కరోనా కట్టడికి కర్ఫ్యూ..!

ABN , First Publish Date - 2021-05-05T06:25:46+05:30 IST

జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం క ర్ఫ్యూ అమలుకు ఆదేశాలిచ్చింది.

కరోనా కట్టడికి కర్ఫ్యూ..!

నేటి మధ్యాహ్నం నుంచి ఆంక్షలు అమలు

జనసంచారం కట్టడికి 144 సెక్షన్‌

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 

12 వరకే వ్యాపార సముదాయాలు 

 వివిధ సంస్థలు, బ్యాంకులు, 

కార్యాలయాలకూ వర్తింపు 

12 తరువాత ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం

 రాష్ట్ర సరిహద్దు మూసివేత 

అనంతపురం, మే 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం క ర్ఫ్యూ అమలుకు ఆదేశాలిచ్చింది. బుధవారం మ ధ్యాహ్నం నుంచే ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. జనసంచారం కట్టడికి 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు.  ఉదయం 6 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలు తిరిగేందుకు అనుమతిచ్చారు. ఆ తరువాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. కరోనా కట్టడికి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం, పోలీసుశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. నిర్దేశించిన సమయంలోనే నిత్యావసరాలు, వ్యాపారాలకు కర్ఫ్యూ నుంచి సడలింపు అవకాశమిచ్చారు. ఈ క్రమంలోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తుండడంతో ప్రజలు నలుగురికి మించి గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిత్యావసరాల కొనుగోలుతో పాటు ఇతరత్రా పనుల నిమిత్తం బయటకొచ్చిన సందర్భాల్లో ప్రతిఒక్కరు మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినివ్వనున్నారు. జిల్లా అంతటా కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసుశాఖ సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో వ్యాపారవర్గాలు తమ వ్యాపార సముదాయాలను మధ్యా హ్నం 12 గంటలకే బంద్‌ చేయాల్సి ఉంటుంది. రెం డు వారాల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. 


వివిధ సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలకూ వర్తింపు 

కరోనా కట్టడి నేపథ్యంలో కర్ఫ్యూను వివిధ సంస్థ లు, బ్యాంకులు, కార్యాలయాలకూ వర్తింపజేశారు. తప్పనిసరిగా నిబంధనలు, ఆంక్షలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి మధ్యాహ్నం 12 గంటల లోపే వివిధ సంస్థలు, బ్యాంకులు, ఇతర కార్యాలయాల్లో పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మద్యం దుకాణాలు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం మద్యం దుకాణాలకు సమయాన్ని కుదిస్తూ జీవో జారీ చేసింది. 


మధ్యాహ్నం 12 తరువాత బస్సులు బంద్‌ 

కర్ఫ్యూ అమలు చేస్తున్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం తరువాత ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఇతర జిల్లాలకు బస్సులు నడపడం లేదు. జిల్లా పరిధిలోనే ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. అందుకు అనుగుణంగా ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. మధ్యా హ్నం 12 గంటల తరువాత అత్యవసర సేవల వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతించనున్నారు. ఉదయం షాపులు తెరిచే సమయంలోనే ప్రజారవాణాకు అనుమతినిచ్చారు. ఆటోలు, సిటీ బస్సులను మధ్యాహ్నం వరకే పరిమితం చేశారు.   ఇదిలాఉండగా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దున ఉన్న అటు తెలంగాణ, ఇటు కర్ణాటక నుంచి ప్రజల రాకపోకలు పూర్తి గా స్తంభించిపోనున్నాయి. రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేస్తున్నారు. జి ల్లా విషయానికొస్తే కొడికొండ చెక్‌పోస్టు వద్ద సరిహద్దును బంద్‌ చేయనున్నారు. 


Updated Date - 2021-05-05T06:25:46+05:30 IST