేస్తున్నామని వైద్య శాఖాధికారులు తెలిపారు. 

Updated Date - 2021-03-24T06:38:45+05:30 IST