అప్‌డేషన్‌, ఈకేవైసీ నిమిత్తం కేంద్రాలకు పోటెత్తుతున్న జనం

ABN , First Publish Date - 2021-08-20T06:23:32+05:30 IST

జిల్లా ప్రజల ఆధార్‌ అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

అప్‌డేషన్‌, ఈకేవైసీ నిమిత్తం కేంద్రాలకు పోటెత్తుతున్న జనం
ఆధార్‌ అనుసంధానం కోసం కుందుర్పి ఎంపీడీఓ కార్యాలయం వద్ద బుధవారం అర్ధరాత్రి పడిగాపులు కాస్తున్న చిన్నారులు

వర్ణనాతీతం..!

అప్‌డేషన్‌, ఈకేవైసీ నిమిత్తం కేంద్రాలకు పోటెత్తుతున్న జనం

సతాయిస్తున్న సర్వర్‌

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

దిక్కుతోచని స్థితిలో జిల్లా ప్రజలు 

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఆగస్టు 19: జిల్లా ప్రజల ఆధార్‌ అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఆధార్‌ సేవలందించే బ్యాంకులు, పోస్టాఫీసులు, మీసేవ కేంద్రాల్లో కొందరి నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఆధార్‌ తిప్పలు తప్పటం లేదు. ఏమైనా అంటే సర్వర్‌ సమస్య అంటూ తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం విద్యాసంస్థలు ప్రారంభం కావటంతో విద్యార్థులకు ఆధార్‌ అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. రేషన్‌ కార్డుదారులు నెలాఖరులోగా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పటంతో ఆధార్‌ అప్‌డేషన్‌ కోసం అంద రూ పల్లె, పట్టణం, నగరం అన్న తేడాలేకుండా ఆధార్‌కేంద్రాల బాట పడుతున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణలోపంతో ఆధార్‌ సమస్యలు పరిష్కారం కావటం లేదు.


న్యూ వర్షన్‌ అప్‌డేట్‌ చేయడంలో   పోస్టల్‌ అధికారుల నిర్లక్ష్యం...

జిల్లాలోని పలు పోస్టాఫీసుల్లో న్యూ వర్షన్‌ అప్‌డేట్‌ చేయకపోవడంతో నాలుగైదు రోజులుగా ఆధార్‌ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుత్తి, పామిడి తదితర ప్రాంతాల్లో ఈ సమస్య ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి సేవలను వినియోగించుకుంటున్నారు. కొత్త నెట్‌వర్క్‌, హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సదుపాయం ఉన్నప్పటికీ... సతాయించే ఇం టర్‌నెట్‌నే వాడుతూ వచ్చిపోయే వారికి సర్వర్‌ సమస్య ఉందని తిప్పిపంపుతున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో నెలల తరబడి ఆధార్‌ సేవలను చాపచుట్టేసిన పోస్టాఫీసులున్నాయంటే అతిశయోక్తి కాదు. జార్జిపేట పోస్టాఫీసులో ఆధార్‌ సేవలు అందించాల్సి ఉండగా... తగినంత సిబ్బంది లేకపోవడంతో రెండు నెలలుగా అక్కడ ఆధార్‌ సేవలను నిలిపివేశారు. కలెక్టరేట్‌లోని పోస్టాఫీసులోనూ అదే పరిస్థితి నెలకొంది. జేఎన్‌టీయూ, ఎస్కేయూ పోస్టాఫీసుల్లోనూ కొన్నింటికి మాత్రమే సేవలందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా పోస్టాఫీసు అధికారుల సూచనల మేరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయానికి వచ్చి సేవలను వినియోగించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఏయే పోస్టాఫీసుల్లో ఆధార్‌ సేవలు అందుతున్నాయి..? ఎక్కడా సమస్యలు తలెత్తుతున్నాయని పర్యవేక్షించాల్సిన పర్యవేక్షణాధికారులు ఆధార్‌ విభాగం మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ సమస్య తీవ్రమవుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి.


బ్యాంకుల్లో ఐడీ క్రియేట్‌.. లాగిన్‌ సమస్య...

జిల్లాలోని పలు బ్యాంకుల్లో ఆధార్‌ విభాగంలో సేవలం దించే సిబ్బంది ఐడీలతో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఆధార్‌ సిబ్బందిని అడ్జ్‌స్టమెంట్‌ పేరు తో షఫలింగ్‌ చేస్తున్నారు. దీంతో ఆధార్‌ యాప్‌లో ఆ సిబ్బంది ఐడీ క్రియేట్‌, లాగిన్‌ సమస్యలు ఏర్పడుతున్నట్లు సమాచారం. ఇక్కడా కొందరు బ్యాంకుల అధికారులు ఆధార్‌ సేవల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో సకాలంలో ప్రజలకు సేవలు అందడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐడీ క్రియేట్‌ చేసి లాగిన్‌ అయినా... సర్వర్‌ సమస్య తలెత్తుతుండటంతో లిమిటెడ్‌ 40-50 ఉన్నా... 20 వరకూ చేసి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇ క్కడ కూడా ఎన్నో బ్రాడ్‌బ్యాండ్‌, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ... ఆయా బ్యాంకుల యాజమాన్యాలు ఎందుకు వినియోగించుకోవడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు.ఈకేవైసీ తప్పనిసరితో రేషన్‌దారుల్లో టెన్షన్‌

