ప్రభుత్వాధికారులకే ఉపాధి బాధ్యతలు.. టెక్నికల్ అసిస్టెంట్ల అధికారాల్లో కోత
ABN , First Publish Date - 2020-07-27T17:23:51+05:30 IST
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వాధికారులకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించారు. ఇంజనీరింగ్ శాఖకు ఈ పనులను కేటాయించనున్నారు. తాత్కాలిక ఉద్యోగులను కేవలం కూలీల పనులకే పరిమితం చేశారు. ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానాల్లో పంచాయతీ కార్యదర్శులకు పూర్తి బాధ్యతలను అప్పగించారు

పీఆర్ ఇంజనీరింగ్ విభాగానికి పనుల బదలాయింపు
ఇప్పటికే ఎఫ్‌ఏలను తొలగించి, కార్యదర్శులకు అప్పగింత
టీఏ, ఈసీ, ఏపీవోలకు ఇంజనీరింగ్ పనుల మినహాయింపు
తాండూరు(ఆంధ్రజ్యోతి) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వాధికారులకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించారు. ఇంజనీరింగ్ శాఖకు ఈ పనులను కేటాయించనున్నారు. తాత్కాలిక ఉద్యోగులను కేవలం కూలీల పనులకే పరిమితం చేశారు. ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానాల్లో పంచాయతీ కార్యదర్శులకు పూర్తి బాధ్యతలను అప్పగించారు. రెండో దశలో టీఏల పనులను కుదిస్తూ ఇంజనీరింగ్ విభాగంలోని ఏఈలకు ఈ పనులను అప్పగించారు. చెరువుల్లో పూడికతీత, కొత్త ఫీడర్ చానళ్ల నిర్మాణం, కొత్త ఫీల్డ్ ఛానళ్ల ఏర్పాటు, కాల్వల్లో మట్టి తొలగింపు, చెక్ డ్యామ్‌లలో పూడికతీత, గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామం నిర్మాణ పనులను నేరుగా ఇంజనీరింగ్ అధికారి(ఎన్‌ఈవో)కే ప్రభుత్వం అప్పగించింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనిచేసే మండల ఇంజనీరింగ్ అధికారి పోస్టును ఇటీవల ఎన్‌ఈవోగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై ఉపాధి పనులను పూర్తిస్థాయిలో ఎన్‌ఈవోలే పర్యవేక్షించనున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ప్రతీ పని అంచనా వ్యయం కూలీలు చేసే పని మదింపు, ఎంబీ రికార్డు, టెక్నికల్ అసిస్టెంట్లు చూస్తున్నారు. ఆపై మండల స్థాయిలో ఉండే ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు చెక్కు జారీ చేస్తున్నారు. వీరిద్దరిపై ఏపీవో అజమాయిషీ చేసేవారు. అయితే, తాజాగా టెక్నికల్ అసిస్టెంట్లు సహా ఈసీ, ఏపీవో పనులకు కూడా కోత పడింది. ఇంజనీరింగ్ పనుల గుర్తింపు, అంచనా ప్రతిపాదనలు, ఈ-మస్టర్ తయారీ, ఏంబీ రికార్డు మొదలు చెక్కు జారీ చేసే విధులను ఎన్‌ఈవో, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకే ప్రభుత్వం కట్టబెట్టింది. తద్వారా కోట్లాది రూపాయల విలువైన పనుల నుంచి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న టీఏ, ఈసీ, ఏపీవోలను ప్రభుత్వం వ్యూహాత్మకంగా తప్పించింది. ఆ మేరకు ఎన్‌ఈవోలకు ప్రత్యేక లాగిన్ ఐడీని కూడా ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది.