కాళ్లు విరిచేస్తా..!

ABN , First Publish Date - 2021-02-05T06:46:16+05:30 IST

‘అందరూ భయంగా పని చేసుకోండి. ఎవరు బలవుతారో.. ఎవరు లేదో.. నాకే తెలియదు. ఈ రచ్చకట్ట మీద కూర్చుని, చెబుతున్నా.. పది, పదిహేను మంది భుజాల కింద కట్టెలు పెట్టుకుని, నడుస్తారు (పరోక్షంగా కాళ్లు విరిచేస్తాననే వార్నింగ్‌). నాకు ఎలాంటి దయాదాక్షిణ్యాల్లేవు.

కాళ్లు విరిచేస్తా..!

కాళ్లు విరిచేస్తా..!

అసలే మంచోళ్లం కాదు.. పిల్లాజల్లా అనే కనికరం లేదు..

భయంభక్తి లేకుండా చేస్తే.. 

20 మంది బలవుతారు..

ఎవరు బలవుతారో నాకే తెలియదు..

ధర్మవరం నియోజకవర్గంలో 

ఓ వైసీపీ నేత తీవ్ర హెచ్చరిక

ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ శ్రేణులు

ఆ నేత దౌర్జన్యాలకు అడ్డుకట్ట 

వేయకపోతే ఓటేయలేమంటున్న జనం

సొంత పార్టీ రెబల్‌ అభ్యర్థులకూ అదే వార్నింగ్‌

రాత్రి వేళల్లో భయోత్పాతం సృష్టిస్తున్న

అధికార పార్టీ నాయకులు

ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రత్యర్థి అభ్యర్థులకు బెదిరింపులు

అనంతపురం, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): ‘అందరూ భయంగా పని చేసుకోండి. ఎవరు బలవుతారో.. ఎవరు లేదో.. నాకే తెలియదు. ఈ రచ్చకట్ట మీద కూర్చుని, చెబుతున్నా.. పది, పదిహేను మంది భుజాల కింద కట్టెలు పెట్టుకుని, నడుస్తారు (పరోక్షంగా కాళ్లు విరిచేస్తాననే వార్నింగ్‌). నాకు ఎలాంటి దయాదాక్షిణ్యాల్లేవు. పిల్లాజల్లా అనే కనికరం కూడా లేదు. భయం, భక్తి లేకుండా గ్రామాల్లో ప్రవర్తిస్తే 20 మంది బలవుతారు.’ ఇదీ.. జిల్లాలో ఓ వైసీపీ నేత బెదిరింపు. దీంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. జిల్లాలో అధికార వైసీపీ నేతలు బరితెగిస్తున్నారు. ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులైన అభ్యర్థుల్లో వణుకుపుట్టేలా హెచ్చరికలు చేస్తున్నారు. అడ్డొస్తే ఏం జరుగుతుందో చెప్పలేమన్న సంకేతాలను పంపుతున్నారు. ఎవరెవరు బలవుతారో తెలియదనే విధంగా అధికార పార్టీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. చివరికి సొంత పార్టీ రెబల్స్‌ అభ్యర్థులపైనా సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేస్తున్నారు. రాత్రివేళల్లో గ్రామాల్లో సంచరిస్తూ ఓటర్లను భయకంపితులను చేసేందుకూ వెనకాడట్లేదు. ప్రధానంగా రెండో విడతలో జరగనున్న ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లోనే ఈ దారుణమైన పరిస్థితులున్నాయనటంలో సందేహం లేదు. నిఘా గురి తప్పితే.. అరాచకశక్తులు పెట్రేగిపోయే అవకాశాలు లేకపోలేదని ఆంధ్రజ్యోతి ముందే పోలీసు శాఖను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రెండు నియోజకవర్గాల్లో అదే సాగుతోంది. ధర్మవరం నియోజకర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత హెచ్చరికలు చూస్తుంటే.. ఏ స్థాయిలో బెదిరింపులకు దిగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ధర్మవరం రూరల్‌ మండల పరిధిలో ఉంటున్న ఆ నేత రాత్రి సమయాల్లో గ్రామాల్లోకి వెళ్లి, రచ్చబండ వేదికగా చేసుకుని సమావేశాల పేరుతో హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యేలా ఆ నేత చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏ క్షణాన ఆ నేత ఎవరిపై గ్రామంలో దాడి చేస్తారో.. ఎవరికి ఏ తరహా హెచ్చరికలు జారీ చేస్తారోనన్న ఆందోళన అక్కడి ప్రజల్లో నెలకొంది. రెండ్రోజుల క్రితం ఆ నేత ధర్మవరం రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామానికి వెళ్లి హెచ్చరించిన విధానాన్ని పరిశీలిస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడచాల్సిందే. ఆ ముఖ్య నేత హెచ్చరికలను అదే పార్టీకి చెందిన ఓ కార్యకర్త రికార్డు చేయటంతో వ్యవహారం బట్టబయలైంది. కాళ్లు విరిచేస్తాననేలా వార్నింగ్‌ ఇచ్చారు. ఎవరి ప్రాణం తీయననీ, కాళ్లు విరిచేస్తానంటూ గ్రామ నడిబొడ్డున హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరహాలో ఆ నేత హెచ్చరికలు ఆ నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆ నేతకు ఫ్యాక్షన్‌తో నేరుగా సంబంధాలు ఉండటం మూలంగా తమకు ముప్పు వాటిల్లే ప్రమాదముందున్న ఆందోళన అక్కడి ప్రజల్లో కలుగుతోంది. దీంతో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. పోలీసులు తమకు రక్షణ కల్పించకపోతే గ్రామాల్లో సామాన్య ప్రజలు ఓట్లు వేసేందుకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతోందన్న ఆందోళన అక్కడి వారిలో వ్యక్తమవుతోంది. ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకోవటంలో భాగంగా ఇలాంటి హెచ్చరికలను తరచుగా చేస్తుంటాడనీ, అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలను సాకుగా చేసుకుని, ఈ తరహా వ్యాఖ్యలు చేశాడనే అభిప్రాయం నియోజకవర్గంలో కలుగుతోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎలా జరుగుతాయన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది. మరి పోలీసులు ఎన్నికల ప్రశాంతతకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


