ప్రాణం తీసిన సెల్ఫీమోజు

ABN , First Publish Date - 2020-10-03T09:38:40+05:30 IST

సెల్ఫీ మోజులో చెరువులో దిగిన విద్యార్థుల్లో ఒకరు మృతిచెందగా మరొక విద్యార్థి గల్లంతయిన సంఘటన మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట ..

ప్రాణం తీసిన సెల్ఫీమోజు

సరదా కోసం శామీర్‌పేట పెద్దచెరువు వద్దకు వచ్చిన నగరానికి చెందిన విద్యార్థులు

ముగ్గురు చెరువులో దిగి స్నానం చేస్తుండగా కాలుజారి ఇద్దరి గల్లంతు

అందులో ఒకరి మృతదేహం లభ్యం,

మరొకరి కోసం గాలింపు చర్యలు 

రంగంలోకి దిగిన పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ బలగాలు


శామీర్‌పేట రూరల్‌: సెల్ఫీ మోజులో చెరువులో దిగిన విద్యార్థుల్లో ఒకరు మృతిచెందగా మరొక విద్యార్థి గల్లంతయిన సంఘటన మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని పెద్ద చెరువులో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సఫిల్‌గూడ పాత పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని నివాసం ఉంటున్న సునీత, మురళీ దంపతుల చిన్న కుమారుడు సిజ్జు ఆలియాస్‌ మనీష్‌(16) శ్రీరామకృష్ణ విద్యానికేతన్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన శ్రీదేవి, శ్రీనివాస్‌ దంపతుల రెండో కుమారుడు పింటూ ఆలియాస్‌ ఉత్తేజ్‌(16) శ్రీవాణి నికేతన్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. వీరితో పాటు ఉత్తేజ్‌ సోదరి ఉజ్వళ, మేఘనా, సుమిత్‌, శ్రీధర్‌లు శామీర్‌పేట కట్టమైసమ్మను శుక్రవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు.


అక్కడ నుంచి సరదాగా చెరువులో స్నానం చేయడానికి చెరువులోకి దిగారు. మనీష్‌, ఉత్తేజ్‌, సుమిత్‌లు చెరువులో దిగి ఫొటో తీసుకుంటూ స్నానాలు చేస్తున్నారు. అదే సమయంలో చెరువు గట్టుపై ఉన్న స్నేహితులు ఫొటోలు తీస్తుండగా మనీష్‌, ఉత్తేజ్‌లు ఇంకొంత లోతుకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగారు. నీటి గట్టుపై ఉన్న సుమిత్‌ వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. స్నేహితులు, తన సోదరి కండ్ల ముందే నీట మునిగారు. దీంతో సోదరి ఉజ్వళ ఆర్తనాదాలు చేస్తూ రోదించింది. దీంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాలర్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. సిజ్జు అలియాస్‌ మనీష్‌ అపస్మారక స్థితిలో లభ్యం కాగా వెంటనే పోలీసులు వాహనంలో మేడ్చల్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 


కొనసాగుతున్న గాలింపు చర్యలు 

శామీర్‌పేట పెద్ద చెరువులో గల్లంతయిన ఉత్తేజ్‌ కోసం పోలీసులు, జాలర్లు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికి ఆచూకీ లభించలేదు దీంతో డీఆర్‌ఎఫ్‌ బలగాలను రంగంలోకి దించారు.     

Updated Date - 2020-10-03T09:38:40+05:30 IST