ఎవరు చంపారు?

ABN , First Publish Date - 2020-06-21T09:58:29+05:30 IST

మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన అమీర్‌పేట సత్తయ్యను హతమార్చిన నిందితుల కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు

ఎవరు చంపారు?

సత్తయ్యను హతమార్చిన వారి కోసం గాలింపు ముమ్మరం 

పోలీసుల అదుపులో హత్యకు వాడిన వాహనం

15ఏళ్లుగా సత్తయ్యతో కలిసి రమేష్‌ రియల్‌ దందా


యాచారం: మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన అమీర్‌పేట సత్తయ్యను హతమార్చిన నిందితుల కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన రమే్‌షతో పాటు ఇంకా ఎంతమంది హత్యలో పాల్గొన్నారు అనే అంశాలపై పోలీసులు  ఆరా తీస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ వి.యాదగిరిరెడ్డి పర్యవేక్షణలో పోలీసు బృందాలు హంతకుల ఆచూకీని తెలుసుకుంటున్నారు.  అదేవిధంగా హంతకులు వినియోగించిన ఓ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సత్తయ్యతో ఎగ్గిడి రమేష్‌  15ఏళ్లుగా రియల్‌ దందా చేస్తున్నాడని హతుడి కుటుంబీకులు తెలిపారు. కందుకూరు మండల కేంద్రానికి చెందిన రమేష్‌ అత్తవారిల్లు చౌదర్‌పల్లిలో సత్తయ్య ఇంటి పక్కనే ఉండటంతో తరచూ వస్తుండటంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపారు. 


 సత్తయ్య అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టగా వచ్చిన లాభాల్లో ఇరువురు సమానంగా తీసుకొని అన్యోన్యంగా ఉన్నట్లు గ్రామస్థులు, సత్తయ్య బంధువులు తెలిపారు. ఈనెల 18న రాత్రి కూడా రమేష్‌ నుంచి ఫోన్‌ రావడంతో యథావిధిగా వెళ్లాడాని తెలిపారు. కోట్లలో లావాదేవీలు ఉండటంతో సత్తయ్యకు భారీగా డబ్బు ఇవ్వాల్సి వస్తుందని హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసినట్లు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 


నిలిచిన అంత్యక్రియలు 

సత్తయ్య మృతదేహానికి గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబీకులకు అప్పగించారు. కాగా, తమకు న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని హతుడి బంధువులు ఇంటి వద్ద బైఠాయించారు. దీంతో చౌదర్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Updated Date - 2020-06-21T09:58:29+05:30 IST