రైతుకు నష్టం రూ.360.06 కోట్లల్లో నష్టం

ABN , First Publish Date - 2020-10-28T10:07:57+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో ఈసారి కురిసిన వర్షాలకు చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌, చౌదరిగూడెం, నందిగామ, ఇబ్రహీంపట్నం, ఫరూక్‌నగర్‌, కొందుర్గు, కందుకూరు మహేశ్వరం, అమనగల్లు, మాడ్గుల మండలాల్లో పంటలు అధికంగా

రైతుకు నష్టం రూ.360.06 కోట్లల్లో నష్టం

వానాకాలం పంటలు వర్షార్పణం భారీ వర్షాలకు నీట మునిగిన లక్షల ఎకరాల వరి, పత్తి, కంది

ప్రధాన పంటలు దెబ్బతినడంతో నష్టం అపారం  విలవిల్లాడుతున్న రైతులు

రైతుల కష్టం నీటిపాలైంది. సీజన్‌ ప్రారంభంలో ఆశలు రేపిన వానాకాలం... పంట చేతికొచ్చే సమయంలో 

ఊహించని నష్టాన్ని మిగిల్చింది. వానాకాలం సీజన్‌లో ఈసారి గణనీయంగా పంట ఉత్పత్తులు 

చేతికందుతాయనుకున్న రైతుల ఆశలు భారీ వర్షాలతో అడియాశలయ్యాయి. అల్పపీడన ప్రభావంతో

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో 1,55,460 మంది రైతులు 

2,46,461 ఎకరాల్లో పంట నష్ట పోయారు. ప్రధాన పంటలైన వరి, పత్తి, కంది వరద 

నీటిలో మునగడంతో సుమారు 360.06 కోట్లల్లో నష్టం 

వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. 


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ : రంగారెడ్డి జిల్లాలో ఈసారి కురిసిన వర్షాలకు చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌, చౌదరిగూడెం, నందిగామ, ఇబ్రహీంపట్నం, ఫరూక్‌నగర్‌, కొందుర్గు, కందుకూరు మహేశ్వరం, అమనగల్లు, మాడ్గుల మండలాల్లో పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. 422గ్రామాల్లో 1,00,627 ఎకరాల విస్తీర్ణంలో పంటలు నీట మునిగాయి. 78,446 మంది రైతులు సుమారు రూ.150 కోట్లు నష్టపోయినట్లు అంచనా. 22,325 ఎకరాల్లో వరి, 72,441 ఎకరాల్లో పత్తి, 5,191 ఎకరాల్లో కంది, 489 ఎకరాల్లో మొక్కజొన్న, 172 ఎకరాల్లో జొన్న, 9 ఎకరాల్లో చెరుకు పంట నీటి మునిగింది. వర్షాలు తగ్గినా పంట నీట మునిగి ఉండడంతో నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయాధికారులు నీట మునిగిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.


మేడ్చల్‌ జిల్లాలో..

ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి : భారీ వర్షాలకు మేడ్చల్‌ జిల్లాలో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. 94గ్రామాల్లో  వరి, పత్తి, కంది, తదితర పంటలు నేలకొరిగాయి. ప్రస్తుత వర్షాలకు 1454మంది రైతులు సాగు చేసిన 2,607ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది. వరి పంట 2,138 ఎకరాలు, పత్తి 201 ఎకరాలు, ఇతర పంటలను 268 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.10.60కోట్ల మేరకు నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

 

వికారాబాద్‌ జిల్లాలో...

ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ : ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన వర్షాలకు వికారాబాద్‌ జిల్లాలో 256 గ్రామాల్లో 20,897మంది రైతులు సాగుచేసిన 44,328 ఎకరాల్లో పత్తి, కంది, పెసర తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకూ 54,663 మంది రైతులు సాగు చేసిన 98,899 ఎక రాల పంటలకు నష్టవాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. 22,325 ఎకరాల్లో వరి, 72,441 ఎకరాల్లో పత్తి, 5,191 ఎకరాల్లో కంది, 489 ఎకరాల్లో మొక్కజొన్న, 172 ఎకరాల్లో జొన్న, 9 ఎకరాల్లో చెరుకు పంట నీటి మునిగింది. ఈ వానాకాలం సీజన్‌లో వికారాబాద్‌ జిల్లా సాగు విస్తీర్ణం 5,50,106.21 ఎకరాల్లో ఉండగా, భారీ వర్షాలకు 1,43,227 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 2,53,017 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 86,998 ఎకరాల్లో పంట వర్షార్పణమైంది. కంది పంట 1,70,627 ఎకరాల్లో సాగుచేస్తే 33,142 ఎకరాల్లో పంట నష్టపోయారు. పెసర 22,733 ఎకరాల్లో సాగుచేయగా 13,701 ఎకరాలు, వరి 68,297 ఎకరాల్లో సాగు చేయగా 8,191 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న 310, సోయా 300, అలసంద 280, మినుములు 109, చెరుకు 41 ఎకరాల్లో నష్టం జరిగింది. వానాకాలం సీజన్‌లో 75,560 మంది రైతులు పంటలు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ నష్టం మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టం రూ.200 కోట్లకు పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2020-10-28T10:07:57+05:30 IST