లాక్‌ ఓపెన్‌!

ABN , First Publish Date - 2020-05-08T06:06:50+05:30 IST

లాక్‌డౌన్‌ సడలించడంతో పల్లెల్లో బతుకు చప్పుడు షురువైంది. చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు

లాక్‌ ఓపెన్‌!

కరోనా లేని గ్రామాల్లో పరిశ్రమలు షురూ..

రెగ్యులర్‌ ఉద్యోగులు, స్థానిక కూలీలతో పనులు

తాండూరులో తెరుచుకున్న రెండు సిమెంట్‌ కర్మాగారాలు 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : లాక్‌డౌన్‌ సడలించడంతో పల్లెల్లో బతుకు చప్పుడు షురువైంది. చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు మొదలయ్యాయి. మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ కార్మికులు, కూలీలు పనికి వెళ్తున్నారు. కొన్నిచోట్ల కార్మికులు లేక పనులు ఇంకా స్టార్ట్‌ కాలేదు. వలసకూలీలు సొంతూళ్లకు పోవడంతో పనిచేసేవాళ్లు కరువయ్యారు. కొందరు వ్యాపారులు ఫ్యాక్టరీలు తెరిచినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో 16 రకాల ఫ్యాక్టరీల పనులు, వ్యాపారాలకు సర్కార్‌ అనుమతి ఇచ్చింది.


పనిచేసేచోట కార్మికులు మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా చూడాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టోన్‌, క్రషర్స్‌, ఇటుక బట్టీలు, సిరామిక్స్‌, టైల్స్‌, జిన్నింగ్‌ మిల్లులు, ఐరన్‌, స్టీల్‌, సిమెంట్‌, ప్లాస్టిక్‌, పేపర్‌, రబ్బరు ఇండస్ట్రీలు తెరుచుకున్నాయి. భవన నిర్మాణాలు, ఇసుక తరలింపు, మైనింగ్‌ పని కూడా మొదలైంది. 


జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ, మెగా తయారీకి సంబంధించి 3,450 పరిశ్రమలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఈ పరిశ్రమలన్నీ కుదేలయ్యాయి. కోట్లలో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పరిశ్రమల రంగానికి సడలింపు ఇవ్వడంతో ప్రస్తుతం 1,336 పరిశ్రమలు తెరుచుకున్నాయి. వలస కార్మికులంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో స్థానికంగా ఉన్న కూలీలతోపాటు రెగ్యులర్‌ ఉద్యోగులతో పరిశ్రమలను నడిపిస్తున్నారు. ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు 80 శాతం, మిగతా పరిశ్రమలు 40శాతం ఉత్పత్తితో కొనసాగుతున్నాయి. షాద్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో అత్యధికంగా స్పాంజ్‌, ఐరన్‌, కెమికల్‌, ఆయిల్‌ మిల్స్‌, ఇతర పరిశ్రమలు ప్రారంభించారు. అలాగే కాటేదాన్‌, షాద్‌నగర్‌, యాచారం, ఇబ్రహీంపట్నంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు తెరుచుకున్నాయి. కొత్తూరులో రెండు ఫార్మాకంపెనీలు, ఫరూక్‌నగర్‌, మంకాల్‌లో పాలప్యాకెట్ల తయారు కేంద్రాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలోని దాదాపు అన్ని పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా తెరుచుకున్న 1,336 పరిశ్రమల్లో 23,876 కార్మిక, ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు.


వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు ప్రాంతంలో మూడు సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండిట్లో సిమెంట్‌ ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. కొంతమంది కార్మికులతో సిమెంట్‌ కర్మాగారాలను నడిపిస్తున్నారు. కరన్‌కోట్‌లోని గవర్నమెంట్‌ సీసీఐ కొనసాగుతుంది, రోజుకు 4వేల టన్నుల సిమెంట్‌ తయారీ చేయాల్సి ఉండగా.. కూలీల కొరతతో 3 వేల టన్నుల సిమెంట్‌ను తయారీ చేస్తుంది. 330 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు.


అలాగే మల్కాపూర్‌ గ్రామంలోని ఇండియన్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో సాధారణంగా రోజుకు 5 వేల టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి జరిగేది. ప్రస్తుతం 2 వేల టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి జరుగుతుంది. 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అలాగే బల్కటూర్‌లో పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీ ఉంది. నిత్యం 5 వేల టన్నుల సిమెంట్‌ తయారీ జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ ఇంకా తెరుచుకోలేదు.


జిల్లాలోని పరిశ్రమల వివరాలు

తరహా యూనిట్లు తెరుచుకున్నవి

సూక్ష్మ 2,182 744

చిన్న 1,112 455

మధ్య 62 42

భారీ 103 88

మెగా-తయారు09 07

మొత్తం 3,450 1,336


Updated Date - 2020-05-08T06:06:50+05:30 IST