సాగు చేయాలా.. వద్దా?

ABN , First Publish Date - 2020-05-09T09:34:48+05:30 IST

నగరానికి చేరువలో ఉండటంతో మేడ్చల్‌జిల్లా రైతులు ఉద్యానవన పంటలను సాగు చేసేందుకు ఆసక్తి

సాగు చేయాలా.. వద్దా?

సందిగ్ధంలో కూరగాయల రైతులు

కరోనా కారణంగా మార్కెట్‌లో గిట్టని గిట్టుబాటు 

కూలీల ఖర్చు కూడా వెళ్లని వైనం

వేసవి సాగుపై తీవ్ర ప్రభావం


 (ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : నగరానికి చేరువలో ఉండటంతో మేడ్చల్‌జిల్లా రైతులు ఉద్యానవన పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఈ ప్రాంతంలో పండించిన కూరగాయలు, పండ్లను నగ రంలోని రైతుబజార్లకు తరలిస్తారు. జిల్లాలో కూరగాయ లతోపాటు ఆకుకూరలు, ద్రాక్ష, నారింజ, జామ, మామిడి, దానిమ్మ, తదితర పంటలను సాగు చేస్తారు. కరోనా వైరస్‌ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో పంటల దిగుబడులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతులు పండించిన బెండ, దొండ, వంకాయ, తదితర కూరగాయలను మార్కెట్‌లో రూ.2 నుంచి రూ.4కు కొనుగోలు చేస్తున్నారు.


బయట వినియోగదారులకు మాత్రం కిలోకు రూ.30నుంచి రూ. 40కు విక్రయిస్తున్నారు. పండ్ల ధరలు కూడా పడిపో యాయి. దీంతో ఈ సీజన్‌లో ఉద్యానవన రైతులు దాదా పుగా రూ.35కోట్ల మేర నష్టపోయారు. సాధారణంగా వేస విలో సాగుచేసే పంటలు జూన్‌, జులైలో కోతకు వస్తాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టాలపాలైన రైతులు వేసవిలో సాగు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. మేడ్చల్‌జిల్లాలో మొత్తం కూరగాయల పంటల సాగు 2,432 ఎకరాల్లో ఉంటుంది. శామీర్‌పేట్‌ మండ లంలో 374.80ఎకరాలు, మూడుచింతలపల్లిలో 903.60, మేడ్చల్‌లో 475.20, కీసరలో 461.20, ఘట్‌కేసర్‌లో 102. 40, ఉప్పల్‌లో 9.60, దుండిగల్‌ గండిమైసమ్మలో 32.40, కాప్రాలో నాలుగు ఎకరాలు, మేడిపల్లిలో 18.80, అల్వా ల్‌లో 42ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల పంటలను సాగు చేస్తారు. కూలీలతో కూరగాయల తోటలు నిత్యం కళకళలాడేవి. కరోనా వైరస్‌ ప్రభావంతో నేడు వెలవెల బోతున్నాయి. పలుచోట్ల ఇతర ప్రాంతాలకు చెందిన వారు స్థానిక రైతుల వద్ద భూమిని కౌలుకు తీసుకుని కూరగా యలను పండిస్తారు. వారు గత్యంతరం లేక వేసవిలో సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చాలామంది రైతులు సాగుకోసం పొలాలను సిద్ధంగా ఉంచుకున్నారు. పంటను వేయాలా.. వద్దా.. అనే ఆలోచనలో పడిపో యారు.


ఒక్కో ఎకరం సాగుచేయా లంటే కనీసం రూ.30 నుంచి రూ.50వేల వరకు ఖర్చు వస్తుంది. ఎరువుల తోపాటు అన్నింటి ధరలు పెరిగి పోయాయి. గిట్టుబాటు ధరలు లేనిపక్షంలో రైతులకు కూలీల డబ్బు కూడా రాని పరిస్థితి నెలకొంది. సాగుచేసిన పంటలకే దిక్కులేదు. ఇక కొత్త పంటల సాగుచేస్తే పరిస్థితి ఏమిటి అని రైతులు వాపోతున్నారు. గతంలో ఉత్సాహంగా సాగుచేసిన రైతులు.. ప్రస్తుతం ధరలు లేక వంకాయ, టమాట, తదితర పంటలను దున్నేస్తున్నారు.


అకాల వర్షాలకు కూరగాయల పంటలు నేలరాలడంతో రైతులకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది.  ఆరుగాలం శ్రమించి పెట్టుబడి పెట్టి, తోటను ఎంతో సంరక్షణ చూసుకుంటే.. సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో వర్షానికి పంట ఆగమ వుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో రైతులు ఏ మేరకు కూరగాయల పంటలను సాగు చేస్తారో వేచి చూడాల్సిందే. 

Updated Date - 2020-05-09T09:34:48+05:30 IST