గజ..గజ..
ABN , First Publish Date - 2020-12-02T05:04:55+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

- ఉష్ణోగ్రతల్లో మార్పులు.. వణుకుతున్న జనం
- 17డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
- వాతావరణంలో మార్పుతో చుట్టుముడుతున్న వ్యాధులు
- వణికిస్తోన్న కరోనాకు తోడుగా స్వైన్‌ఫ్లూ, తదితర సీజనల్ వ్యాధులు
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : నివర్ తుఫాన్ ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వారంరోజులుగా ఉష్ణోగ్రతల్లో మార్పు రావడంతో జిల్లా ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఈ సంవత్సరం నవంబర్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా పొగమంచు కమ్మేస్తోంది. వారంరోజుల నుంచి తెల్లవారుజామున, సాయంత్ర వేళలో చలిగాలుల తీవ్రత ఎక్కు వగా ఉంటోంది. చలికి వృద్ధులు, పిల్లలు గజగజ వణుకుతున్నారు. కరోనావైరస్ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న జనానికి, చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల భయం పట్టుకుంది. చలికి ఉబ్బసం, జలుబు, తదితర వ్యాధులు ఉన్నవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. పదిహేనురోజుల క్రితం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.7డిగ్రీల వరకు ఉండేది. వారంరోజులుగా గణనీయంగా పడిపో యాయి. గురువారం నుంచి 17డిగ్రీల నుంచి 16డిగ్రీలకు చేరుకుంది. దీంతో మున్ముందు మరింత చలిపెరిగే అవకాశం ఉండటంతో జనం బయటకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. వాతావరణ మార్పులు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కాలంలో శరీరంలో తేమ శాతం తగ్గిపోవడంతో చర్మ రక్షణ శక్తి సన్నగిల్లి దురదలు వస్తాయి. చలికాలంలో ఎక్కువగా మహిళలు, వృద్ధులు, అస్తమా, న్యూమోనియా తదితర శ్వాసకోశ బాధితులు ఎక్కువగా ఇబ్బంది పడుతారని వైద్యులు వెల్లడిస్తున్నారు. చలికి తట్టుకోలేక వెచ్చదనం కోసం జనం దుప్పట్లు, స్వెట్టర్లను కొనుగోలు చేస్తున్నారు.
ఇది పరీక్ష కాలం
తేమశాతం తగ్గడం వల్ల మహిళల్లో హోర్మన్కు సంబంధించిన సమస్యలు ఉత్పన్న మవుతాయి. మధుమేహం, థైరాయిడ్ ఉన్నవారికి ఈకాలం ఇబ్బందే.. సునితంగా ఉండే అమ్మాయిల శరీరం త్వరగా పొడారిపోతుంది. ఈ కాలంలో వినియోగించే సబ్బులు, షాంపో, దుస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కళ్లు సున్నితంగా ఉండడం వల్ల అక్కడ త్వరగా శరీరం పొడిబారుతాయి. వంట పనులు చేసేవారు ఇం ట్లో పనులకు ముం దు, తరువాత శరీ రానికి వంట నూనె రాసుకోవాలి. ఆయిల్స్కిన్ వారు నాన్ ఆయిల్ మా యిశ్చ రైజర్‌ను వాడాలి. చేతులు, పాదాలు పగిలితే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పువేసి అం దులో ఉంచాలి. తరువాత శుభ్రంగా పొడిబట్టతో తుడిచి నాణ్యమైన క్రీముతో మర్దన చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి.
స్వైన్‌ఫ్లూ వ్యాధితో అప్రమత్తం
పల్లెల్లో, పట్టణాల్లో వాతావరణం చల్లబడటంతో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. మధుమేహం, రక్తహీనత, గుండెజబ్బులు, టీబీ, హెచ్ఐవీ, న్యుమోనియో, అస్తమా వంటి జబ్బులు ఉన్నవారిలో ఈ వైరస్ శక్తివంతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు, గర్భిణుల్లో వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. దీంతో వారు త్వరగా స్వైన్‌ఫ్లూ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని నగర శివారులోని మండలాల్లో ఉప్పల్, బాలానగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంది. చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చలిలో బయటకు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధికి గురైతే తప్పక మాస్కులు ధరించాలి. లేని పక్షంలో వేరే వారికి కూడా ప్రబలే అవకాశం ఉంది.
అస్తమా బాధితులకు కష్టకాలమే..
అస్తమా, న్యూమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి ఈ చలికాలం కష్టకాలమే. కాస్త చలి తగిలితే ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా వీరికి డస్ట్ ఎలర్జీ, స్మోకింగ్ ఎలర్జి, లంగ్ఎలర్జీ, స్కిన్ ఎలర్జి సమస్యలు ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతిఒక్కరూ అస్తమా బారిన పడతారు. చల్లటి ప్రదేశంలో తిరిగినా, చల్లటి ఆహారం తీసుకున్నా, ఏసీ గదుల్లో ఉన్నా.. అస్తమా సమస్య పెరుగుతుంది. ఈ కాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తే అస్తమా, న్యూమో నియా రోగులకు మరింత అసౌకర్యంగా ఉంటుందన్నారు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. క్రమేణా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతోంది. అదేవిధంగా స్వైన్‌ఫ్లూ వంటి వైరస్ ఈ కాలంలో మరింత విజృంభిస్తుంది. వైరస్ నియంత్రణకు ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.