ప్రభుత్వ భూములను మింగేస్తున్న అక్రమార్కులు

ABN , First Publish Date - 2021-03-21T06:21:48+05:30 IST

రాష్ట్ర ప్రభు త్వం పేదలకు ఇళ్ల పట్టాలిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించింది. ప్రజాధనం వెచ్చించి, లేఅవుట్లు వేసింది.

ప్రభుత్వ భూములను మింగేస్తున్న అక్రమార్కులు
సర్వే నెంబరు 207లో రహదారి పక్కన ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలు, పక్కనే నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనం

యథేచ్ఛగా భవన నిర్మాణాలు

అహుడా నిబంధనలు గాలికి..

శ్మశానాన్నీ వదలని దుస్థితి

కబ్జారాయుళ్లకు వైసీపీ 

నేతల అండ?

చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

అనంతపురం కార్పొరేషన్‌, మార్చి 20: రాష్ట్ర ప్రభు త్వం పేదలకు ఇళ్ల పట్టాలిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించింది. ప్రజాధనం వెచ్చించి, లేఅవుట్లు వేసింది. హద్దుల రాళ్లు పాతింది. మౌలిక సౌకర్యాలకూ భారీగానే తగలేసింది. ఇక పేదలకు అప్పగించటమే తరువాయి. ప్రభుత్వ భూములైతే మాకేంటి? లేఅవుట్లు వేస్తే భయమేంటి? అన్నట్లు రెచ్చిపోతున్నారు కబ్జారాయుళ్లు. హద్దుల రాళ్లను తొలగించి, స్థలాలను ఆక్రమించేస్తున్నారు. ఏకంగా భవన నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. వారి వ్యవహారాన్ని అధికారులు చోద్యంలా చూస్తున్నారు. వారికి అధికార పార్టీ అండదండలుండటంతో మిన్నకుండిపోతున్నారు. దీంతో కబ్జారాయుళ్లకు అడ్డే లేకుండా పోతోంది. శ్మశానాలను కూడా మింగేస్తున్నారు.


ప్రభుత్వ భూములే లక్ష్యం

ప్రభుత్వ భూములనే కబ్జారాయుళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఎకరాల కొద్దీ ఆక్రమించేశారు. దర్జాగా అందులోనే భవనాలు నిర్మించేశారు. కొందరు అధికార పార్టీ నేతల అండ చూసుకుని, మరింత పెట్రేగిపోతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ముసుగులో కొన్నేళ్లుగా డీ ఫారం పట్టాలు సృష్టించిన కొందరు ఘనులు.. ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వానిది కాదనే పరిస్థితికి తీసుకొచ్చారు. దాంతోపాటు రాజకీయ ఒత్తిళ్లు ఎలాగూ పనిచేస్తున్నాయి. వెరసి చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లు అధికారులు కూడా ఆమ్యామ్యాలు అందుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అనంతపురం రూరల్‌ మండలం ఇటుకలపల్లి పరిధిలోని భూములు భారీగా కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ఇటీవలే ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి వేసిన ప్లాట్లను ఆక్రమణదారులు తొలగించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండటం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. భూములు ఆక్రమించటంతోపాటు అనుమతి లేకుండా భవనాలను యథేచ్ఛగా నిర్మించేస్తున్నారు. అనంతపురం-హిందూపురం డెవల్‌పమెంట్‌ అథారిటీ (అహుడా) పరిధిలోనే ఈ భూములున్నా అక్కడ ఆ నిబంధనలను పట్టించుకునే నాథుడే లేడు. ఆ శాఖాధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. భూములు ఆక్రమించిన వారు మాత్రం రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు.


ప్రభుత్వోద్యోగులు సైతం..

అది జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి. ఇప్పుడు అది ప్రభుత్వ భూమా..? అని ప్రశ్నించే స్థాయికి చేర్చారు అక్రమార్కులు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులే ఇందుకు ఊతమిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటుకలపల్లిలోని సర్వే నెంబరు 207లో 5.12 ఎకరాల భూమి ఉంది. అందులో ప్రభుత్వ అనుమతితో రెండెకరాల్లో ఓ కాలనీలో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన 3.12 ఎకరాల్లో 30 సెంట్ల వరకు తాజాగా సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారు. అందులోనే తాజాగా ప్రభుత్వం అందజేస్తున్న ఇళ్ల పట్టాలకు రెవెన్యూ అధికారులు ప్లాట్లు వేశారు. అందులో రెండెకరాల వరకు 68 పట్టాలు సిద్ధం చేశారు. మిగిలిన భూమిని కొందరు ఆక్రమించేశారని స్థానికులే ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగాలు చేస్తున్న దంపతులు సైతం ఓ భవన నిర్మాణానికి పూనుకోవటం గమనార్హం. వారిని మరో ప్రభుత్వోద్యోగి అనుసరిస్తున్నారు. అధికారులు సెక్షన్‌-7 కింద నోటీసులిచ్చినా.. వారు పెడచెవిన పెట్టేశారు. అదంతా ప్రైవేటు భూమే అనుకుంటే.. ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం కొనుగోలు చేయాలి. అలాంటిదేమీ చేయలేదు. ఇది తెలిసి కూడా ఆక్రమణలకు గురవుతుంటే పైస్థాయి అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.


