ఎవరిపై పక్షపాత ధోరణి లేదు : మున్సిపల్ కమిషనర్

ABN , First Publish Date - 2020-03-12T06:43:08+05:30 IST

మేడ్చల్‌ మునిసిపాలిటీ పరిధిలో తనకు ఎవరిపై కూడా పక్షపాత ధోరణి లేదని, కౌన్సిలర్లందరూ తనకు సమానమేనని మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో

ఎవరిపై పక్షపాత ధోరణి లేదు : మున్సిపల్ కమిషనర్

మేడ్చల్‌: మేడ్చల్‌ మునిసిపాలిటీ పరిధిలో తనకు ఎవరిపై కూడా పక్షపాత ధోరణి లేదని, కౌన్సిలర్లందరూ తనకు సమానమేనని మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో సమస్యలకు ప్రాధ్యానమిస్తూ సమస్య తీవ్రతను బట్టి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి అన్నారు. మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలోని 18వ వార్డు కౌన్సిలర్‌ కాలనీవాసులతో కలిసి మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన విషయం విదితమే. దీంతో బుధవారం ఉదయం కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి 18వ వార్డులో పర్యటించి నీటి సరఫరాను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ 18వ వార్డులో నీటి సరఫరా సజావుగా జరుగుతోందని పేర్కొన్నారు. కొంత మంది మోటార్లు ఉపయోగిస్తుండటంతో మున్సిపల్‌ సిబ్బంది అడ్డుకుంటున్నారని వివరించారు. ప్రజలు మోటార్లు వినియోగించకూడదని గతంలోనే తాము మున్సిపల్‌ వాసులకు తెలియజేసినా కొందరు మళ్లీ మోటార్లు వినియోగిస్తుండటంతో కాలనీలో కొన్ని ఇళ్లకు నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదన్నారు. బుధవారం కూడా పలు ఇళ్ల వద్ద నుంచి మున్సిపల్‌ సిబ్బంది మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.


మున్సిపల్‌ నీటికి మోటార్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి హెచ్చరించారు. మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కొంత మంది కౌన్సిలర్‌కే ప్రాధాన్యం ఇస్తున్నామనే విష యంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. మేడ్చల్‌ మున్సిపల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కౌన్సిలర్లు సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్‌ కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది రాంచందర్‌, నాయకులు మర్రి నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T06:43:08+05:30 IST