పరిహారం చెల్లింపులో పరిహాసం
ABN , First Publish Date - 2020-07-08T10:47:52+05:30 IST
తాండూరు-పెద్దేముల్ రోడ్డులోని గాజీపూర్ సమీపంలో రూ.9కోట్ల వ్యయంతో చేపట్టిన చెక్‌డ్యాం కం బ్రిడ్జి పనులు మూడేళ్లుగా నిర్మాణ దశలోనే ఉంది.

మూడేళ్లుగా నిలిచిన గాజీపూర్ బ్రిడ్జి నిర్మాణ పనులు
రైతుకు పరిహారం చెల్లింపులో రెవెన్యూ శాఖ మెలిక
నెగోషియేషన్ కమిటీ నిర్ణయించినా పట్టించుకోని వైనం
తాండూరు : తాండూరు-పెద్దేముల్ రోడ్డులోని గాజీపూర్ సమీపంలో రూ.9కోట్ల వ్యయంతో చేపట్టిన చెక్‌డ్యాం కం బ్రిడ్జి పనులు మూడేళ్లుగా నిర్మాణ దశలోనే ఉంది. దాని నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో రెవెన్యూ శాఖ చుక్కలు చూపిస్తున్నది. ఇప్పటికే ఈ బ్రిడ్జికి సంబంధించి 8స్లాబులకు గాను 6 స్లాబలు పూర్తిచేశారు. 2018లో ఆర్‌అండ్‌బీ అధికారులు వాహనాల రాకపోకల కోసం హైలెవల్ బ్రిడ్జి నిర్మించారు. అప్పట్లో మార్కెట్‌లో ఎకరా భూమికి రూ.25లక్షల ధర ఉంది. అయితే అప్పటి జిల్లా కలెక్టర్ ఒమర్ జలీల్ ఎకరాకు రూ.16లక్షలుగా నేగోషియేషన్ కమిటీ ద్వారా ధర నిర్ణయించారు.
ఈ మేరకు ఈ డబ్బును నెలరోజుల్లో చెల్లిస్తామని అప్పటి మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో ఆర్డీవో వేణుమాధవరావు హామీ ఇచ్చారు. దీంతో 2018 జూలై 13న మినిట్స్ బుక్‌లో కూడా రూ.16లక్షల చొప్పున చెల్లించాలని రాశారు. తర్వాత కలెక్టర్ మారడంతో పరిహారాన్ని కుదించారు. కేవలం రూ.4లక్షల 60వేలు చెల్లిస్తామని రైతులకు తేల్చి చెప్పారు. దీంతో రైతులు తాము తీవ్రంగా నష్టపోతున్నామని పరిహారం చెల్లించాలని రెండేళ్లుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పరిహారం చెల్లింపు విషయంలో ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని రైతులు కలిసినప్పుడు మంత్రి స్వయంగా కలెక్టర్‌కు ఫోన్ చేసి భూముల విలువ ప్రకారం రైతులకు పరిహారం పెంచి నివేదిక పంపాలని ఆదేశించారు. అయినా ప్రస్తుత ధర ప్రకారం పరిహారం చెల్లించకుండా రూ.4లక్షల 60వేలు ఫైనల్ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కాగ్నా నది వంతెన కూలడంతో కనువిప్పు కలిగిన రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని, పనులు పూర్తి చేసేందుకు ముం దుకొచ్చారు.
బీటలు వారిన కోకట్ కాగ్నా నది బ్రిడ్జి
యాలాల : రాస్నం-కోకట్ మార్గంలోని కోకట్ కాగ్నా బ్రిడ్జి కింది భాగంలో బీటలు వారి ప్రమాదకరంగా మారింది. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కాగ్నా పొంగి పొర్లింది. దీంతో బ్రిడ్జి కింది భాగంలో ఒక పక్క బీటలు వారి ప్రమాదం నెలకొంది. మళ్లీ వరద వస్తే కోకట్ కాగ్నా బ్రిడ్జి కొట్టుకుపోయే ప్రమాదముంది. ఈ విషయంలో ప్రమాదం జరుగకముందే బ్రిడ్జికి మరమ్మతు పనులు చేపడితే ప్రమాదాన్ని నివారించవచ్చునని పలువురు ప్రయాణికులు పేర్కొంటున్నారు.
కాగ్నా పాత బ్రిడ్జిపై రాకపోకలు షురూ..
తాండూరు-కొడంగల్ రోడ్డులోని కాగ్నా నది పాత బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు చేసి సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కాగ్నా నది పాత బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో తాండూరు-మహబూబ్‌నగర్, కొడంగల్, బషీరాబాద్ తదితర ప్రాంతాలకు రాకపోకలు స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కూలిన బ్రిడ్జికి నాపరాతి ముక్కలు, మొరంతో మరమ్మతులు చేయిం చారు. వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.