శ్మశాన స్థలాన్నీ వదల్లేదు

స్థలమేదైనా కబ్జా చేయటమే మార్గంగా ఎంచుకున్నారు అక్రమార్కులు. దీంతో ఆక్రమణలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇటుకలపల్లి పరిధి సర్వే నెంబరు 248లో 9 ఎకరాల పైచిలుకు భూమి ఉంది. ఇందులో రెండెకరాల వరకు ఏళ్ల తరబడి నుంచి శ్మశానవాటికగా ఉపయోగిస్తున్నారు. మిగిలిన భూమి అంతా ఆక్రమణలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రెండెకరాల వరకు ప్లాట్లు వేసి, విక్రయించారనే ఆరోపణలున్నాయి. మిగిలిన భూమిని కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు వారు కుతంత్రాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై రెండు వారాల క్రితం వివాదం తలెత్తింది. కనీసం నాలుగెకరాలైనా శ్మశానానికి వదలాలని అధికారులకు విన్నవించుకున్నారు. అదంతా చుక్కల భూమేనని రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. అధికారులకు విన్నవించినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఆ భూమి తమది అని చెప్పుకునే వారికి వైసీపీ నేతల అండ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికారులు సైతం చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


అధికారులు లేఅవుట్లు వేసినా...

ఇటుకలపల్లి పరిధిలోని మరో సర్వే నెంబరులో భూమిని ప్రభుత్వానిదిగా నిర్ధారించిన రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాల కోసం ప్లాట్లు వేశారు. వాటిని కొందరు ఘనులు తొలగించేశారు. ఆ స్థలంలో ఏకంగా నిర్మాణాలు చేపట్టా రు. దీనిని చూసిన అధికారులు చేసేదేమీలేక ముక్కున వేలేసుకుని, ఉండిపోయారు. సర్వే నెంబరు 197లో పదెకరాల భూమి ఉంది. అందులోని ఏడెకరాల్లో నాలుగు నెలల క్రితం రెవెన్యూ అధికారులు 230 ప్లాట్లు వేశారు. కొన్నిరోజుల వరకు బాగానే ఉంది. ఆ తరువాత ప్లాట్లలో వేసిన రాళ్లు కనుమరుగయ్యాయి. కొందరు ఏకంగా ఇళ్లు, భవనాలు నిర్మించే పనిలో పడ్డారు. అవన్నీ ఆక్రమణలకు గురైనట్లు అధికారులకు ఆలస్యంగా తెలిసొచ్చింది. ఇదేంటని కిందిస్థాయి సిబ్బంది ప్రశ్నిస్తే.. తాము కోర్టుకెళ్లామనీ, స్టే ఇచ్చారని చెబుతూ నిర్మిణాలకు ఉపక్రమిస్తున్నారట. స్టే అంటే ఇల్లు కట్టుకోమనా..? అని రెవెన్యూ సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే 70 శాతం వరకు నిర్మాణాలు పూర్తయినట్లు అధికారులే చెబుతున్నారు. మరో ఎకరాన్నర ఆక్రమణలో ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం తతంగం వెనుక రాజకీయ పార్టీల అండదండలు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.


పక్కా ప్రభుత్వ భూమే..

ఇటుకలపల్లి 197, 207 సర్వే నెంబర్లలోని భూమిలో కొందరు ప్రైవేటు వ్యక్తులు వెంచర్లు వేశారు. ఆ తర్వాత కొందరు వాటిని విక్రయించారు. అది పక్కా ప్రభుత్వ భూమే. 207, 209 సర్వే నెంబర్లను కలిపి, లే అవుట్‌గా వేశారు. మా దృష్టికి రావటంతో నోటీసులు జారీ చేశాం. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. ఆ భూమి మొత్తం ప్రభుత్వానికి చెందుతుంది. 197, 207 సర్వే నెంబర్లలో కొన్ని ఇళ్ల పట్టాలున్నాయి. సర్వే నెంబరు 248పై కూడా దృష్టి సారిస్తాం.

- లక్షీనారాయణరెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్‌, అనంతపురం



నాడు లేఅవుట్‌.. నేడు కబ్జా..

అనంతపురం రూరల్‌ మండలం సర్వే నెంబరు 197లో ప్రభుత్వ భూమిని గుర్తిస్తూ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు కొన్ని నెలల క్రితం లేఅవుట్లు వేశారు. హద్దుల రాళ్లు పాతారు. పట్టాలు కూడా సిద్ధం చేశారు. అప్పట్లో లేఅవుట్లను అధికారులు పరిశీలిస్తుండటాన్ని ఈ ఫొటోలో చూడొచ్చు.




ఇప్పుడు.. ఆ హద్దుల రాళ్లు, లేఅవుట్లు కనిపించకుండా పోయాయి. తొలగించేశారు. దర్జాగా స్థలాన్ని కబ్జా చేసి, అక్కడే నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇవిగో.. ఇలా వెలుస్తున్నాయి.

Updated Date - 2021-03-21T06:21:48+05:30 IST