ఉపాధి పనుల్లో పట్టభద్రులు
ABN , First Publish Date - 2020-05-24T09:49:26+05:30 IST
కరోనా ప్రభావంతో పట్ట భద్రులు కూడా కూలీలయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అనేక గ్రామాల్లో డిగ్రీ, పీజీ, బీటెక్, డీ.ఎడ్,

లాక్డౌన్లో గ్రామాలకు వచ్చిన యువకులు
ఉపాధి పనులతో డబ్బు సంపాదన
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్ : కరోనా ప్రభావంతో పట్ట భద్రులు కూడా కూలీలయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అనేక గ్రామాల్లో డిగ్రీ, పీజీ, బీటెక్, డీ.ఎడ్, పాలిటెక్నిక్ చేసిన యువతీ యువకులు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో డిగ్రీ, పీజీ, బీటెక్ చేసినవారు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవారు తమ సొంతూళ్లకు వచ్చేశారు. ఇక్కడ ఉపాధి లేకపోవడంతో చేసేది లేక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేరుతున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోనే సుమారు 200 మంది డిగ్రీలు పొందిన యువకులు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు.
యువకులంతా ఉపాధి హామీలో జాబ్‌కార్డులు పొంది పనుల్లో చేరుతున్నారు. మరోదారిలేని పరిస్థితుల్లో ఉపాధి పనులుచేస్తున్నామంటూ యువతీ, యువకులు చెబుతున్నారు. ఉపాధి పనుల్లో భాగంగా వ్యవసాయ పొలాల్లో వరద కాలువలు తీయడం, చెక్‌డ్యాంల్లో పూడిక తీత, చెరువు కుంటలు, ఫాంపండ్స్ తదితర పనులు చేస్తున్నామని ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకు పనిచేస్తే రోజుకు రూ. 200 నుంచి రూ.220 దాకా కూలి పడుతుందని.. ఈ డబ్బులతో కుటుంబాలకు ఆసరాగా నిలవడంతో పాటు తమ అవసరాలు తీర్చుకుంటున్నామని చెబుతున్నారు. కరోనా కాలంలో ఉపాధిహామీ పథకం తమకు ఎంతగానో అండగా నిలిచిందని చెబుతున్నారు. లాక్డౌన్ విధించిన రోజుల్లో ఉపాధి కూలిద్వారా వచ్చిన డబ్బులతో తమ చదువులను మరింత ముందుకు తీసుకెళ్తామని ఉన్నతవిద్యావంతులు అంటున్నారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం పుల్లేరుబోడు తండాకు చెందిన పరమేష్ బీ ఫార్మసీ చదివాడు. వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలిపనులు చేసి కొడుకును బీఫార్మసీ చదివించారు. హైదరాబాద్‌లోని ఓ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తూ నెలకు రూ.15వేల వేతనం తీసుకునేవాడు. కానీ, కరోనాతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో ఫార్మసీ కంపెనీ మూతపడటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. చేసేదిలేక
పరమేష్ స్వస్థలమైన పుల్లేరుబోడు తండాకు చేరుకున్నాడు. దీంతో ఉపాధి పనులకు వెళ్తున్నాడు. రోజూవచ్చే ఉపాధి కూలీతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇలా ఒక్క పరమేషే కాదు.. ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్య చదివిన అనేకమంది గ్రామాలకు చేరి ఉపాధి పనులతో కాలం గడుపుతున్నారు.
పోలీసుగా ఎంపికైనా
ఉస్మానియాలో పీజీ పూర్తి చేశాను. ఇటీవల కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. నియామకాలు జరిగే సమయంలోనే లాక్డౌన్ విధిచారు. దీంతో ఉపాధి పనులకు వెళ్తున్నాను.
- మహేష్సంతాపూర్
కాలేజీ తెరిస్తేనే..
కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తా.. రోజువారీ క్లాసులను బట్టే నెలసరి వేతనం. లాక్డౌన్ తో విద్యాసంస్థలు మూత బడ్డాయి. పనిలేకుండా పోయింది, దీంతో ఉపాధి పనులకు వెళ్తున్నా.
- పాండు జాపాల
‘ఉపాధి’కి వెళ్తున్నా..
నేను బీఎడ్ వరకు చదివా. ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తుందని ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నా. లాక్‌డౌన్‌తో ఉద్యోగం పోయింది. స్వగ్రామానికి వచ్చి ఉపాధి పనులకు వెళ్తున్నా.
-పకీరప్ప, ఎరన్‌పల్లి
ఆసరా కోసం..
లాక్‌డౌన్‌తో కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. ఇంటివద్ద ఊరికే కూర్చోవ డమెందుకని.. కుటుంబానికి సాయంగా ఉంటుందని ఉపాధి పనులకు వెళ్తున్నా. ఆ డబ్బులు ఖర్చులకైనా ఉపయోగ పడతాయి.
-మల్లేశ్వర్, మంబాపూర్