టమాట ధర ఢమాల్!
ABN , First Publish Date - 2020-02-08T12:14:33+05:30 IST
పరిగిమార్కెట్‌లో టమాట ధరలు పడిపోయాయి. దీంతో టమాట సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు లేకపోవడంతో చేలలోనే వదిలిపెట్టాల్సిన

పరిగి: పరిగిమార్కెట్‌లో టమాట ధరలు పడిపోయాయి. దీంతో టమాట సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు లేకపోవడంతో చేలలోనే వదిలిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్ప డ్డాయి. మార్కెట్‌లో కిలోటమాట రూ. 5లు పలుకుతుండగా కూలీల ఖర్చు కూడా వెళ్లని పరిస్థితి దాపురించింది. పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల తదితర మండలాల్లో బోరుబావుల కిందనీటి వసతి కలిగిన రైతులు రబీ పంటగా కూరగాయల సాగు చేపట్టారు. సుమారు 2వేల ఎకరాల్లో టమాట సాగు చేసినట్లు అంచనా వేస్తున్నారు.వాతావరణం అనుకూలించడంతో టమాట దిగుబడి బాగా పెరిగింది. అయితే మార్కెట్‌లో మాత్రం అందుకు తగిన ధర మాత్రం లేదు. పండించిన పంటను ఎలాగోల అమ్ముకోవాలన్న ఆలోచనతో రైతులు ఆయా మండల కేంద్రాల్లో జరిగే వారంతపు సంతల్లో నేరుగా కూరగాయలను విక్రయించుకుంటున్నారు. పరిగి పట్టణ కేంద్రంలో శుక్ర, శని రెండు రోజుల్లో జరిగే సంతకు వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తు న టమాట వస్తుండటంతో ధర మరింత పడిపోతోంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కనీసం రవాణ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇతర పంటలతో పోల్చుకుంటే టమాట రైతు పరిస్థితి భిన్నంగా మారింది. ఎకరా టమాట ఒక్కసారి తెంపడానికి 100కుపైగా బాక్సుల దిగుబడి వస్తుంది. ఎకరా పంట కోతకు ఐదుగురు కూలీలకు రూ.200ల చొప్పున రూ.1000, మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు ఒక్కొక్క బ్యాక్సుకు రూ. 10చొప్పున రూ.1000 కలిపి రూ.2000ల ఖర్చు అవుతుంది. తైబజారు రూ.50, కమీషన్ ఏజెంట్ ఖర్చులు పోను వట్టిచేతలతో ఇంటికి రావలసి వస్తుందని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో 20కిలోల బాక్స్‌కు రూ.40 నుంచి రూ.50లోపే పలుకుతున్నది. ఎకరా టమాట సాగుకు రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఇలా అయితే తమ పెట్టుబడి ఎలా తీరుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.