నిర్లక్ష్యంపై వేటు

ABN , First Publish Date - 2020-03-18T05:38:23+05:30 IST

కూలీలకు స్థానికంగానే పని కల్పించి వలసలు అరికట్టడమే ముఖ్య ఉద్దేశంగా అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని మరింత పకడ్బందీగా

నిర్లక్ష్యంపై వేటు

172 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్ల సస్పెన్షన్‌

జిల్లాలో ఇక మిగిలింది 46 మందే..

అరకొర సిబ్బందితో ఉపాధి పనులు ఊపందుకునేనా?

పనితీరు బాగుంటేనే ఉద్యోగం

లక్ష్యం చేరుకోలేదో ఎఫ్‌ఏల జీతంలో కోతే? 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కూలీలకు స్థానికంగానే పని కల్పించి వలసలు అరికట్టడమే ముఖ్య ఉద్దేశంగా అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే యేడాదిలో 40రోజుల పనిని కల్పించని ఫీల్డ్‌ అసిస్టెంట్‌లపై చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 185మంది ఎఫ్‌ఏలను సస్పెన్షన్‌ చేశారు. ఈనెల 10న 13 మందిపై వేటు విఽధించగా మంగళవారం 172 మంది ఫీల్డు అసిస్టెంట్లను సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక జిల్లాలో మిగిలింది 46 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లే. కూలీలకు పనిని కల్పించడంలో లక్ష్యం చేరుకోని ఎఫ్‌ఏల జీతంలో కోత విధిస్తున్నారు. పనితీరు బాగుంటేనే ఉద్యోగం.. లేదంటే ఇంటికే. ఎఫ్‌ఏలపై పని కల్పించే లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా ఈనెల 12 నుంచి సమ్మెబాట పట్టారు.  దీంతో ఉపాధిపనులు కల్పించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు.

 

జిల్లావ్యాప్తంగా 231మంది ఫీల్డ్‌అసిస్టెంట్లు ఉన్నారు. ఏడాదిలో ప్రతి కుటుంబానికి వంద రోజులు పని దినాలు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కనీసం 40 రోజుల పని దినాలను కల్పించాల్సిన బాధ్యత ఎఫ్‌ఏలదే. గ్రామీణాభివృద్థి శాఖ సర్క్యులర్‌ 4,779 ప్రకారం ఫీల్డ్‌ అసిస్టెంట్ల పనితీరును బట్టి గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు మూడు గ్రేడ్‌లుగా విభజించారు. 2018 జూలై 1 నుంచి 2019 జూన్‌ 30 వరకు చేపట్టిన పని దినాలను పరిగణలోకి తీసుకొని ఎఫ్‌ఏలను మూడు గ్రేడ్‌లుగా గుర్తించారు. ఏడాదిలో 40 రోజుల పనిదినాలు కల్పించిన వారిని మొదటి జాబితాలో నమోదు చేసి వారి ఉద్యోగాన్ని రిన్యూవల్‌ చేస్తారు. వారికి యధావిధిగా రూ. 10 వేల వేతనం తోపాటు ఇతర అలవెన్సులను అందిస్తారు.


అలాగే 40రోజుల కంటే తక్కువ పనిదినాలు కల్పించిన ఎఫ్‌ఏలను రెండో జాబితాలో చేర్చి సీనియర్‌మేట్‌గా కొనసాగిస్తూ నెలకు రూ. 5 వేల వేతనం చెల్లిస్తారు. ఏడాదిలో కనీసం 10రోజుల కన్నా తక్కువగా పనిదినాలు కల్పించిన వారిని పూర్తిగా తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తారు. ప్రస్తుతం గ్రేడ్‌ వన్‌లో 158, గ్రేడ్‌ 2ఏలో 8, గ్రేడ్‌ 2బీలో ఆరుగురిని చేర్చారు. వీరందరూ కూలీలకు పని కల్పించడం లేదని సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఫీల్డులో 46 మంది మిగిలారు. ఉన్నవారితో ఉపాధి పనులను వేగవంతం చేయగలరా అనే సందేహం నెలకొంది. 


కొనసాగుతున్న సమ్మె

డిమాండ్ల పరిష్కారం సాధనకు నిర్వహిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమ్మె జిల్లాలో కొనసాగుతుంది. ఫీల్డు అసిస్టెంట్లకు విధించిన 40రోజుల పనిదినాల సర్క్యూ లర్‌ నెం.4779/2019 రద్దు చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్టు రెన్యూవల్‌ పూర్తి చేయా లని డిమాండ్‌ చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం రూ. 21వేలు ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న ఎఫ్‌ఏహెచ్‌ఆర్‌ పాలసీని సవరిస్తూ ఫీల్డు అసిస్టెంట్లను ఎఫ్‌టీఈలుగా గుర్తించి ప్రమోషన్‌, బదిలీలు, హెల్త్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన ఎఫ్‌ఏ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం

ఫీల్డు అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించకుంటే.. సమ్మెను ఉధృతం చేస్తాం. ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడుతూ.. సస్పెన్షన్‌ చేయడం మంచిది కాదు. వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలి. కేసీఆర్‌ మొండి వైఖరి మానుకోవాలి. ఫీల్డు అసిస్టెంట్లు ఉద్యోగులే కాదనడం సరైంది కాదు. వెట్టిచారికి చేయించుకుంటున్నారు. 

సిద్దిరాజు కనకాల, తెలంగాణ రాష్ట్ర ఫీల్డ్‌అసిస్టెంట్స్‌  జాయింట్‌ యాక్షన్‌కమిటీ కోకన్వీనర్‌ 

Updated Date - 2020-03-18T05:38:23+05:30 IST