సార్వత్రిక సమ్మె పాక్షికం

ABN , First Publish Date - 2020-11-27T04:17:46+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం కార్మిక సంఘాలు నిర్వహించిన సార్వత్రిక సమ్మె జిల్లాలో పాక్షికంగా జరిగింది.

సార్వత్రిక సమ్మె పాక్షికం
పరిగిలో నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

  • వామపక్ష , కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు
  • కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం కార్మిక సంఘాలు నిర్వహించిన సార్వత్రిక సమ్మె జిల్లాలో పాక్షికంగా జరిగింది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు తాండూరు, పరిగిలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉప సంహరించుకోవాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పాత ఫించన్‌ పథకాన్ని పునరుద్ధరించాలని, కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే, సార్వత్రిక సమ్మె ప్రభావం బ్యాంకులు, ఎల్‌ఐసీ, ప్రజా రవాణా వ్యవస్థపై ఏమాత్రం పడలేదు. 


తాండూరులో...

తాండూరు/తాండూరు రూరల్‌ : తాండూరులో గురువారం సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌక్‌ వద్ద నిరసన, పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్‌ విజయలక్ష్మీపండిట్‌ ఆధ్వర్యంలో సమస్యలపై నిలదీశారు. తాండూరు మండల పరిధిలోని పెన్నా సిమెంటు కర్మాగారంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌, వ్యవసాయకార్మిక సంఘంజిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దీపక్‌రెడ్డి, షేక్‌ అబ్దుల్లా, రాజమణి, బాలకృష్ణయ్య పాల్గొన్నారు. 


 వికారాబాద్‌లో...

వికారాబాద్‌ : రైతు వ్యతిరేక  వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని  కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశ్‌ అన్నారు. వికారాబాద్‌లో సీఐటీయూ, సీపీఎం, సీపీఐ, ఐఎఫ్‌టీయూ నాయకులు కార్మికులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు మహిపాల్‌, గోపాల్‌ రెడ్డి, గీత, సుభాష్‌, సతీష్‌, కార్మికులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.


కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కొడంగల్‌: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్సచంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకట్‌నరేందర్‌, కొత్తూర్‌ చంద్రయ్య డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు.  కార్యక్రమంలో నాయకులు రమేశ్‌బాబు, కిష్టప్ప, పకీరప్ప, రాములు, వెంకటప్ప, మాణిక్యప్ప, గుండప్ప, బుగ్గప్ప, అంజిలప్ప తదితరులు పాల్గొన్నారు.  


పరిగిలో ర్యాలీ...

పరిగి: దేశవ్యాప్తసమ్మెలో భాగంగా గురువారం పరిగిలో సీఐటీయు, సీపీఎం,సీపీఐ, తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  బస్టాండ్‌ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీఐటీయూ కార్యదర్శి రామకృష్ణ, అంగన్‌వాడీ టీచర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, ఆశవర్కర్ల సంఘం అధ్యక్షురాలు మండమ్మ మాట్లాడుతూ, రైతులకు నష్టం కలిగించే మూడు చట్టాలను రద్దు చేయాలని, ఉపాధిహామీని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మునిసిపాలిటీలో కూడాఉపాధిపథకాన్ని అమలు చేయాలని కోరారు.  కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు హబీబ్‌, రవీందర్‌, వెంకట్‌రాంలు, యాదిగిరి, సీసీఐ నాయకులు పీర్‌ఆహ్మద్‌, ఎం.వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T04:17:46+05:30 IST