నాణ్యమైన వేరుశనగ సేకరించండి

ABN , First Publish Date - 2021-03-14T06:05:56+05:30 IST

జిల్లాలో రబీ సీజన్‌లో పండించిన నాణ్యమైన వేరుశనగ కాయలు సేకరించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించారు.

నాణ్యమైన వేరుశనగ సేకరించండి
తలుపుల మండలంలో వేరుశనగ పంటను పరిశీలిస్తున్న కమిషనర్‌

3 లక్షల క్వింటాళ్లు తీసుకుని,  ఖరీఫ్‌లో పంపిణీ చేయండి

వ్యవసాయ శాఖ కమిషనర్‌  అరుణ్‌కుమార్‌ ఆదేశాలు 

క్షేత్రస్థాయిలో పరిశీలన

అనంతపురం వ్యవసాయం, మార్చి 13: జిల్లాలో రబీ సీజన్‌లో పండించిన నాణ్యమైన వేరుశనగ కాయలు సేకరించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత కదిరి మండలంలో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌, రైతుభరోసా కేంద్రాలను పరిశీలించారు. అక్కడి నుంచి తలుపుల మండలం గజ్జలప్పగారిపల్లికి చేరుకుని, సీడ్‌ విలేజ్‌ ద్వారా వేరుశనగ సేకరణను తనిఖీ చేశారు. ఆ తర్వాత బత్తలపల్లి మండలం సంజీవపురంలోని ఎన్‌ఎ్‌ఫఎ్‌సఎం క్లస్టర్‌ను పరిశీలించారు. సాయంత్రం స్థానిక జేడీఏ కార్యాలయంలో జేసీ నిశాంత్‌కుమార్‌, జేడీఏ రామకృష్ణతో కలిసి వ్యవసాయ అధికారులు, ఏపీ సీడ్స్‌, ఏజెన్సీలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది సీడ్‌ విలేజ్‌ పథకం ద్వారా 3 లక్షల క్వింటాళ్లు సేకరించాలన్నారు. స్థానికంగా నాణ్యమైన వేరుశనగ సేకరించి, వచ్చే ఖరీఫ్‌లో తిరిగి సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయాలన్నారు. ప్రస్తుతం క్వింటాల్‌ రూ.6100తో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వచ్చే నెలలో బహిరంగ మార్కెట్‌లో ధర మేరకు డబ్బు చెల్లించాలన్నారు. దళారులను నమ్మకుండా సీడ్‌ విలేజ్‌ ద్వారా ఏపీసీడ్స్‌ సంస్థకే వేరుశనగ విక్రయించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ అధికారులు, ఏజెన్సీలు సమన్వయంతో ముందుకు వెళితేనే ప్రభుత్వ లక్ష్యం నేరువేరుతుందన్నారు. సేకరించిన వేరుశనగను స్థానిక రైతు భరోసా కేం ద్రాల వద్దే నిల్వ చేసేందుకు గోదాములు ముందస్తుగా ఎంపిక చేసుకోవాలన్నారు. వేరుశనగ సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులను సంప్రదిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.

Updated Date - 2021-03-14T06:05:56+05:30 IST