బయటకు వస్తే చర్యలే..

ABN , First Publish Date - 2020-04-15T10:05:07+05:30 IST

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ (జనతాబంద్‌) అమలు చేయబోతున్నారు.

బయటకు వస్తే చర్యలే..

వికారాబాద్‌లో సకలం బంద్‌ 

వారం రోజులపాటు కొనసాగనున్న ఆంక్షలు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ (జనతాబంద్‌) అమలు చేయబోతున్నారు. ఇళ్ల నుంచి ఎవరు బయటకు వచ్చినా చర్యలు తీసుకోనున్నారు. జిల్లా కేంద్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడం ఒక్కటే శరణ్యమని గుర్తించిన జిల్లా యంత్రాంగం సకలంబంద్‌ చేసేం దుకు చర్యలు చేపట్టింది.


వికారాబాద్‌లో కరోనా కేసులు పెరగడంపై ఆరా తీసిన సీఎం కేసీఆర్‌, సీ ఎంవో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. లాక్‌డౌన్‌పై కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బుధవారం నుంచి వారంరోజుల పాటు ఎవరూ బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు. కిరాణా, కూరగాయలు, మాంసం దుకాణాలు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేయనున్నారు. ఆరోగ్యపరమైన అత్యవసర సేవల కోసం తప్ప మిగతా వారినెవరినీ రోడ్లపైకి అనుమతించరు. వికారాబాద్‌ పట్టణంలో 34 వార్డుల్లో 9 వార్డులను ఇప్పటికే కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ జోన్లుగా ప్రకటించారు. 


ఇళ్ల వద్దకే సరుకులు, కూరగాయలు

లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలు నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయల కోసం ఇబ్బందులు పడకుండా జిల్లా పాలనా యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. మంగళవారం కలెక్టరేట్‌లో మునిసిపల్‌ కౌన్సిలర్లతో సమావేశమైన జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు ప్రజలకు అందజేసే సేవలపై చర్చించారు. లాక్‌డౌన్‌ సమయంలో సరుకులు, కూరగాయలు, పాలు, మందులను వాహనాల ద్వారా ఇళ్ల వద్దకు చేర్చేలా ఏర్పాట్లు చేయాలని ఆమె కౌన్సిలర్లను కోరారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నెంబర్లకు కాల్‌ చేస్తే సరుకులు అందజేస్తారని చెప్పారు.


మరో 5 పాజిటివ్‌ కేసులు...

జిల్లా కేంద్రంలో మంగళవారం కొత్తగా అయిదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రిక్షా కాలనీలో ఉన్న ఢిల్లీ నుంచి వచ్చిన జమాత్‌ బృందంలో కొత్తగా మరో నలుగురికి సంక్రమించగా, వారికి సహాయంగా ఉన్న స్థానికుడైన మరోవ్యక్తికి కూడా కరోనా సోకింది. అనంతగిరి హరిత రిసార్ట్స్‌ క్వారంటైన్‌లో ఉన్నవారిలో పాజిటివ్‌గా గుర్తించిన అందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు.


కొత్తగా నమోదైన ఈ అయిదు కేసులతో జిల్లా కేంద్రంలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 23కు పెరిగింది. తాండూరులో మూడు, పరిగిలో రెండు, మర్పల్లిలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 30 నమోదవగా, వాటిలో 29 యాక్టివ్‌ కేసులు కాగా, ఒకరు మృతి చెందాడు. కొత్తగా వికారాబాద్‌లో 29, తాండూరులో 14 నమూనాలను వైద్య పరీక్షల కోసం పంపించారు. 


Updated Date - 2020-04-15T10:05:07+05:30 IST