-
-
Home » Telangana » Rangareddy » Varikothalu
-
ముమ్మరంగా వరికోతలు
ABN , First Publish Date - 2020-11-21T05:30:00+05:30 IST
ముమ్మరంగా వరికోతలు

- కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వ్యవసాయ అధికారులు
కేశంపేట: కేశంపేట మండలంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రైతులు కొన్ని మెలకువలు పాటిస్తే నాణ్యమైన దిగుబడి చేతికందే అవకాశం ఉంది. ధాన్యాన్ని బాగా ఆరబెడితేనే ఎక్కువ రోజులు నిల్వచేసుకునే వీలుంటుంది. కోతలు ప్రారంభమైన నేపథ్యంలో వరి కోతల అనంతరం వ్యవసా యాధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తే నాణ్యమైన ఉత్పత్తిని సాధించుకోవ చ్చని మండల వ్యవసాయాధికారి శిరీష తెలిపారు.
పైరు పూర్తిగా ఎండిపోయే వరకు చూడొద్దు
- రైతులు సాగు చేసిన వరి పైరును పంట పొలంలో ఎండిపోయే వరకు వేచిచూడవద్దు. పొలంలో 80 నుంచి 90శాతం వరి కంకులు పసుపు రంగులోకి మారుతున్న సమయంలో పంటను కోయాలి. కర్రపచ్చి ఉన్నపుడు కోస్తే గడ్డి ఎక్కువ పొల్లు కాదు. ఈ దశలో వరి గింజల్లో 18-20శాతం తేమ ఉంటుంది. వరికోత అలస్యమైతే గింజ పగుళ్లు వచ్చి ధాన్యం నూక అయ్యే ఆస్కారం ఉంది. గింజల్లో తేమ శాతాన్ని తగ్గించడానికి 2 నుంచి 3 రోజులు వరి మెదను ఎండనివ్వాలి. వరి కోత మిషన్లతో(హార్వెస్టర్) కోతలు చేస్తే దుమ్ము, మట్టి పెడ్డలు ఎక్కువ వస్తాయి కాబట్టి వాటిని ధాన్యం నుంచి వేరుచేయాలి. రెండు వేర్వేరు రకాల ధాన్యాలను కలువకుండా చూసుకోవాలి. పంట కోత పూర్తయిన తరువాత ధాన్యాన్ని తూర్పారబట్టాలి. తాలును తొలగించుకోవాలి. ధాన్యం ఎంత నాణ్యంగా ఉంటే అంత బాగా ధర వస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యమైన ధాన్యాన్నే కొంటారు. బాగా ఎండపోస్తేనే ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
తేమ శాతం ఎక్కువ లేకుండా చూసుకోవాలి
ధాన్యాన్ని ఎక్కువ రోజులు ఎండబెట్టి తేమ శాత తక్కువ ఉండేలా చూసుకోవాలి. ధాన్యానికి పట్టే కీటకాలు రాకుండా పరిసరాల్లో పొగబెట్టాలి. శుభ్రమైన సంచుల్లో నిల్వ చేసుకోవాలి. ధాన్యం నిల్వచేసే ప్రదేశంలో తడి లేకుండా, సంచులకు రంధ్రాలు లేకుండా చూసుకోవాలలి
- - శిరీష, మండల వ్యవసాయ అధికారి