ఏళ్లు గడుస్తున్నా...అంతే.!

ABN , First Publish Date - 2020-05-17T09:33:58+05:30 IST

ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ నియామకానికి కలగానే మిగిలింది.

ఏళ్లు గడుస్తున్నా...అంతే.!

ఆమనగల్లు మార్కెట్‌ కమిటీ నియామకానికి వీడని గ్రహణం 

ఆరేళ్లుగా ఆశావహుల ఎదురుచూపులు

పార్టీలో సమన్వయం లేకే ఆగిన నియామకం 

రేసులో పది మంది నాయకులు

చైర్మన్‌ పదివిపై ఎటూ తేల్చని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌


ఆమనగల్లు: ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ నియామకానికి కలగానే మిగిలింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమించ లేదు. దీంతో ఏళ్లుగా ఆశావాహులకు  ఎదురుచూస్తున్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నియామకంలో స్థానిక ఎమ్మెల్యే థోరణి పట్ల ఇటు అశావాహులు, అటు పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నియామకాలు చేపట్టినా, ఆమనగల్లు మార్కెట్‌ కమిటీ పాలకవర్గాన్ని నియమించపోవడం పలువురు నాయకులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో అగ్రనేతల మధ్య గ్రూపు తగాదాలు, సమన్వయ లోపం, ఏకాభిప్రాయం కుదరని కారణంగా పాలకవర్గం ఏర్పాటు కాలేదు. చైర్మన్‌ నియామకం ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ చేతిలోనే ఉంది. అయినప్పటికీ ఏడాది కాలంగా ఆయన పాలకవర్గం నియామకంపై  దాటవేస్తూ వస్తున్నారు. అరేళ్ల క్రితమే పాలకవర్గాన్ని నియమించి ఉంటే ఆశావాహులందరికీ అవకాశం లభించేదని స్థానిక నేతలు పెదవి విరుస్తున్నారు.


ఉన్న నాయకుల్లో ఎవరో ఒకరి పేరు చైర్మన్‌ పదవికి సిఫారసు చేసి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం వల్ల పార్టీకి, అటు అన్నదాతలకు మేలు జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇటీవల, ఈ విషయంపై ఎమ్మెల్యేపై కూడ ఒత్తిడి పెరిగింది. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలతో కలిపి ఆమనగల్లు మార్కెట్‌ కమిటీ కొనసాగుతోంది. చైర్మన్‌ పదవిపై ఆయా మండలాలకు చెందిన పది మంది నాయకులు రేసులో ఉన్నారు. అందులో ప్రధానంగా తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్‌.శ్రీనివాస్‌యాదవ్‌, మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ పోనుగోటి అర్జున్‌రావు, తలకొండపల్లి టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు తోట గిరియాదవ్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పదవిని ఆశీస్తున్న వారందరరూఊ ఇప్పటి వరకు పార్టీ బలోపే తానికి కృషి చేస్తున్న వారే కావడం ఆసక్తికరంగా మారింది. అందులో మరికొందరు ఆర్థికంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారూ ఉన్నారు.


ఈ నేపథ్యంలో ఒకరిని కాదని మరోకరు చైర్మన్‌ పదవి కోసం ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఈ విషయంలో ఎమ్మెల్యే ఉదాసీనంగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లలో వచ్చిన మార్పులతో చాలామంది పోటీ చేసేందుకు అవకాశం రాలే దు. వారు కూడా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవికి తమకే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేను కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికైనా చైర్మన్‌ పదవికి పోటీ పడుతున్న నాయకులను ఎమ్మెల్యే  సమన్వయం చేసి త్వరితగతిన ఆమనగల్లు మార్కెట్‌ కమిటీకి పాలకవర్గాన్ని నియమించాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.


Updated Date - 2020-05-17T09:33:58+05:30 IST