నాణ్యమైన విద్యే ‘దేవేంద్ర’ లక్ష్యం
ABN , First Publish Date - 2020-02-08T11:49:09+05:30 IST
పోటీ ప్రపంచంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను

మహేశ్వరం : పోటీ ప్రపంచంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను బోధించడమే ధ్యేయంగా దేవేంద్రవిద్యాలయ ముందుకు సాగుతుందని మాజీ ఎంపీ తూళ్ల దేవేందర్‌గౌడ్ అన్నారు. మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోగల దేవేంద్ర విద్యాలయం 15వ వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన దేవేందర్‌గౌడ్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రయివేటు విద్యాసంస్థలు వ్యాపార ధోరణికి తావివ్వకుండా ప్రతి విద్యార్థికి సాంకేతికపరమైన విద్యను అందించడానికి ప్రయత్నించాలని అన్నారు. 15 సంవత్సరాలుగా దేవేంద్రవిద్యాలయం ఎంతో మంది పేద విద్యార్థులకు సాయన్నగౌడ్ మెమోరియల్‌ట్రస్టు ద్వారా ఉచిత విద్యను కూడా అందించిందని తెలిపారు.
పేదలు వారి పిల్లల ఉన్నత చదువుల కోసం రాత్రనక పగలనకు కాయ కష్టం చేసి చదివిస్తుంటారని అలాంటి తల్లిదండ్రుల ఆశలు నెరవేరాలంటే విద్యార్థులు కృషి పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే విధంగా స్థిరపడాలని సూచించారు. దేవేంద్రవిద్యాలయలో చదువుతున్న ప్రతి విద్యార్థి క్రమశిక్షణగల విద్యను అభ్యసించడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. పాఠశాలలో ప్రతి తరగతిలో ప్రతిఏటా మంచి ఫలితాలు సాధిస్తూ రాష్ట్ర స్తాయిలో గుర్తింపు తేవడంతో విద్యార్థులకే కాకుండా విద్యాబోధన చేస్తున్న అధ్యాపకబృందాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. 15 సంవత్సరాలుగా దేవేంద్రవిద్యాలయలో విద్యనభ్యసించి ఆర్మీ, నేవీ, డాక్టర్, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు సంపాదించి పాఠశాల పేరును ప్రపంచానికి చాటుతున్న పూర్వ విద్యార్థులను కూడా అభినందిస్తున్నట్లు తెలినారు. వార్షికోత్సం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఆటలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విజయేందర్‌గౌడ్, వీరేందర్‌గౌడ్, శ్యాంప్రసాద్, రవీందర్‌గౌడ్, శ్వేత, ప్రిన్సిపాల్ మాధవీశాస్ర్తి, వైస్ ప్రిన్సిపాల్ ఉషారాణి, కార్యనిర్వాహక అధికారి ఇక్బాల్, విద్యార్థులు పాల్గొన్నారు.