ఇంటి నిర్మాణం గగనమే!
ABN , First Publish Date - 2020-05-02T05:30:00+05:30 IST
కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలు నిలిచిపోయాయి. చాలావరకు ఇళ్ల నిర్మాణాలు వాయిదా
భగ్గుమంటున్న సిమెంట్, ఇటుక, ఇసుక, స్టీల్ ధరలు
ఇల్లు కట్టాలంటేనే బెంబేలెత్తుతున్న సామాన్యులు
కొరత సాకుతో అడ్డగోలుగా దోపిడీ
లాక్‌డౌన్‌తో డీలర్లు, వ్యాపారుల మాయాజాలం
కరోనా మహమ్మారి పేదోడి ఇంటి కలను చెదరగొడుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇంటి నిర్మాణ ముడిసరుకుల ధరలను అమాంతం పెంచేశారు. సిమెంట్, ఇటుక, ఇసుక, స్టీల్ కృత్రిమ కొరత సృష్టిస్తూ డీలర్లు, వ్యాపారులు రహస్యంగా విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. పెరిగిన ధరలతో సగంలో ఉన్న నిర్మాణాలను కొనసాగించడానికి సామాన్యులు భయపడుతున్నారు. అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలు నిలిచిపోయాయి. చాలావరకు ఇళ్ల నిర్మాణాలు వాయిదా పడ్డాయి. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకున్న పేదోడికి లాక్‌డౌన్ అడ్డుపడింది. ముడిసరుకు ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. లాక్‌డౌన్ సాకు చూపిస్తూ డీలర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ముడి సరుకులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం సిమెంట్ ధర దడ పుట్టిస్తుండగా, ఇటుక ధర బరువెక్కింది. ఇసుక అంటేనే ఇప్పుడు బంగారమైపోయింది. స్టీల్ ధరలకు తోడు ఇతర ధరలు కూడా పెరగడంతో ఇల్లు కట్టాలంటేనే మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. ధరలపై అధికారుల నియంత్రణ కొరవడటంతో ప్రజలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది.
‘సి’మంట
లాక్‌డౌన్ అమలులో భాగంగా నిత్యావసరాలకు మినహా మిగిలిన వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు, షాపులకు కూడా మినహాయింపు ఇవ్వలేదు. సరఫరా లేదనే సాకు చూపుతూ డీలర్లు, వ్యాపారులు రోజురోజుకూ సిమెంట్ ధరలను పెంచి రహస్యంగా విక్రయిస్తున్నారు. సిమెంట్ ధర కంపెనీ బట్టి లాక్‌డౌన్‌కు ముందు రూ.280 నుంచి 350 వరకు ఉండగా లాక్‌డౌన్ తర్వాత ఉన్న స్టాకును గుట్టుగా బస్తా రూ.380 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. సిమెంట్ ధరలు అధిక ధరకు అమ్ముతుండగా జిల్లా విజిలెన్స్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
బరువైన ఇటుక
గృహ నిర్మాణానికి ఉపయోగపడే ఇటుక ధర రెట్టింపు అయ్యింది. మారుతున్న కాలానికి అనుగుణంగా రెండు, మూడు అంతస్థులు నిర్మిస్తుండటంతో లైట్‌వెయుట్ ఇటుకను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. లైట్ వెయిట్ ఇటుక ఒకటి లాక్‌డౌన్‌కు ముందు రూ.5.40 ఉంటే ప్రస్తుతం రూ.7.80కి విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల రూ.8 కూడా అమ్ముతున్నారు. సాధారణ ఇటుక ఒకటి లాక్‌డౌన్‌కు ముందు రూ.4 ఉండగా ఇప్పుడు రూ.5కి విక్రయిస్తున్నారు.
పెరిగిన స్టీల్ ధర
ఇల్లు కట్టాలంటే స్టీల్ తప్పనిసరి. అలాంటి స్టీల్ ధరను కూడా వ్యాపారులు పెంచేశారు. మొన్నటి వరకు క్వింటాల్ స్టీల్ ధర రూ. 4,300 ఉండగా, ప్రస్తుతం రూ.4,800 నుంచి 5,400 వేల వరకు విక్రయిస్తున్నారు. దీంతో అప్పు చేసి ఇల్లు కట్టుకునే చిరుద్యోగులకు స్టీల్ ధర భారంగా మారింది.
బంగారమైన ఇసుక
ఇసుక ధర రోజురోజుకూ బంగారం కంటే ఎక్కువగా పెరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్మాణాలకు సరిపడా ఇసుక దొరకడం లేదు. లాక్‌డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఇసుక సరఫరా నిలిచిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు క్వాలిటీని బట్టి ఇసుక టన్ను ధర రూ. 2,200 నుంచి రూ.2,500 విక్రయించగా.. ప్రస్తుతం రూ.3,000 నుంచి రూ.3,500 వరకు అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు ఇసుక అంటేనే వామ్మో అంటున్నారు.
భవన నిర్మాణ ముడి సరుకుల ధరల వివరాలు
సిమెంట్ (బస్తాకు) లాక్‌డౌన్ ముందు ధర
రూ.280-350
ప్రస్తుత ధర
రూ. 380-450
స్టీల్ (క్వింటాలుకు)
లాక్‌డౌన్ ముందు ధర
రూ.3,800-4,300
ప్రస్తుత ధర
రూ. 4,800-5,400
ఇసుక (టన్నుకు)
లాక్‌డౌన్ ముందు ధర
రూ.2,200-2,500
ప్రస్తుత ధర
రూ.3,000-3,500
ఇటుక
(లైట్‌వెయిట్)
లాక్‌డౌన్ ముందు ధర
రూ.5.40(ఒకటి)
ప్రస్తుత ధర
రూ.7.80
ఇటుక
(మామూలు)
లాక్‌డౌన్ ముందు ధర
రూ.4(ఒకటి)
ప్రస్తుత ధర
రూ.5
ధరలు పెరగకుండా చూడాలి
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటి నిర్మాణ సామగ్రి సిమెంట్, స్టీల్, ఇసుక, ఇటుక ధరలను అమాం తం పెంచేశారు. ప్రభుత్వం స్పం దించి ధరలను నియంత్రించాలి. లాక్‌డౌన్‌కు ముందు ఉన్న ధరలు ప్రస్తుతం లేవు. అదేమంటే మెటీరియల్ రావడం లేదు. ఫ్యాక్టరీల వద్దే ధరలు పెంచారని వ్యాపారులు సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటున్నాం. పెరిగిన ధరలతో ఇకపై నిర్మాణం కొనసాగించడం కష్టంగా మారింది
- బురాన్ మల్లయ్య, చేవెళ్ల
పెరిగిన ధరలతో మరింత భారం
లాక్‌డౌన్ సాకు చూపుతూ ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు డబుల్ పెంచుతున్నారు. దీంతో చాలావరకు నిర్మాణాలు ఆగి పోయాయి. సిమెంట్ బస్తా ధర వందకు పైగా పెంచారు. ధరలు పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే పేదలు ఇల్లు కట్టుకోవడం కష్టం అవుతుంది.
- ఎండి రుక్మద్దీన్, బొబ్బిలిగామా