-
-
Home » Telangana » Rangareddy » The medical team who did not visit the village
-
భయం..భయం
ABN , First Publish Date - 2020-06-22T10:23:38+05:30 IST
కరోనా సోకి మహిళ మృతి చెందడంతో మండలంలోని పర్వత్‌పల్లి గ్రామంలో టెన్షన్ నెలకొంది.

పర్వత్‌పల్లిలో మహిళ మృతితో ప్రజల్లో టెన్షన్
గ్రామాన్ని సందర్శించని వైద్య బృందం
థర్మల్ స్ర్కీనింగ్, వైద్య పరీక్షలు చేయడం లేదని ఆందోళన
బషీరాబాద్ : కరోనా సోకి మహిళ మృతి చెందడంతో మండలంలోని పర్వత్‌పల్లి గ్రామంలో టెన్షన్ నెలకొంది. మహిళ మృతి చెంది మూడు రోజులు గడుస్తున్నా అధికారులు కాంటాక్ట్ కేసులను గుర్తించపోవడం, హోంక్వారంటైన్, వైద్య పరీక్షలు చేయలేదు. దీంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు. తహసీల్దార్ షౌఖత్‌అలీ, రెవెన్యూ బృందం, తాండూరు రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్‌ఐ కె.గిరి గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకుని వెళ్లారు. కానీ ఇంతవరకు ఏఎన్‌ఏం తప్ప, వైద్యాధికారుల బృందం థర్మల్ స్ర్కీనింగ్, ఇతర పరీక్షలు చేయలేదు. గ్రామంలో 7 కుటుంబాల్లోని 40 మందిని గృహ నిర్భందంలో ఉండాలని సూచించారు. అయితే వారికి వైద్య పరీక్షలు చేయకపోవడంతో మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతారంలో 34 మంది హోంక్వారంటైన్
తాండూరు రూరల్ : తాండూరు మండల పరిధిలోని అంతారం గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన మహిళను అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ చిన్నప్పలనాయుడు ఆధ్వర్యంలో జినుగుర్తి ప్రాథమిక వైద్యాధికారి అపూర్వారెడ్డి, ఎస్‌ఐ ఏడుకొండలు గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. అయితే ఆ మహిళకు పాజిటివ్ ఎలా వచ్చింది.. ఆమె ద్వారా మరొవరికైనా వైరస్ సోకిందా అనే దానిపై వివరాలు సేకరించారు. 14 మంది కుటుంబ సభ్యులతోపాటు మరో 14మందిని కలిసినట్లు గుర్తించి వారిని హోంక్వారంటైన్‌లో ఉంచారు. గ్రామంలో మహిళ ఇంటి చుట్టూ 30 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల ఎవరూ రావద్దని ఎస్‌ఐ ఏడుకొండలు అక్కడున్న వారికి తెలిపారు. విచారణ జరిపిన వారిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజీవ్‌రెడ్డి, వీఆర్వో సందీప్, సర్పంచ్ ఎత్తరి రాములు, హెల్త్ అసిస్టెంట్ వెంకటేష్, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, పోలీసులు ఉన్నారు.