అణిచివేతతో ఉద్యమాన్ని ఆపలేరు
ABN , First Publish Date - 2020-11-27T04:40:40+05:30 IST
అణిచివేతతో ఉద్యమాన్ని ఆపలేరు

- సార్వత్రిక సమ్మెలో కార్మిక, ప్రజా సంఘాల నాయకులు
- కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు
- ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు
షాద్‌నగర్ అర్బన్/ ఆమనగల్లు/ కడ్తాల్/ తలకొండపల్లి/ ఇబ్రహీంపట్నం/యాచారం/మంచాల/చేవెళ్ల/మహేశ్వరం/శంషాబాద్ : ప్రభుత్వ అణిచివేతతో కార్మిక ఉద్యమాలు ఆగవని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి పేర్కొన్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆఽధ్వర్యంలో గురువారం షాద్‌నగర్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల సాధన కోసం, పోరాడాలన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ బిల్లు తేవడం సరికాదన్నారు. బీమా సంస్థలను, బ్యాంకులను ప్రైవేట్ చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక వేత్తలకు కాకుండా పనిచేసే కార్మికులకు ప్రభుత్వాలు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ఈశ్వర్‌నాయక్, శ్రీనునాయక్, లలిత, వెంకటేష్, రాజు, సాయిలు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమైన ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంతపూచికత్తుపై విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం విజయవంతమైంది. ఆమనగల్లులో మండల పరిషత్ ఎదుట సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శిబిరంలో కార్మికులు, సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీవైఎ్‌ఫఐ మండల నాయకుడు గజ్జె మల్లేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కాన్గుల వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సడలిస్తూ కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తోందని ధ్వజమెత్తారు. నష్టాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీ, బీఎ్‌సఎన్‌ఎల్, రైల్వే, బ్యాంకింగ్ వంటి సంస్థలను ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. కడ్తాల మండల కేంద్రంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై సంఘాల నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తున్న సీఐటీయూ నాయకులు, కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. తలకొండపల్లిలో సీపీఎం మండల కార్యదర్శి దుబ్బ చెన్నయ్య ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇబ్రహీంపట్నంలో సీఐటీయూ, కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో మున్సిపల్, పంచాయతీ కార్మికులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశాలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఆదిభట్లలో జరిగిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకుని నాయకులను అరెస్టు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు భాస్కర్, ఉపాధ్యక్షుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. యాచారం మండలంలోని వివిధ గ్రామాల్లో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక హక్కులను కాపాడాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంచాల మండలంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ పి.యాదయ్య, రైతుసంఘం జిల్లా నాయకులు శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్ కవిత, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి, ప్రభులింగం, జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణచారి, సుధాకర్‌గౌడ్, చేవెళ్ల డివిజన్ కార్యదర్శి జంగయ్య తెలిపారు. చేవెళ్ల మండల కేంద్రంలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ బ్యాంకులను, దుకాణాలను మూసివేయించారు. దేశవ్యాప్త సమ్మె మహేశ్వరం మండలంలో విజయవంతమైంది. మండల పరిధితో పాటు తుక్కుగూడ మున్సిపాలిటీలోని పరిశ్రమలను ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు మూసివేయించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు రవికుమార్, దత్తునాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం కార్మిక వ్యతిరేక విధానాలను వీడాలని కోరారు. ఎంతో మంది కార్మికులు చాలీచాలని వేతనాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హక్కులు సాధించే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కొత్తూర్ మండల కేంద్రంతో పాటు, పారిశ్రామికవాడలో సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకలు, కార్మికులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. శంషాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
పీఆర్సీని వెంటనే విడుదల చేయాలి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : పీఆర్‌సీని వెంటనే విడుదల చేయాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం కలెక్టరేట్ వద్ద సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ పరిమితి రూ.10 లక్షల వరకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.