ప్రశ్న, సమాధానం రాజ్యాంగంలోనే దొరుకుతుంది

ABN , First Publish Date - 2020-12-31T05:03:06+05:30 IST

ప్రశ్న, సమాధానం రెండూ రాజ్యాంగంలోనే దొరుకుతాయని,

ప్రశ్న, సమాధానం రాజ్యాంగంలోనే దొరుకుతుంది
సమావేశంలో మాట్లాడుతున్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌

  • ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌


వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి / వికారాబాద్‌ : ప్రశ్న, సమాధానం రెండూ రాజ్యాంగంలోనే దొరుకుతాయని,  అంబేద్కర్‌ కొందరివాడు కాదు.. అందరివాడని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చదవాల్సిందేనని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం వికారాబాద్‌ మండలపరిధిలోని కామారెడ్డిగూడలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రతినెలా 30న నిర్వహించే పౌరహక్కుల దినోత్సవంలో 18శాఖల అధికారులు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. సమస్యలపై చర్చించేందుకే పౌరహక్కుల దినోత్సవం జరుపుతున్నామని, పనిచేయని వారిపై చర్యలు తీసుకునే హక్కు కమిషన్‌కు ఉందన్నారు. కమిషన్‌ ఎలా ఉండాలి అనేది రాజ్యాంగంలో అంబేద్కర్‌ తెలిపారన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు తక్షణ పరిష్కారం కోసం కమిషన్‌ ఏర్పడిందన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటై తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే సమయంలో రాష్ట్రంలో 10,500 కేసులు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటి వరకు 8 వేల కేసులు పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బాధితులకు పునరావాసం కింద రూ.56 కోట్ల పరిహారం ఇప్పించామని ఆయన తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అస్పృశ్యత, అంటరానితనం అధికంగా ఉందని, రాష్ట్రంలో ఇలాంటివి లేకుండా ఉండేందుకు అధికారులు గ్రామస్థాయి నుంచి కృషి చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కలెక్టర్‌ పౌసుమిబసు మాట్లాడుతూ, ప్రతినెలా ఒక గ్రామంలో 30వ తేదీన పౌరహక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ ఒక్కరోజే కాకుండా గ్రామంలో ప్రజలకు సంక్షేమ పథకాలు, తదితర విషయాలు తెలిపేందుకు సర్పంచులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ ఆవరణలో నోటీసుబోర్డు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహనతో పాటు పూర్తివివరాలు అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ, అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని అందరూ సక్రమంగా పాటిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌సభ్యులు విద్యాసాగర్‌, రాంబాల్‌ నాయక్‌, చిలకమర్రి నర్సింహా, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్‌, డీఆర్డీఏ పీడీ కృష్ణన్‌, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబు మోజెస్‌, ఇన్‌చార్జి డీఎస్పీ విజయ్‌కుమార్‌, స్థానిక సర్పంచ్‌ పురుషోత్తంరెడ్డి, ఎంపీడీవో సుభాషిణి, ఉపసర్పంచ్‌ మహేందర్‌రెడ్డి, నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-31T05:03:06+05:30 IST