కొవిడ్‌ పరీక్షలు ఎప్పుడో?

ABN , First Publish Date - 2020-06-23T09:41:51+05:30 IST

కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌

కొవిడ్‌ పరీక్షలు ఎప్పుడో?

ప్రభుత్వం ఆదేశించినా ప్రారంభించని వైద్యశాఖ


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీతోపాటు పరిసర జిల్లాల్లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని ఆదేశించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 వేల మందికి కొవిడ్‌ నిర్దారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. సర్కార్‌ ప్రకటించిన జిల్లాల్లో ఈనెల 16వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభించినా.. వికారాబాద్‌ జిల్లాలో ఇంకా శ్రీకారం చుట్టలేదు. ఎనిమిది, పది రోజుల్లో కరోనా పరీక్షలు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ వారం గడుస్తున్నా జిల్లాలో కొవిడ్‌ నిర్దారణ పరీక్షలు ప్రారంభించకపోవడం గమనార్హం. 


వికారాబాద్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైన వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో కరోనా పరీక్షలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గ పరిధిలో అయిదు వేల నమూనాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వెయ్యి నమూనాల వంతున మూడు నియోజకవర్గాల పరిధిలో 3వేల వరకు నమూనాలు సేకరిస్తారని భావించారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులు, వారి కుటుంబాలు, కొవిడ్‌ ప్రభావిత ప్రాంతాలు, కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో  నిర్దారణ పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పరీక్షలు పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువు ముగియడానికి వస్తున్నా ఇంకా వికారాబాద్‌ జిల్లాలో పరీక్షలు ప్రారంభించలేదు. 


మూడు నియోజకవర్గాల్లో తీవ్రత

జిల్లాలో వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది. మొదటి విడతలో ఏప్రిల్‌ 4 నుంచి అదేనెల 19వ తేదీ వరకు మొత్తం 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వికారాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌ పట్టణంలో 31 పాజిటివ్‌ కేసులు నమోదవగా, తాండూరులో 4, పరిగిలో 2, మర్పల్లిలో ఒక కేసు నమోదైంది. 38 కేసుల్లో ఒకరు మృతి చెందగా, మిగతా 37 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఇదిలాఉంటే, రెండవ విడతలో పరిగి నియోజకవర్గంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మే నెలాఖరు నుంచి ఇప్పటివరకు మరో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇద్దరు మృతి చెందగా, మిగతావారు చికిత్స తీసుకుంటున్నారు. కులకచర్ల మండలం, బండివెల్కిచర్లలో 3, వికారాబాద్‌లో 3, యాలాల్‌ మండలం, దౌలాపూర్‌లో 3, దోమ మండలం, దొంగ ఎన్కేపల్లిలో 2, ధారూరు మండలం, గట్టేపల్లి, పూడూరు మండలం, కంకల్‌, తాండూరు మండలం, అంతారం, పూడూరు మండలం, కంకల్‌, తాండూరులో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది.


కాగా, బషీరాబాద్‌ మండలం, పర్వత్‌పల్లిలో ఒకరు, పరిగి మండలం, సయ్యద్‌పల్లిలో మరొకరు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులకు వెళ్లి అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. వారి మృతదేహాలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వారిలో పాజిటివ్‌ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వం ఆదేశించిన కొవిడ్‌ నిర్దారణ పరీక్షలు జిల్లాలో ఇంకా ప్రారంభించకపోవడం గమనార్హం.

Read more