డబుల్‌ గుబుల్‌

ABN , First Publish Date - 2020-09-21T06:38:59+05:30 IST

నయా పైసా ఖర్చు లేకుండా పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ

డబుల్‌ గుబుల్‌

స్థానికులకు 10శాతం వాటా దక్కేనా?

మేడ్చల్‌ జిల్లాలో జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణాలు 

పదిశాతం స్థానికులకు కేటాయిస్తామని ప్రకటించిన సర్కార్‌

ప్రభుత్వ ఉత్తర్వుల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): నయా పైసా ఖర్చు లేకుండా పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సోషల్‌ హైజ్‌ను డిగ్నిటీ హౌస్‌గా మారుస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.18వేల కోట్లతో ఇళ్ల నిర్మాణాలు చేప ట్టనున్నట్టు ప్రకటించింది. ఇళ్ల నిర్మాణానికి హైదరాబాద్‌ జిల్లాలో ఖాళీస్థలం లేకపోవడంతో నగరంలో నివాసం ఉంటున్న వారికోసం శివారుప్రాంతాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేడ్చల్‌ జిల్లాలో 36ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణలో 36,288 ఇళ్లను నిర్మిస్తుంది. వీటిలో మేడ్చల్‌ నియోజకవర్గంలోనే 20,516 ఇళ్లను నిర్మిస్తున్నారు. స్థానికులకు ఇళ్లు ఇవ్వకుండా నగరంలో ఉం టున్న వారికి ఈప్రాంతంలో ఇళ్లను ఎలా నిర్మిస్తారని ప్రజలు ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. దీంతో 2017 సంవత్సరంలో మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మునిసిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు జీహెచ్‌ఎంసీ వారి కోసం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లల్లో స్థానికులకు 10శాతం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


అయితే ఇప్పటివరకు స్థానికులకు 10శాతం ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. మేడ్చల్‌ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల నిర్మించిన ఇళ్లను పేదలకు లాటరీ ద్వారా ఎంపికచేసి ఇళ్లను కేటాయిస్తున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లను పూర్తిచేసి, పేదలకు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో స్థానికుల్లో తమకు కూడా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అందుతాయన్న ఆశతో ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో స్థానికులు తమకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు దక్కుతాయా? లేదా? అనేఆందోళన మొదలైంది.


మేడ్చల్‌ నియోజకవర్గంలోని కీసర మండలంలోని రాంపల్లిలో 6240 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, అదేవిధంగా అహ్మద్‌గూడలో 4428, బోగారంలో 1080, ఘట్‌కేసర్‌ మండంలోని కొర్రెములలో 800, ప్రతాపసింగారంలో 2208, శామీర్‌పేట్‌ మండలంలోని తూం కుంటలో 1656, మురహరిపల్లిలో 2484, జవహర్‌నగర్‌లో 2240 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు పలు దశల్లో ఉండగా, పలుచోట్ల పూర్తయ్యే దశలో ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 10శాతం ఇళ్లను కేటాయిస్తే స్థానికులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని మేడ్చల్‌ నియోజకవర్గం ప్రజలు వేచి చూస్తున్నారు. 


జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నగరవాసుల కోసం మేడ్చల్‌జిల్లాలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మునిసిపల్‌ శాఖ మంత్రి, కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 36,216 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 7,148 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మూడునెలల్లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈనేపథ్యంలో అధికారులు పనుల వేగవంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. 


గ్రామీణ ప్రాంతాల్లో 2350 ఇళ్లకు 554 పూర్తి

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 2350 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో కేవలం 554ఇళ్లు  మాత్రమే పూర్తయ్యాయి. మిగతా ఇళ్ల నిర్మాణం టెండర్ల దశలో ఉన్నాయి. పలు టెండర్లు పిలిచినప్పటికీ గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని తెలిసింది. జిల్లాలో ఇప్పటికే కీసర మండలంలోని యాద్గార్‌పల్లిలో 40 ఇళ్లు డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా కీసరలో 50, పీర్జాదీగూడలో 74, పర్వాతాపూర్‌లో 40, చెంగిచర్లలో 40, తుర్కపల్లిలో 40, కిష్టాపూర్‌లో 79, సోమారంలో 30, చీర్యాలలో 40, బోడుప్పల్‌లో 74, ఘట్‌కేసర్‌లో 50, కొర్రెములలో 40 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిని లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. 


Updated Date - 2020-09-21T06:38:59+05:30 IST