రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-22T06:32:28+05:30 IST

కరోనా ముప్పు మళ్లీ ముంచుకొస్తోంది. మహమ్మారి ప్రభావం తగ్గుతుందనుకుంటున్న తరుణంలో విపరీతంగా పెరుగుతోంది.

రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు
అనంతపురంలోని సప్తగిరిసర్కిల్‌లో మాస్కుల్లేకుండా తిరుగుతున్న జనం

స్వీయ నియంత్రణతోనే అడ్డుకట్ట

విస్మరిస్తే.. మూల్యం చెల్లించక తప్పదు

పాఠం... గుణపాఠంగా నేర్వాల్సిందే...

ఇప్పటికే కరోనా కాటుకు 601 మంది మృత్యువాత

68 వేలకు చేరువగా మొత్తం పాజిటివ్‌ కేసులు

అనంతపురం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): కరోనా ముప్పు మళ్లీ ముంచుకొస్తోంది. మహమ్మారి ప్రభావం తగ్గుతుందనుకుంటున్న తరుణంలో విపరీతంగా పెరుగుతోంది. ఆదివారం ఏకంగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది పెనుప్రమాద సూచికనే చెప్పొచ్చు. మహమ్మారి జిల్లాలో వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. ఆ ఛాయలు ఆ కుటుంబాలను ఏడాదిగా వెంటాడుతూనే ఉన్నాయి. పెద్ద దిక్కును కోల్పోయి, ఆ బతుకులు అతలాకుతలమయ్యాయి. లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. రెక్కాడితేగానీ డొక్కాడని కష్టజీవులు ఆకలి బాధలు చవిచూశారు. గతేడాది మార్చిలో కరోనా మహమ్మారి జిల్లాను తాకిన విషయం అందరికీ ఎరుకే. వైరస్‌ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్న సగటు మనిషికి ఆ బాధేంటో తెలుసు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మరోసారి కరోనా పంజా విసురుతోంది. వారంరోజులుగా జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇందుకు అద్దం పడుతోంది. మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే మాస్కు ధరించటం, భౌతికదూరం పాటించటం, పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వటమే మార్గాలు. వాటిని ప్రతిఒక్కరూ పాటిస్తేనే వైరస్‌ బారి నుంచి బయటపడగలం.


మూల్యం చెల్లించుకోక తప్పదు

జిల్లాలో ఇప్పటివరకు 67,986 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో కరోనాతో పోరాడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచిన వారిలో 601 మంది ఉన్నారు. 67,247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 138 మంది చికిత్స పొందుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. శనివారం 22 కేసులు నమోదుకాగా.. ఆదివారం ఆ సంఖ్య ఏకంగా 40కి పెరిగింది. జిల్లాలో తాజా పరిస్థితిని చూస్తుంటే.. ప్రజలు కరోనాను విస్మరించినట్లేనని క్షేత్రస్థాయిలో పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. వైద్యకళాశాల విద్యార్థులు కరోనా బారిన పడటమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో.. ప్రజలు మరింత బాధ్యతగా మెలగాల్సిందిపోయి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్కరూ మాస్కు ధరించట్లేదు. భౌతికదూరాన్ని పట్టించుకోవట్లేదు. దుకాణాల్లో శానిటైజర్‌ను అందుబాటులో ఉంచడం దాదాపుగా మానేశారు. అధికారులు సైతం అదే బాటలో పయనిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు. ఇలా ఎవరికి వారు నిబంధనలను గాలికొదిలేస్తుండటంతో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వైద్యవర్గాల నుంచే వినిపిస్తోంది.


గుణపాఠంగా తీసుకోకపోతే....

జిల్లాలో కరోనాతో ఏడాదికాలంలో అధికారిక గణాంకాల మేరకు... 601 మంది చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటుందనడంలో సందేహం లేదు. కరోనాతో మృత్యువాత పడిన వారిలో వైద్యులు, పోలీసు అధికారులతోపాటు సామాన్యులు ఉన్నారు. వందలాది మంది భవిష్యత్తును కరోనా కాలరాసింది. పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసింది. కొందరు తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. తాజా పరిస్థితిని చూస్తుంటే.. కరోనా మరోసారి పంజా విసురుతోందా..? అన్న సందేహాలకు తావిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణం. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ మరోసారి విజృంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే 40 కేసులు నిర్ధారణ కావటంతో ప్ర జలు భయాందోళనలు చెందుతున్నారు. గతంలో నేర్చిన పాఠాలను గుణపాఠంగా తీసుకోకపోతే ప్రాణాలను పణంగా పెట్టక తప్పదన్నది నిర్వివాదాంశం.Updated Date - 2021-03-22T06:32:28+05:30 IST