ABN Inside : అజ్ఞాతం వీడనున్న కీలక నేత.. TDP నుంచి ఆహ్వానం అందిందా.. అదే జరిగితే AP రాజకీయాల్లో భారీ మార్పులు!

ABN , First Publish Date - 2021-08-23T18:21:35+05:30 IST

ఆయన పూజలు ఫలించాయా? అజ్ఞాతం వీడే సమయం ఆసన్నమైందా? ఆయన రాజకీయ జీవితంలో మళ్లీ వెలుగులు...

ABN Inside : అజ్ఞాతం వీడనున్న కీలక నేత.. TDP నుంచి ఆహ్వానం అందిందా.. అదే జరిగితే AP రాజకీయాల్లో భారీ మార్పులు!

ఆయన పూజలు ఫలించాయా? అజ్ఞాతం వీడే సమయం ఆసన్నమైందా? ఆయన రాజకీయ జీవితంలో మళ్లీ వెలుగులు విరజిమ్మే రోజులు రాబోతున్నాయా? ఏపీ రాజకీయాల్లో ఆయన గురించి అనంతమైన ప్రశ్నలు ఎందుకు ఉదయిస్తున్నాయి? అందరి చూపు ఆయనపైనే ఎందుకు పడుతోంది? ఆయన చక్రం తిప్పే రోజులు రాబోతున్నాయా? కంచు కంఠం సవరించుకునే సమయం దగ్గర పడిందా..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


రఘువీరా రాజకీయ అజ్ఞాతం వీడనున్నారా? 

రాజకీయాల్లో వెలుగువెలిగిన కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి అజ్ఞాతం వీడే సమయం ఆసన్నమైందని అనుకుంటోంది రాయలసీమ. మాజీ మంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రఘువీరా కాంగ్రెస్‌ ఓటమితో రాజకీయ వైరాగ్యంలోకి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి హోదా తప్ప ప్రజా ప్రతినిధిగాను, పార్టీ పదవుల్లోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించిన రఘువీరా కాలం కలిసిరాకపోవడంతో.. అనువుకానప్పడు అధికులమనరాదనే సూత్రాన్ని పాటించారు. ఇన్నాళ్లూ ఇంటి పట్టున వ్యవసాయం పనులు చేసుకుంటూ, దైవ కార్యం గుడి నిర్మాణం చేసుకుంటూ సైలెంట్‌గా ఉండిపోయారు. మట్టి మనిషిగా మారిపోయారు.




మలిదశ రాజకీయం కాంగ్రెస్‌లోనా.. మరో పార్టీలోనా!?

రఘువీరా రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పుతాడనే ఉహాగానాలు వస్తుండటంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ కలుగుతోంది. 1985లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తగా ప్రస్తానం ప్రారంభించిన రఘువీరా 1989లో మడకశిర నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గాల పునర్‌విభజనలో మడకశిర ఎస్సీ రిజర్వుడులోకి వెళ్లిపోవడంతో 2009లో కళ్యాణదుర్గం నుంచి ఎన్నికయ్యారు. మలిదశ రాజకీయ జీవితంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉంటారా? లేదంటే ఇతర పార్టీలోకి వస్తారా? ఎమ్మెల్యేగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారా? లేదంటే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఎంపీగా పోటీచేస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మొత్తానికి ఆయన రాజకీయాల్లో మళ్లీ బిజీ అవడం పక్కా అనుకుంటున్నారు ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు. ఆయన అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు అన్ని పార్టీలు ఎదురుచూస్తున్నాయి. రఘువీరా వేసే మలిదశ రాజకీయ అడుగుల వైపు పార్టీలు ఉత్కంఠగా వేచిచూస్తున్నాయి.


రెడ్డి కోటాలో కిరణ్‌కుమార్‌రెడ్డికి నాడు సీఎం పదవి!

రాజశేఖరరెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి రేసులో పేరు వినిపించిన యాదవ సామాజిక వర్గానికి చెందిన రఘువీరానును కాంగ్రెస్‌ హైకమాండ్ పక్కనబెట్టింది. రెడ్డి కోటాలో కిరణ్‌ కుమార్‌ రెడ్డికి పదవి అప్పజెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో అందరూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పినా విపత్కర పరిస్థితుల్లో పీసీసీ బాధ్యతలు మోశారు. అయితే పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయాలకు విరామం ప్రకటించిన రఘువీరారెడ్డి సొంత ఊర్లో చక్కగా వ్యవసాయం చేసుకుంటూ గడుపుతున్నారు. టీవీఎస్‌ ఫీఫ్టీపై సాధారణ రైతులా తిరుగుతున్నారు. ట్రాక్టర్‌ నడుపుతూ పొలం దున్నుతున్నారు. ఎన్నికల సమయంలో బాధ్యతగల పౌరుడిగా కుటుంబసమేతంగా వచ్చి చడీచప్పుడు కాకుండా ఓటేసి వెళ్లిపోతున్నారు. ఊరోళ్లతో కలిసి రచ్చబండపై పిచ్చాపాటి మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. అకుంఠిత ధీక్షతో గుడి నిర్మాణం పూర్తి చేశారు.


ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు!

ఏపీలో కాంగ్రెస్‌ పూర్వవైభవం కోసం సీనియర్‌ రఘువీరారెడ్డి సలహాలు, సూచనలు వినేందుకు ఆయన్నీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచిందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఢిల్లీ వెళ్తారా..? లేదా..? అనే ఉత్కంఠ అటు కాంగ్రెస్‌ పార్టీలోనే కాదు ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది. రఘువీరా మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారంటే ఇప్పటివరకు స్థబ్దుగా ఉన్న ఆయన వర్గం మళ్లీ ఉత్తేజం అయితే అనంతపురం జిల్లా రాజకీయాలే కాదు ఏపీ పాలిటిక్స్‌లో కూడా భారీ మార్పులు వస్తాయనే విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు అటు కాంగ్రెస్‌ పార్టీయే కాదు ఇతర పార్టీలు కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది.


సోనియా.. రాహుల్‌ను కలుస్తారా? లేదా? 

పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్న రఘువీరా రెడ్డికి కాంగ్రెస్‌ హైకమాండ్ నుంచి కబురు రావడంపై కొత్త చర్చ మొదలైంది. పోయిన చోటే వెతుక్కోవాలనే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో పటిష్టం అయ్యేందుకు పీసీసీలో మార్పు చేర్పులు చేయనుందనే చర్చ నడుస్తోంది. సరిగ్గా అదే టైమ్‌లో నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి గుడి నిర్మాణం పూర్తిచేయడం కూడా కలిసివచ్చింది. గుడి నిర్మాణం పూర్తయ్యేవరకు రఘువీరా రాజకీయాల గురించి ఆలోచించరనే మాటలు ఇన్నాళ్లు వినిపించాయి.


రఘువీరాకు టీడీపీ నుంచి ఆహ్వానం అందిందా..?  

అనంతపురం జిల్లాకు చెందిన కీలకనేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకరరెడ్డి  నీలకంఠాపురంలో రఘువీరారెడ్డిని కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యత కల్గిన అంశంగా చూస్తున్నారు సీమవాసులు. సీమ హక్కుల కోసం కలిసిపోరాటం చేసేందుకు రఘువీరాను జేసీ రెడ్డి కలిసినట్లు చర్చ మొదలైంది. రఘువీరా నిర్మించిన గుడి విశిష్టత, ఆయన పట్టుదల గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీర్తించారు. ఏది ఏమైనప్పటికి జేసీ ప్రభాకర్ రెడ్డి రఘువీరారెడ్డిల కలయిక అనంతపురంజిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో చర్చకు దారి తీస్తొంది. రఘువీరా రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించడానికే ప్రభాకర్ రెడ్డి వెళ్లారనే చర్చ కూడా జిల్లాలో జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చర్చించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొందరు రాజకీయ నేతలు కూడా ఆయన్ను కలుసుకునేందుకు చలో నీలకంఠాపురం అంటున్నారు.


రఘువీరా కొత్త ఖద్దరు చొక్కా కుట్టించుకుంటున్నారా?

మారుతున్న రాజకీయ సమీకరణాల్లో మళ్లీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో రఘువీరా పేరు మారుమోగిపోతోంది. నీలకంఠాపురం గ్రామంలో శివాలయ పునరుద్దరణను దిగ్విజయంగా పూర్తిచేశారు రఘువీరారెడ్డి. దాదాపు 1200 ఏళ్ల కిందటి చారిత్రక నీలకంఠేశ్వరుడి గుడి నిర్మాణం పూర్తయ్యేవరకు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు రఘువీరా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ నిర్మాణ పనులు చూసుకునేవారు. గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు రాజకీయాలకు విరామం ప్రకటించిన రఘువీరా ఇప్పుడు మళ్లీ ఖద్దరు చొక్కా వేసుకునే టైమ్‌ దగ్గరపడిందనే విశ్లేషణలు వస్తున్నాయి. దైవ కార్యం పనులు పూర్తయ్యేవరకు రఘువీరా ఆ ధ్యాస తప్ప మరో ఆలోచనలో లేరని ఇప్పుడు దేవుడి దయతో అన్ని పనులు పూర్తవడంతో ఇక రాజకీయాలపై దృష్టి పెట్టే పరిస్తితులు వస్తున్నాయని వరుసగా జరుగుతున్న సంఘటనలు గమనిస్తున్న సీమ జనాలు అనుకుంటున్నారు.

Updated Date - 2021-08-23T18:21:35+05:30 IST