అడుగడుగునా ఆటంకాలే!

ABN , First Publish Date - 2020-12-28T05:05:37+05:30 IST

అడుగడుగునా ఆటంకాలే!

అడుగడుగునా ఆటంకాలే!
పాత తాండూరు రైల్వే గేటు పడటంతో నిలిచిన వాహనాలు, ఆగిన ప్రజలు

అరగంటకోసారి పడుతున్న పాత తాండూరు రైల్వేగేటు

వద్ద రాకపోకలకు వాహనదారులు, ప్రజల అవస్థలు

నెరవేరని ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ హామీ

తాండూరు :  జిల్లాలో తాండూరు ప్రధానమైన పట్టణం. తాం డూరు పట్టణం నుంచి పాత తాండూరుకు వెళ్లే దారిలో రైల్వే గేటు ఉంది. ఇక్కడి నుంచి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అరగంటకోసారి రైల్వేగేటు పడుతుంది. దీంతో అటు రాకపోకలు సా గించే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత తాండూరు ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా ఇక్కడ ఓవర్‌ బ్రిడ్జి ని ర్మాణానికి మోక్షం లభించడం లేదు. దీనికోసం గతంలో కేంద్ర మం త్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేకమార్లు హామీలిచ్చారు. ఆచరణలో మాత్రం అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా గతంలో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి ఓకే చెప్పారు. కానీ ఇప్పటి వరకు కనీసం పునాదిరాయి కూడా పడలేదు. ప్రముఖ జాతీయ నేత దివంగత ఎస్‌.జైపాల్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సమయంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. తన హయాంలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కూడా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు. పలుమార్లు కేంద్ర మంత్రిని  కూడా కలిశారు. ప్రస్తుత తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కూడా పాత తాండూరు ప్రజలకు ఇబ్బందులు లేకుండా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఎంపీగా ఉన్న సమయంలో పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రస్తుత ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర మంత్రితో చర్చించారు. కానీ పలుమార్లు అందరూ ఎంపీలుగా ఎన్నికయ్యాక కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపారు. కానీ బ్రిడ్జి నిర్మాణం మాత్రం దశాబ్దకాలంగా పెండింగ్‌లోనే ఉంది. కనీసం పునాదిరాయి కూడా పడలేదు. దీని నిర్మాణం పూర్తయితే పాత తాండూరుతోపాటు నారాయణపూ ర్‌, మంతట్టి తదితర గ్రామాల ప్రజలకు కూడా దూరభారం తగ్గుతుంది.  కేంద్ర నిధులతోపాటు ఈ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర నిధులు కూడా కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర బడ్జెట్‌లో కూడా ఇక్కడ ఆర్వోబీ నిర్మాణానికి నిధులు కేటాయించి రెండేళ్లు గడిచింది. పనులు మాత్రం హామీలకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా తాండూరు, పాత తాండూరు నడుమ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులు తీర్చాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-28T05:05:37+05:30 IST