రేషన్‌కార్డుకు కుటుంబసభ్యులందరి ఆధార్‌ కార్డులను అనుసంధానం చేయాలన్న నిబంధన ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఇది వరకూ కుటుంబ పెద్ద ఆధార్‌ను రేషన్‌ కార్డుకు అనుసంధానం చేసి బియ్యం, ఇతరత్రా సరుకులు పంపిణీ చేసేవారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా అందరివీ అనుసంధానం చేయాలని సూచించింది. అదికూడా కుటుంబపెద్దలైతే ఈ నెల 20 వరకూ గడువు విధించగా... పిల్లలకు సెప్టెంబరు చివర వరకూ సమయమిచ్చింది. దీంతో ప్రజలు కుటుంబసమేతంగా పనులు వదులుకొని మరీ ఆధార్‌ కేంద్రాల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లల ఆధార్‌ కార్డులను ఈకేవైసీ చేయించేందుకు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చె ప్పొచ్చు. అన్ని అడ్డంకులు తొలగించుకొని తీరా తమ టోకెన్‌ నెంబర్‌ వచ్చే సరికి కొన్ని సెంటర్లలో రోజుకు 50 మాత్రమే చేస్తున్నాం... మళ్లీ రావాలని తిప్పి పప్పుతుండటంతో తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. పలు మీ-సేవ, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సర్వర్‌ డౌన్‌, న్యూ వర్షన్‌ అప్‌డేట్‌ చేయకపోవడంతో సాంకేతికంగా సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆయా సెంటర్ల నిర్వాహకులు తా త్కాలికంగా ఆధార్‌ సేవలు నిలిపివేసినట్లు తెలుపుతున్నారు. దీంతో రేషన్‌దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో పాఠశాల, కళాశాలల్లో చేరే విద్యార్థులకు ఆధార్‌కార్డులో పేరు తప్పులు, పుట్టినతేదీ, బయోమెట్రిక్‌ సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ఆయా స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు కూడా ఆధార్‌ తప్పనిసరి చేయడంతో మార్పులు చేసుకునేందుకు తల్లిదం డ్రులతో విద్యార్థులు ఎక్కడ ఆధార్‌ సేవలు తొందరగా అయిపోతాయనుకుంటే అక్కడకు పరుగులు తీస్తున్నారు.యంత్రాల సమస్య చూపుతున్న వలంటీర్లు

బయోమెట్రిక్‌, ఈకేవైసీ తదితర సేవలందించాల్సిన కొందరు వలంటీర్లు తమవద్ద ఉన్న యంత్రాలు పనిచేయడం లేదనీ, ఫలానా మీ-సేవ వద్దకెళ్లండనీ, బ్యాంకులకు వెళ్లాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే జిల్లాలో 40 సచివాలయాల్లో ఆ ధార్‌ సేవలందిస్తున్నట్లు చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పనులు జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈకేవైసీ ఇంటింటికి వెళ్లి వలంటీర్లే నమోదు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా... కొంతమంది వలంటీర్లు ఈకేవైసీ అంటే తమకు సంబంధం లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
రెండు అక్షరాలను సరి చేసుకునేందుకు తాడిపత్రి వెళ్లా

నా కుమార్తె పాసుపోర్టుకు దరఖాస్తు చేశా. పాసుపోర్టు అధికారులు నాన్న పేరు ఆధార్‌లో ఒకలా... సర్టిఫికెట్లలో ఒకలా ఉందని సరిచేసుకొని రావాలని చెప్పారు. దీంతో అనంతపురంలోని మీసేవ, బ్యాంకుల వద్దకు తిరిగా. ఎక్కడకెళ్లినా సర్వర్‌ సమస్య, గెజిటెడ్‌ అధికారితో సంతకాలు ఉంటేనే చేస్తామని చెప్పారు. పోస్టాఫీసు వద్దకూ వెళ్లాను. అక్కడ ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేస్తేనే చేస్తామన్నారు. అవన్నీ నాకు తెలియక తాడిపత్రిలో తెలిసిన వాళ్లు ఉంటే... అక్కడికి వెళ్లి నా ఆధార్‌లో పేరును సరిచేసుకున్నా.

- త్రిలోక్‌నాథ్‌ రెడ్డి, అనంతపురంవేలిముద్రలు తీసుకోవడం

లేదన్నారు: చంద్రకళ, గృహిణి

రేషన్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయాలని చెప్పారు. మా ఇంటి వద్దకు వలంటీర్‌ అయితే వచ్చారు కానీ... వేలిముద్రలు వేసే సమయంలో సర్వర్‌ సమస్య అని చెప్పారు. మరొకరోజు వచ్చా రు.. అప్పుడు కూడా వేలిముద్రలు తీసుకున్నారు. మిషన్‌ పనిచేయడం లేదని చె ప్పారు. బ్యాంకు వద్దకెళ్తే... సర్వర్‌ సమస్య అని చెబుతున్నారు. పోస్టాఫీసుకెళ్తే ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని రమ్మంటున్నారు. సమయం చూస్తే ఈనెల 20వ తేదీ వరకూ అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

Updated Date - 2021-08-20T06:23:32+05:30 IST