కబ్జాలపై నజర్‌

ABN , First Publish Date - 2020-03-02T11:09:42+05:30 IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నగరానికి చేరువలో ఉండటంతో భూముల విలువ రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ (స్థిరాస్థి) వ్యాపారం

కబ్జాలపై నజర్‌

  • సర్కారు భూముల ఆక్రమణలపై దృష్టి
  • పలుచోట్ల అక్రమ కట్టడాల కూల్చివేత
  • వివిధ కమిషన్ల లేఖలతో పాటు
  • ప్రజావాణి అర్జీలపై సత్వర స్పందన
  • రెవెన్యూ అంశాలపై 15రోజులకోసారి  అధికారుల సమీక్ష
  • 6న అధికారుల ప్రత్యేక సమావేశం
  • పూర్తి నివేదికలతో హాజరువాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆదేశం

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి)

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నగరానికి చేరువలో ఉండటంతో భూముల విలువ రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ (స్థిరాస్థి) వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలు అన్న చందంగా ఉంది. ఒకప్పటి వ్యవసాయ భూములన్నీ కూడా లేఅవుట్లుగా, వెంచర్లుగా మారుతున్నాయి. శివారు మునిసిపాలిటీల్లో, గ్రాపంచాయతీల పరిధిలో విల్లాలు, అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి. భూముల ధరలు పెరిగిపోతుండటంతో, భూ సమస్యలపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు పెద్దఎత్తున అందుతున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని, చెరువుల శిఖం (ఎఫ్‌టీఎస్‌) భూములు, నాలాలు పూడ్చివేస్తున్నారని స్థానికులు అధికారుల దృష్టికి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ సమస్యలపై ప్రజలు చేసే ఫిర్యాదులపై వెంటనే స్పందించేందుకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 15 రెవెన్యూ మండలాలు, 163 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఆయా మండలాల పరిధిలోని వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను అన్యాక్రాంతమయ్యాయి. 


కబ్జాలపై కఠిన చర్యలు


ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను సంరక్షించేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తిస్తూ, బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే వాటిని తొలగిస్తూ కబ్జాలకు పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలను తొలగిస్తూ, ప్రభుత్వ భూమి అని మళ్లీ బోర్డులను పెడుతున్నారు. మండలాల వారీగా రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ఈనెల 6వ తేదీన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ అంశాలపై పూర్తిస్థాయిలో నివేదికలు రూపొందించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. 


అర్జీల్లో రెవెన్యూ అంశాలే అధికం


కలెక్టరేట్‌తో పాటు మండల కార్యాలయాల్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అంశాలపై చాలా వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు అవుతున్నాయని, పహణీ(1బీ)ల్లో తప్పులు దొర్లాయని, పట్టాదారు పాసుపుస్తకాల్లో భూమి తక్కువగా రాశారని, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని, ఆర్వోఆర్‌ చేయాలని, కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నందున తమ పేరుపై భూమిని పట్టా చేయాలని, తదితర సమస్యలపై ప్రజలు అధికారుల దృష్టికి తెస్తున్నారు. ప్రజలు చేస్తున్న ఆయా ఫిర్యాదులపై వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను పంపాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీచేస్తున్నారు. అర్జీదారులకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి వారు దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజలకు సమాధానం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. 


15రోజులకోసారి రెవెన్యూ అంశాలపై సమీక్ష


రెవెన్యూ అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు నిర్ణయించారు. ప్రతి 15రోజులకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, సంబంధిత రెవెన్యూ అఽధికారులు ఈ సమావేశాలకు పూర్తిస్థాయి నివేదికతో రావాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై, ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులపై, వివిధ మండలాల్లోని రెవెన్యూ అంశాలపై రాష్ట్ర, జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మానవహక్కుల కమిషన్ల ద్వారా జిల్లా యంత్రాంగానికి అందుతున్న లేఖలపై వెంటనే స్పందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ మండలాల్లో అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలు, ఎన్వోసీలు (నిరభ్యంతర పత్రాలు), జీవో 58, 59, పట్టదారు పాసుపుస్తకాలు, ల్యాండ్‌ భూ మార్పిడి (కన్‌వర్షన్‌), నాలా పన్ను వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. శివారులోని వివిధ గ్రామాల పరిధిలోని కోర్టు కేసులు కొన్ని సంవత్సరాల తరబడిగా నడుస్తున్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టిని సారించి, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు రెవెన్యూ డివిజన్ల వారీగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈనెల 6వ తేదీన జిల్లాలోని రెవెన్యూ అఽధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ సమస్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Updated Date - 2020-03-02T11:09:42+05:30 IST