కీలక పోస్టుపై ‘వసూల్ రాజా’ కన్ను..!
ABN , First Publish Date - 2021-05-20T06:35:18+05:30 IST
జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త కార్యాలయంలోని (జేడీఏ ఆఫీస్) కీలక పోస్టుపై ‘వసూల్ రాజా’ కన్నేశారు.

ఏడీఏ పీపీ పోస్టును దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు
అవకాశమిస్తే ఎంతడబ్బయినా వసూలు చేసిస్తానంటూ ఉన్నతాధికారికి ఆఫర్
గతంలో యూరియా కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన వైనం
ఆయన ఎక్కడ పనిచేసినా వివాదాస్పదమే
అడిగినంత ఇవ్వకుంటే డీలర్లకు చుక్కలే
వ్యవసాయ శాఖలో గుసగుసలు
అనంతపురం వ్యవసాయం, మే 19: జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త కార్యాలయంలోని (జేడీఏ ఆఫీస్) కీలక పోస్టుపై ‘వసూల్ రాజా’ కన్నేశారు. ఎలాగైనా ఆ పోస్టులోకి వచ్చేందుకు ‘వసూల్ రాజా’గా పేరొందిన ఓ ఏడీఏ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తనకు ఆ పోస్టు కేటాయిస్తే ఏడాదికి ఎంత అడిగినా వసూలు చేయిస్తానంటూ ఆ శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారికి ఆఫర్ ఇచ్చినట్లు ఆ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జేడీఏ ఆఫీ్‌సలో కీలకమైన ఏడీఏ పీపీ పోస్టులోకి కొత్త అధికారి ఎవరు వస్తారన్న దానిపై ఆ శాఖలో గుసగుసలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం వ్యవసాయ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. జేడీఏ కార్యాలయంలో ఏడీఏ పీపీ (ప్లాంట్ ప్రొటేషన్) పోస్టు కీలకమైంది. జిల్లావ్యాప్తంగా ఎరువులు, పురుగుమందులు, క్రిమిసంహారక మందుల పర్యవేక్షణ, వాటికి సంబంధించి రెన్యువల్స్‌తోపాటు అన్నిరకాల అనుమతులు ఏడీఏ పీపీ సీటు నుంచే ఆ శాఖ ఉన్నతాధికారికి వెళ్లాల్సి ఉంటుంది. విస్తీర్ణంలో అనంత పెద్ద జిల్లా. జిల్లావ్యాప్తంగా 950కిపైగా ఎరువులు, పురుగు మందులు, క్రిమిసంహారక మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షణ బాధ్యతలున్నందున ఆ పోస్టుకు అంతగా డిమాండ్ ఏర్పడింది. ఆ సీటులో కూర్చుని, చక్రం తిప్పితే కోట్లకు పడగలెత్తొచ్చన్న దురాశలో డీలర్ల నుంచి డబ్బు వసూలు చేయడంలో దిట్టగా పేరొందిన ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పోస్టులో పనిచేస్తున్న అధికారిని వ్యక్తిగత కారణాల నేపథ్యంలో తనను మరో పోస్టుకు మార్చాలని ఉన్నతాధికారులకు విన్నవించినట్లు తెలిసింది. సమ్మతిని లిఖితపూర్వకంగా కూడా అందజేసినట్లు సమాచారం. ఇదే క్రమంలో సదరు వసూల్ రాజా తన ప్రయత్నాలకు మరింత పదును పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
యూరియా కుంభకోణంలో సస్పెన్షన్
ఏడీఏ పీపీ పోస్టుపై కన్నేసిన సదరు అధికారి గతంలో యూరియా కుంభకోణంలో సస్పెండ్ అయ్యారు. ఆయన ఎక్కడ పనిచేసినా వివాదాస్పద అధికారిగా అపవాదును మూటగట్టుకున్నారు. పైకి చూసేందుకు సాఫ్ట్‌గా కనిపించినా ఆయన అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆయా డీలర్లపై అత్యంత కఠినంగా, దురుసుగా ప్రవర్తిస్తాడన్న ఆరోపణలు బలంగా విపిస్తున్నాయి. తాను అడిగినంత ఇవ్వని డీలర్లను చాంబర్‌కు పిలిపించుకుని, ఎలా షాపులు నడుపుకుంటారో చూస్తానంటూ ‘చిటికేసి’ మరీ బెదిరింపులకు దిగుతారన్న విమర్శలు బాధిత డీలర్ల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సదరు అధికారి పనిచేస్తున్న ప్రాంతంలోనూ డీలర్లతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. నెలవారీగా ఆయన చెప్పిన డబ్బు ఇవ్వకపోతే తనిఖీల పేరుతో హడలెత్తించి జేబులు నింపుకుంటారన్న విమర్శలు ఆ శాఖ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒక ప్రాంతంలో పనిచేస్తున్న ఆయన ఏకంగా జేడీఏ కార్యాలయంలోని కీలక పోస్టులోకి వస్తే అంతే సంగతులంటూ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఏడీఏ పీపీ పోస్టుకు ఎలాగైనా వచ్చేందుకు ప్రయత్నించినా గతంలో ఇక్కడ పనిచేసిన ఉన్నతాధికారి ఆయనకు అవకాశం ఇవ్వలేదని తెలిసింది. ప్రస్తుతం మరో ఉన్నతాధికారి పనిచేస్తుండటంతో ఎలాగైనా ఆయన్ను ఒప్పించి కీలక పోస్టులో తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు ఉన్నతాధికారి జిల్లాకు వచ్చినప్పటి నుంచి ముందస్తుగా టచ్‌లో ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏడీఏ పీపీ పోస్టు ఖాళీ అవుతుందని తెలుసుకుని, పలు రూపాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఆయనే వస్తే తమకు ఇబ్బందులు తప్పవంటూ ఎరువుల డీలర్లు నిట్టూరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కీలక పోస్టులో నిజాయతీ అధికారిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు ఆ శాఖ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. లేదంటే అవకాశం ఇచ్చిన వారికి చెడ్డపేరు వచ్చే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు వ్యవసాయ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.