-
-
Home » Telangana » Rangareddy » Traffic regulations are strict
-
ట్రాఫిక్ నిబంధనలు కఠినం.. పార్కింగ్ సమస్య జఠిలం
ABN , First Publish Date - 2020-10-31T06:17:39+05:30 IST
షాద్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పార్కింగ్ సమస్య పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలను వేధిస్తోంది.

ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల కఠిన చర్యలు
పార్కింగ్ సమస్యను పట్టించుకోని వైనం
తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
ఆందోళనలో పట్టణ ప్రజలు, వాహనచోదకులు
షాద్‌నగర్: షాద్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పార్కింగ్ సమస్య పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలను వేధిస్తోంది. పట్టణంలో మూడేళ్ల క్రితం ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ ఏర్పాటు చేశారు. ఏడాది పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా కొనసాగింది. అనంతరం ట్రాఫిక్ ఎస్సైగా రఘుకుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో వాహన చోదకులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వస్తున్నారు. హెల్మెట్ ధరించకున్నా.. చౌరస్తాలో సిగ్నల్స్ దాటి వెళ్లినా.. సైడ్ మిర్రర్ లేకున్నా.. మద్యం సేవించి వాహనాలు నడిపినా.. విధిగా జరిమానాలు విధిస్తూ వస్తున్నారు. అయితే పట్టణంలోని నాలుగుదిక్కులా గల రోడ్ల పక్కన ఇష్టానుసారంగా వాహనాలు నిలుపుతున్నా.. కఠిన చర్యలు తీసుకోని కారణంగా ప్రజలు, వాహనచోదకులు నానా అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ స్టేషన్‌కు కేటాయించిన క్రేన్ వాహనంలో ఉండే పోలీస్ సిబ్బంది కేవలం మైక్ ద్వారా వాహనాలు తరలించాలని హెచ్చరిస్తున్నారే తప్పా.. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
దీంతో పట్టణంలోని మెయిన్‌రోడ్, పరిగి రోడ్డు, జడ్చర్ల రోడ్డు, హైదరాబాద్ రోడ్లలో ద్విచక్రవాహనాలతో పాటు పెద్ద వాహనాలు సైతం రోడ్లను ఆక్రమించుకుని పార్కింగ్ చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్, వివిధ బ్యాంకులు, పెద్ద హోటళ్లు, దుకాణ సముదాయాలు ఉండటంతో చౌరస్తా ప్రాంతా నికి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ప్రైవేట్ వాహనాలను రోడ్డును ఆక్రమించుకుని నిలపడం.. మరికొందరు చిరువ్యాపారులు రోడ్డుపైనే వ్యాపారాలు చేయడం మూలంగా తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. పరిగి రోడ్డుపై పలుమార్లు ప్రమాదాలు కూడా జరిగి ఎంతో మంది క్షతగాత్రులుగా మారారు. అలాగే హైదరాబాద్, జడ్చర్ల రోడ్లను ఆక్రమించుకుని ప్రతినిత్యం వందలాది ప్రైవేట్ ఆటోలు, జీపులను నిలుపుతారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించాలని పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు మున్సిపాలిటీ అధికారుల సహకారంతో పార్కింగ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలని పలువురు పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పార్కింగ్ సమస్య తీరలేదు..
షాద్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ఎం తో కృషి చేస్తున్నారు. కానీ పార్కింగ్ సమస్యను తీర్చ లేకపోయారు. గత కొన్నాళ్లుగా ఈసమస్య తీవ్రమైం ది. అడ్డదిడ్డంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్న కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించాలి.
- చెంది తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, షాద్‌నగర్