సొంత పార్టీ రెబల్‌ అభ్యర్థులకూ సేమ్‌ సీన్‌

అధికార పార్టీ నేతలకు పంచాయతీ ఎన్నికలు పెను సవాల్‌గా మారాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రశాంతంగా ఎన్నికలు సాగితే ఆ పార్టీ నేతల ప్రాబల్యానికి గండిపడే అవకాశం ఉందో? మరేమోగానీ.. మెజార్టీ సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకోవాలనే దిశగానే ఆ పార్టీ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ప్రత్యర్థి పార్టీల మద్దతుదారుల పరిస్థితి అటుంచితే.. సొంత పార్టీ రెబల్స్‌కు కూడా నాయకుల నుంచి బెదిరింపులు తప్పట్లేదు. మొదట ప్రలోభాల ఎర చూపడం.. వినకపోతే ఇబ్బందులు పెడుతున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. కనగానపల్లి మండలం కేఎన్‌ పాళ్యం పంచాయతీకి ఓ మహిళ నామినేషన్‌ వేసింది. విత్‌ డ్రా చేసుకోవాలని సొంత పార్టీ నేతలే తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది, పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు యత్నించిందంటే పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో... అర్థం చేసుకోవచ్చు. ప్రసన్నాయపల్లి సర్పంచ్‌ స్థానానికి అధికార పార్టీలోని రెండు వర్గాల నేతలు పోటీపడి వారి వారి మద్దతుదారులతో నామినేషన్‌ వేయించారు. ఇక్కడ ఓ వర్గం నుంచి నామినేషన్‌ వేసిన ఆ మహిళా అభ్యర్థి ఉపసంహరించుకునే విధంగా బెదిరింపులున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలా వారి ఆధిపత్యానికి అడ్డొస్తే సొంత పార్టీ మద్దతుదారులకైనా బెదిరింపులు తప్పట్లేదు. ఇవి మచ్చుకు కొన్నే. బయటకు చెప్పుకోలేక ఆ పార్టీలోని మద్దతుదారులు ఎంతో మంది మదనపడుతున్నారన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచే వినిపిస్తుండటం తాజా పరిస్థితులకు అద్దం పడుతోంది.



ఉపసంహరణపైనే దృష్టి

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ధర్మవరం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లోని 310 పంచాయతీలకు గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఎక్కడా ఏకగ్రీవాలకు తావులేకుండా అన్ని సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపసంహరణకు మరో నాలుగు రోజులు గడువుంది. ఈ క్రమంలో ఉపసంహరణలపైనే అధికార పార్టీ నేతలు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలపైనే దృష్టి సారించినట్లు సమాచారం. ఏయే పంచాయతీ నుంచి ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు నామినేషన్లు వేశారో.. వారి వివరాలను స్థానిక నేతల నుంచి సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ముందుగా కాసుల ఎర చూపుతూ.. నామినేషన్లు ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆ పార్టీ ముఖ్య నేతల సొంత పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలనే లక్ష్యంగా పావులు కదిపే వ్యూహ రచనలో నిమగ్నమైనట్లు ఆ వర్గాల ద్వారా అందిన సమాచారం. దారికొస్తే సరి.. లేకపోతే ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికల సంకేతాలను పంపుతున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..? 

Updated Date - 2021-02-05T06:46:16+05:30 IST