అన్నదాత ఆనందం

ABN , First Publish Date - 2020-05-09T09:33:29+05:30 IST

రుణ మాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. రూ.25 వేల కంటే ఎక్కువ ఉండి లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను నాలుగు

అన్నదాత ఆనందం

ప్రారంభమైన రుణమాఫీ ప్రక్రియ 

రూ.25 వేల లోపు ఒకే విడతలో.. 

రూ.లక్ష లోపు ఉన్నవారికి నాలుగు విడతల్లో రద్దు


రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణమాఫీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అన్నదాత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అసలే కరోనా కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో రుణమాఫీ డబ్బు రైతులకు అందజేస్తే వానాకాలం పంట పెట్టుబడులకు ఖర్చు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. త్వరలోనే డబ్బు జమ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : రుణ మాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. రూ.25 వేల కంటే ఎక్కువ ఉండి లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, రూ.25 వేల లోపు రుణం తీసుకున్న రైతులందరికీ ఒకే విడతలో రుణమాఫీ వర్తింపజేయనున్నారు. రుణం తీసుకున్న రైతుల ఖాతాల్లో మాఫీకి సంబంధించిన డబ్బులు జమ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 


జిల్లాలో రూ.25 వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణ మాఫీ డబ్బు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో 2,21,174 మంది రైతులు ఉండగా, వారిలో 80 శాతం పైగానే రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. జిల్లాలో లక్ష రూపాయలలోపు రుణాలు 38 వేల మంది రైతులు రూ.300 కోట్ల వరకు తీసుకున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని మొదటగా రూ.25 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు వర్తింపజేయాలని నిర్ణయించింది. జిల్లాలో రూ.25 వేల లోపు రుణాలను 19,332 మంది తీసుకోగా, వారికి రుణమాఫీ వర్తింపజేసేందుకు రూ.42.43 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.


కరోనా కష్టకాలంలో రుణమాఫీ డబ్బు రైతులకు అందజేస్తే.. వానాకాలం పంట పెట్టుబడులకు ఖర్చు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావించింది. అందుకోసం ప్రభుత్వం రూ.25 వేల లోపు రుణాలు తీసుకున్న వారికి సంబంఽధించిన రుణమాఫీ డబ్బులను విడుదల చేసింది. రుణమాఫీపై గురువారం హైదరాబాద్‌లో మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి అధికారులతో సమావేశమై చర్చించారు. రూ.25 వేలకు ఎక్కువ, లక్ష రూపాయలలోపు రుణాలు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణమాఫీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. 


ఒక కుటుంబం ఒక యూనిట్‌...

 రైతు, ఆయన భార్య, ఆధారపడిన మైనర్‌ పిల్లలను ఓ కుటుంబంగా లెక్కించి యూనిట్‌గా పరిగణించనున్నారు. రుణమాఫీ మార్గదర్శకాల మేరకు ఒక యూనిట్‌కు లక్ష రూపాయల రుణమాఫీ చేయనున్నారు. బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు కూడా ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించనుంది.


వాణిజ్య, సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇదివరకే అధికారులు సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతులను ఎంపిక చేసి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి పంపించారు. రూ.25 వేలలోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో త్వరలో రుణమాఫీ డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  


Updated Date - 2020-05-09T09:33:29+05:30 IST